సైనాను తప్పుబట్టిన గుత్తా జ్వాల!

4 Apr, 2018 19:47 IST|Sakshi
గుత్తా జ్వాల, సైనా నెహ్వాల్‌ (ఫైల్‌ ఫొటో)

సాక్షి, హైదరాబాద్‌ : తన తండ్రికి ‘టీమ్‌ అఫీషియల్‌’ అక్రిడిటేషన్‌ ఇవ్వకపోతే కామన్వెల్త్‌ గేమ్స్‌ నుంచి వైదొలగుతానని హెచ్చరించిన బ్యాడ్మింటన్‌ స్టార్‌ సైనానెహ్వాల్‌ను ప్రముఖ డబుల్స్‌ షట్లర్‌ గుత్తా జ్వాల తప్పుబట్టారు. తాను టోర్నీలో పాల్గొనే సమయంలో తన కుటుంబ సభ్యుల హోటల్‌, టికెట్స్‌ ఖర్చులు తానే భరించానని, తనకు సైనాలా భారత ఒలింపిక్‌ సంఘం (ఐఓఏ)ను బెదిరించే ఉపాయం తట్టలేదని ఈ డబుల్స్‌ బ్యాడ్మింటన్‌ స్టార్‌ సెటైర్‌ వేశారు. ఆటల్లో బెదరింపులు సమంజసేమేనా అని ప్రశ్నిస్తూ అంటూ ట్వీట్‌ చేశారు.

ఇక హాస్యాస్పదమైన విషయం ఏమిటంటే.. నగదుపురస్కారాలు, అవార్డుల గురించి సోషల్ మీడియాలో ప్రస్తావిస్తే మాత్రం వివాదస్పదం కావు. కానీ ఆట ఆడే హక్కు గురించే ప్రశ్నిస్తే వివాదస్పదం అవుతుంది.’ అని మరో ట్వీట్‌లో పేర్కొన్నారు. 

ఇక సైనా కామన్‌వెల్త్‌ క్రీడా గ్రామంలోకి తన తండ్రి హర్వీర్‌ సింగ్‌ను అనుమతించకపోతే టోర్నీ నుంచి తప్పుకుంటానని హెచ్చరిస్తూ ఐవోఏకు లేఖ రాయడం.. దీనికి వారు స్పందిస్తూ అనుమతినివ్వడం తెలిసిందే. సైనా చేసిన ఈ బ్లాక్‌ మెయిలింగ్‌ క్రీడావర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. భారత ప్రభుత్వం నుంచి అవార్డులు, పురస్కారాలు అందుకున్న ఓ స్టార్‌ క్రీడాకారిణి దేశం కోసం ప్రతిష్టాత్మక క్రీడల్లో బరిలోకి దిగాల్సిన తరుణంలో వ్యక్తి లేదా కుటుంబ ప్రాధాన్యతతో ఉన్నపళంగా ఆడనని తెగేసి చెప్పడం తగదని పలువురు బాహటంగానే విమర్శించారు. పతకాలు గెలిచే క్రీడాకారులు ఆటపైనే ఏకాగ్రత పెట్టాలని ఆకాంక్షిస్తున్న మేం... దీన్ని వివాదాస్పదం చేయదల్చుకోలేదని ఐఓఏ ఓ ప్రకటనలో తెలిపింది.

మరిన్ని వార్తలు