జ్వాల హద్దులు దాటుతోంది!

8 Jul, 2015 01:40 IST|Sakshi
జ్వాల హద్దులు దాటుతోంది!

- స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆగ్రహం
- గోపీపై విమర్శలు అర్థరహితమన్న ‘సాయ్’ డెరైక్టర్
బెంగళూరు:
బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల ఇటీవల తరచుగా కోచ్ గోపీచంద్‌తో పాటు క్రీడా శాఖ అధికారులపై చేస్తున్న విమర్శలు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్)కు ఆగ్రహం తెప్పించాయి. తాము అందరు అథ్లెట్లను సమానంగానే చూస్తామని, జ్వాల వ్యాఖ్యలు క్రమశిక్షణా రాహిత్యమని ‘సాయ్’ డెరైక్టర్ జనరల్ ఇంజేటి శ్రీనివాస్ అన్నారు. ‘అంతర్జాతీయ స్థాయిలో ఆటగాళ్లను టోర్నీలకు పంపించడంలో గానీ శిక్షణ ఇవ్వడంలో గానీ మేం ఎలాంటి వివక్షా చూపించలేదు. అందరు అథ్లెట్లను ఒకేలా చూశాం’ అని శ్రీనివాస్ వ్యాఖ్యానించారు.
 
గోపీచంద్ మద్దతిచ్చారు
భారత బ్యాడ్మింటన్ జట్టు చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్‌పై జ్వాల చేస్తున్న విమర్శలను కూడా ‘సాయ్’ డెరైక్టర్ తిప్పికొట్టారు. ఇది డబుల్స్ విభాగాన్ని ప్రోత్సహించడంలో గోపీచంద్ చేసిన కృషిని విస్మరించడమేనని ఆయన అన్నారు. ‘గోపీకి అన్ని విధాలా మేం మద్దతు పలుకుతున్నాం. ఆటగాడిగా, కోచ్‌గా, అడ్మినిస్ట్రేటర్‌గా అతని సమర్థతను ఎవరూ ప్రశ్నించలేరు. ఒక ప్లేయర్ అర్థరహిత విమర్శల వల్ల అతను ఆటకు చేసిన సేవల విలువ తగ్గిపోదు. గోపీపై జ్వాల చేసిన వ్యాఖ్యలు దురుద్దేశపూరితం’ అని శ్రీనివాస్ ఘాటుగా వ్యాఖ్యానించారు.

టార్గెట్ ఒలింపిక్ పోడియం (టాప్)లో జ్వాల, అశ్వినిలను చేర్చకపోవడానికి గోపీచందే కారణమని చేసిన విమర్శలను కూడా ఆయన తప్పు పట్టారు. ‘ఇవన్నీ నిరాధార ఆరోపణలు. నిజానికి ‘టాప్’లో డబుల్స్ ఆటగాళ్లను కూడా చేర్చాలంటూ ప్రత్యేకంగా వీరిద్దరి పేర్లను గోపీచంద్ స్వయంగా గత సమావేశంలో ప్రతిపాదించారు. డబుల్స్ కోసం విదేశీ కోచ్‌ను తీసుకు రావడంలో కూడా అతనిదే కీలక పాత్ర. గోపీలాంటి వ్యక్తిని ఎలాంటి ఆధారాలు లేకుండా విమర్శించడం తప్పు.

ఈ విషయంలో ఆమె లక్ష్మణ రేఖ దాటకూడదు’ అని శ్రీనివాస్ హెచ్చరించారు. ‘టాప్’ కమిటీలో తనను చేర్చమని గానీ తన అకాడమీని జాతీయ శిక్షణా కేంద్రంగా చేయమని గానీ గోపీచంద్ ఎప్పుడూ సిఫారసు చేసుకోలేదని, అతనిపై నమ్మకంతోనే ఈ బాధ్యత ఇచ్చామని, దానిని ఆయన నిలబెట్టుకున్నారని ‘సాయ్’ డెరైక్టర్ తమ కోచ్‌కు మద్దతు ప్రకటించారు.

మరిన్ని వార్తలు