మెరిసిన జ్వాల !

18 Jun, 2018 13:17 IST|Sakshi
బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి గుత్తా జ్వాల

క్రీడా రంగంలోనే  కాకుండా సమాజంలో నెలకొన్న రుగ్మతలపై స్పందించి పోరాటాలు చేసే డాషింగ్‌ స్టార్‌ బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి గుత్తా జ్వాలా  ఆదివారం విజయవాడ నగరంలో మెరిశారు. గేట్‌వే హోటల్‌లో నిర్వహించిన కార్యక్రమంలో రోటరీ క్లబ్‌ ఆఫ్‌ మిడ్‌టౌన్‌ ఆధ్వర్యంలో 2017–18 సంవత్సరానికి ఒకేషనల్‌ ఎక్సలెన్సీ అవార్డు అందుకున్నారు. నేటి తరానికి  నైతిక విలువలు  నేర్పించాలని జ్వాలా సూచించారు. ఆంధ్రప్రదేశ్‌లో క్రైం రేట్‌ పెరిగిపోవడం ఆందోళనకరమని చెప్పారు. తల్లిదండ్రులు తమ పిల్లలను క్రీడల్లో ప్రోత్సహించాలని సూచించారు. డిజిటల్‌ చదువులతో పాటు, ఆటలు కూడా ముఖ్యమేనని తెలిపారు.

లబ్బీపేట(విజయవాడతూర్పు): క్రీడలపై ఆసక్తి, పట్టుదల, ప్రతిభ ఉంటే ప్రపంచ చాంపియన్‌ అయ్యే అవకాశాలు ఉన్నాయని బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి, కోచ్‌ గుత్తా జ్వాల అన్నారు. మరే ఇతర రంగంలోను ఇలాంటి అవకాశాలు ఉండవని ఆమె పేర్కొన్నారు. రోటరీక్లబ్‌ ఆఫ్‌ విజయవాడ మిడ్‌టౌన్‌ ఆధ్వర్యంలో 2017–18 సంవత్సరానికి సంబంధించి ఒకేషనల్‌ ఎక్స్‌లెన్స్‌ అవార్డులను ఆదివారం ప్రదానం చేశారు. ఈ సందర్భంగా బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి గుత్తా జ్వాల, సైంట్‌ లిమిటెడ్‌ కార్పొరేట్‌ అఫైర్స్‌ అధ్యక్షుడు బి. అశోక్‌రెడ్డిలకు ఎక్స్‌లెన్స్‌ అవార్డులను అందించారు. ఈ సందర్భంగా గుత్తా జ్వాల మాట్లాడుతూ  మనం మోరల్‌ ఎథిక్స్‌ను మర్చిపోతున్నామని, వాటిని నేటి తరానికి నేర్పించాలన్నారు.

తల్లిదండ్రులు ఇంజినీరింగ్, మెడిసిన్‌ లాగానే క్రీడలను ప్రొఫెషనల్‌గా చూడాలని పిలుపునిచ్చారు. మరో అవార్డు గ్రహీత బి. అశోక్‌రెడ్డి మాట్లాడుతూ టీమ్‌ వర్క్‌ ఉంటే ఏదైనా సాధించగలమన్నారు. జీవితంలో విలువలు చాలా ముఖ్యమన్నారు. డిజిటల్‌ చదువులతో పాటు, ఆటలు కూడా ముఖ్యమేనన్నారు. శాప్‌ చైర్మన్‌ పి. అంకమ్మ చౌదరి మాట్లాడుతూ క్రీడలను ప్రోత్సహిస్తే ఆరోగ్యంతో పాటు, రాష్ట్రానికి పేరు ప్రఖ్యాతులు వస్తాయన్నారు.  రోటరీ డిస్ట్రిక్‌ గవర్నర్‌ జీవీ రామారావు, మిడ్‌టౌన్‌ అధ్యక్ష, కార్యదర్శులు యడ్ల పార్థసారధి, సతీష్‌చంద్ర, యడవల్లి, ఒకేషనల్‌ సర్వీస్‌ ఉపాధ్యక్షుడు తొండెపు రత్నశ్రీనివాస్‌ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు