జ్యోతి సురేఖ డబుల్‌ ధమాకా

16 Jun, 2019 05:54 IST|Sakshi
జ్యోతి సురేఖ

ప్రపంచ ఆర్చరీ చాంపియన్‌షిప్‌లో

రెండు కాంస్య పతకాలు గెలిచిన ఆంధ్రప్రదేశ్‌ అమ్మాయి

ఎస్‌–హెర్టోజెన్‌బాష్‌ (నెదర్లాండ్స్‌): కొన్నేళ్లుగా అంతర్జాతీయస్థాయిలో నిలకడగా రాణిస్తున్న ఆంధ్రప్రదేశ్‌ ఆర్చర్‌ వెన్నం జ్యోతి సురేఖ ప్రపంచ చాంపియన్‌షిప్‌లోనూ అదరగొట్టింది. విజయవాడకు చెందిన 22 ఏళ్ల జ్యోతి సురేఖ ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్‌లో రెండు కాంస్య పతకాలను సొంతం చేసుకుంది. తొలుత ముస్కాన్‌ కిరార్, రాజ్‌ కౌర్‌లతో కలిసి జ్యోతి సురేఖ మహిళల కాంపౌండ్‌ టీమ్‌ విభాగంలో కాంస్యం దక్కించుకోగా... ఆ తర్వాత వ్యక్తిగత విభాగంలో మరో కాంస్యం గెల్చుకుంది. కాంస్య పతక పోరులో జ్యోతి సురేఖ, ముస్కాన్, రాజ్‌ కౌర్‌ బృందం 229–226తో యెసిమ్‌ బోస్టాన్, గిజెమ్‌ ఎల్మాగాక్లి, ఇపెక్‌ టామ్‌రుక్‌లతో కూడిన టర్కీ జట్టుపై గెలిచింది.

భారత జట్టు విజయంలో జ్యోతి సురేఖ కీలకపాత్ర పోషించింది. ఆమె సంధించిన ఎనిమిది బాణాల్లో ఆరు ‘10’ షాట్‌లు ఉండటం విశేషం. యెసిమ్‌ బోస్టాన్‌ (టర్కీ)తో జరిగిన వ్యక్తిగత విభాగం కాంస్య పతక మ్యాచ్‌లో జ్యోతి సురేఖ ‘షూట్‌ ఆఫ్‌’లో పైచేయి సాధించింది. నిర్ణీత 15 బాణాల తర్వాత ఇద్దరూ 145–145 పాయింట్లతో సమంగా నిలిచారు. విజేతను నిర్ణయించేందుకు ఇద్దరికీ ఒక్కో బాణం అవకాశం ఇచ్చారు. ఇందులో జ్యోతి సురేఖ గురికి 10 పాయింట్లు రాగా... యెసిమ్‌ బాణానికి తొమ్మి ది పాయింట్లే వచ్చాయి. నేడు పురుషుల రికర్వ్‌ టీమ్‌ విభాగంలో తరుణ్‌దీప్‌ రాయ్, రమేశ్‌ ప్రవీణ్‌ జాదవ్, అతాను దాస్‌లతో కూడిన భారత జట్టు స్వర్ణం కోసం తలపడనుంది. చైనా జట్టుతో భారత్‌ అమీతుమీ తేల్చుకోనుంది.

24: తన ఎనిమిదేళ్ల కెరీర్‌లో జ్యోతి సురేఖ సాధించిన అంతర్జాతీయ పతకాల సంఖ్య. ఇందులో మూడు స్వర్ణాలు, 11 రజతాలు, 10 కాంస్యాలు ఉన్నాయి.   
 
‘రెండేళ్ల క్రితం టీమ్‌ విభాగంలో మేం రజత పతకం సాధించాం. ఈసారి కాంస్యం దక్కినా ఎలాంటి నిరాశ లేదు. ఎందుకంటే వరుసగా రెండో ప్రపంచ చాంపియన్‌ షిప్‌లోనూ టాప్‌–3లో నిలిచాం. ఈ పతకం మా అందరికీ ఎంతో ప్రత్యేకం. ఇక వ్యక్తిగత విభాగంలో నాకిది తొలి ప్రపంచ చాంపియన్‌షిప్‌ పతకం. ఒకదశలో కొంచెం నెర్వస్‌గా ఫీలయ్యాను. కానీ నా అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వాలని ప్రయత్నించాను. నా ప్రత్యర్థి నుంచి కూడా గట్టిపోటీ ఎదురుకావడంతో కాస్త ఒత్తిడికి లోనయ్యాను. షూట్‌ ఆఫ్‌లో మాత్రం కంగారు పడకుండా గురి చూసి కొట్టాను. ’’ 
–జ్యోతి సురేఖ

మరిన్ని వార్తలు