ఆడతా... ఆడిస్తా...

12 Mar, 2017 07:23 IST|Sakshi
ఆడతా... ఆడిస్తా...

గుత్తా జ్వాల బ్యాడ్మింటన్‌ అకాడమీ ప్రారంభం
త్వరలో దేశవ్యాప్తంగా విస్తరణ  


సాక్షి, హైదరాబాద్‌
భారత బ్యాడ్మింటన్‌ అత్యుత్తమ డబుల్స్‌ క్రీడాకారిణి గుత్తా జ్వాల ఆటతో పాటు ఇప్పుడు ఆటగాళ్లను తీర్చి దిద్దేందుకు కూడా సిద్ధమైంది. ఆమె ఆధ్వర్యంలో ‘గ్లోబల్‌ బ్యాడ్మింటన్‌ అకాడమీ’ శనివారం ఇక్కడ ప్రారంభమైంది. నగరంలోని కూకట్‌పల్లిలో ఈ అకాడమీని నెలకొల్పారు. దీంతో పాటు హైదరాబాద్‌ వ్యాప్తంగా వేర్వేరు ప్రాంతాల్లో ఇప్పటికే అందుబాటులో ఉన్న 25 కోర్టులను కూడా ఇక నుంచి గ్లోబల్‌ అకాడమీనే నిర్వహిస్తుంది. గతంలో ఆంధ్రప్రదేశ్‌ స్పోర్ట్స్‌ అథారిటీ (శాప్‌)లో కోచ్‌గా పని చేసిన గోవర్ధన్‌ రెడ్డి ఈ అకాడమీ ప్రధాన కోచ్‌గా వ్యవహరించనుండగా, ‘ద్రోణాచార్య’ ఎస్‌ఎం ఆరిఫ్‌ కూడా శిక్షణలో పాలుపంచుకుంటారు. ప్రస్తుతానికి మాత్రం జ్వాల కోచింగ్‌ ఇవ్వకుండా పర్యవేక్షణకే పరిమితం కానుంది.

‘దాదాపు ఏడాది కాలంగా నా మనసులో ఉన్న ఆలోచన ఇప్పుడు వాస్తవరూపం దాల్చింది. చిన్నారులు, వర్ధమాన షట్లర్లకు అత్యుత్తమ సౌకర్యాలతో శిక్షణ అందించడం అకాడమీ లక్ష్యం. ఇక సింగిల్స్, డబుల్స్‌కు ఇక్కడ సమాన ప్రాధాన్యత లభిస్తుంది. డబుల్స్‌ శిక్షణ విషయంలో వివక్ష ఉండదు’ అని జ్వాల పేర్కొంది. తమ అకాడమీ లక్ష్యం ఒలింపియన్లను తయారు చేయడమే అని ఈ దశలోనే చెప్పడం అతిశయోక్తిగా అనిపిస్తుందని, ప్రతిభ ఉండి తగిన అవకాశాలు దక్కించుకోలేకపోతున్న ఆటగాళ్లను ప్రోత్సహించడమే తమ ముందున్న కర్తవ్యమని జ్వాల వ్యాఖ్యానించింది.

హైదరాబాద్‌లో ఇప్పటికే ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పుల్లెల గోపీచంద్‌ అకాడమీతో పాటు పలు ఇతర అకాడమీలు కూడా పని చేస్తున్నాయి. వాటితో తాను పోల్చుకోవడం లేదని జ్వాల వెల్లడించింది. ‘ఆరోగ్యకరమైన పోటీ ఉండటం మంచిదే. కోచ్‌గా గోపీచంద్‌ ఘనతలను గౌరవిస్తాను. అయితే మరిన్ని అకాడమీలు ఉండటం వల్ల నష్టమేమీ లేదు. కుర్రాళ్లకు మరిన్ని అవకాశాలు లభిస్తే మంచిదే కదా’ అని ఆమె అభిప్రాయపడింది.

మరోవైపు తాను క్రీడాకారిణిగా ఇంకా రిటైర్‌ కాలేదని 33 ఏళ్ల జ్వాల స్పష్టం చేసింది. గత జనవరిలో మలేసియా మాస్టర్స్‌ గ్రాండ్‌ప్రి గోల్డ్‌ టోర్నీలో మనూ అత్రితో కలిసి మిక్స్‌డ్‌ డబుల్స్‌ విభాగంలో పాల్గొన్న జ్వాల రెండో రౌండ్‌ను దాటలేకపోయింది. ‘ప్లేయర్‌గా ఇంకా రాణించగల సత్తా నాలో ఉంది. ర్యాంకు తక్కువగా ఉండటం వల్ల నేను ఎక్కువ టోర్నీలు ఆడటం లేదు. ఇప్పుడు చిన్న టోర్నీలతో మొదలు పెట్టాల్సి ఉంది. అయితే సీనియర్‌ సర్క్యూట్‌లో 18 ఏళ్లుగా నిరంతరాయంగా ఆడుతున్నాను కాబట్టి ఈ మాత్రం విరామం అవసరమని భావించా’ అని జ్వాల చెప్పింది. ప్రస్తుతం మహిళల డబుల్స్‌లో జ్వాల 28వ ర్యాంక్‌లో, మిక్స్‌డ్‌ డబుల్స్‌లో 340వ ర్యాంక్‌లో ఉంది.

రూ. 25 కోట్ల పెట్టుబడి...
జ్వాలకు చెందిన గ్లోబల్‌ అకాడమీకి ఆర్థికపరంగా ఫ్రాంచైజ్‌ ఇండియా–నాకౌట్‌ వెల్‌నెస్‌ ల్యాబ్స్‌ సంస్థ అండగా నిలుస్తున్నాయి. అకాడమీ నిర్వహణ కోసం ప్రాథమికంగా ఈ సంస్థ రూ. 25 కోట్లు వెచ్చిస్తుండటం విశేషం. ‘బ్యాడ్మింటన్‌ కోచింగ్‌కు కొత్త తరహాలో మార్గనిర్దేశనం చేయాలనే ఆలోచనతో ఇందులోకి అడుగుపెట్టాం. దశలవారీగా అకాడమీని విస్తరించి దేశవ్యాప్తంగా ప్రముఖ నగరాల్లో 50 వరకు శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేయడమే మా లక్ష్యం. లాభనష్టాల గురించి అప్పుడే ఆలోచించడం లేదు’ అని నాకౌట్‌ వెల్‌నెస్‌ సహ యజమాని మోహిత్‌ వర్మ వెల్లడించారు.

అకాడమీ ప్రారంభోత్సవం సందర్భంగా ఫ్రాంచైజ్‌ ఇండియా–నాకౌట్‌ వెల్‌నెస్‌ ల్యాబ్స్‌ సంస్థ సహ యజమాని మోహిత్‌ వర్మ, జ్వాల

మరిన్ని వార్తలు