‘టాప్’లో ఉండే అర్హత లేదా?

3 Apr, 2015 03:21 IST|Sakshi
‘టాప్’లో ఉండే అర్హత లేదా?

 మమ్మల్ని ప్రోత్సహించేది ఎవరు?
 క్రీడా శాఖపై జ్వాల విమర్శ
 
 న్యూఢిల్లీ: టార్గెట్ ఒలింపిక్ పోడియం (టాప్)... ఒలింపిక్స్‌లో పతకాలకు అవకాశమున్న క్రీడల నుంచి ఆయా క్రీడాకారులను ఎంపిక చేసి అత్యుత్తమ శిక్షణ ఇవ్వడం కోసం కేంద్రం ప్రవేశపెట్టిన పథకం ఇది. అయితే బ్యాడ్మింటన్‌లో ఈ స్కీమ్ కింద ఎంపిక చేసిన ఆటగాళ్ల జాబితాపై డబుల్స్ క్రీడాకారిణి గుత్తా జ్వాల విమర్శలు గుప్పించింది. ప్రభుత్వం నియమించిన కమిటీ ఎంపిక చేసిన జాబితాలో సైనా, కశ్యప్, శ్రీకాంత్, సింధు, ప్రణయ్, గురుసాయిదత్ ఉన్నట్లు సమాచారం. డబుల్స్‌లో తాను, అశ్విని అగ్రస్థానంలో ఉన్నా ‘టాప్’లో పేర్లు లేకపోవడం దారుణమని జ్వాల పేర్కొంది.
 
 ‘నాకు, అశ్వినికి ఇప్పటిదాకా భారత ప్రభుత్వం మద్దతు మాత్రమే ఉండేది. ఇప్పుడు అది కూడా లేకపోతే ఎలా? ఆ జాబితాలో ఉన్న వారికి ఇప్పటికే కార్పొరేట్స్ మద్దతు ఉంది. మాకు గుర్తింపు రావాలంటే ఇంకా ఏం చేయాలో అర్థం కావడం లేదు.  అటు బ్యాడ్మింటన్ సంఘంతో పాటు ఇప్పుడు ప్రభుత్వం కూడా నిరుత్సాహపరచడం భావ్యం కాదు.  ప్రస్తుతం మేం ప్రపంచ స్థాయిలో 19వ ర్యాంకులో ఉన్నాం. రియో ఒలింపిక్స్‌కు అర్హత సాధించే అవకాశం ఉంది’ అని జ్వాల వివరించింది. ‘టాప్’లో తమకు చోటు కల్పించి ప్రోత్సహించాల్సిందిగా జ్వాల, అశ్విని కేంద్రానికి లేఖ రాశారు.
 

whatsapp channel

మరిన్ని వార్తలు