ఈ హాఫ్‌ సెంచరీ నాకు చాలా ప్రత్యేకం

7 May, 2018 12:12 IST|Sakshi
కేఎల్‌ రాహుల్‌

ఇండోర్‌: రాజస్తాన్‌ రాయల్స్‌తో ఆదివారం ఇండోర్‌ స్టేడియంలో జరిగిన ఐపీఎల్‌ మ్యాచ్‌లో కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ 6 వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. పంజాబ్‌ను విజయతీరాలకు చేర్చడంలో ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌ పాత్ర మరువరానిది. ఈ మ్యాచ్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌ విధించిన 152 పరుగుల లక్ష్యాన్ని పంజాబ్‌ 18.4 ఓవర్లలో ఛేదించింది. పంజాబ్‌ సాధించిన ఈ విజయంలో రాహుల్‌ పాత్ర కీలకం. అజేయ అర్ధ సెంచరీతో జట్టుకు విజయాన్ని అందించాడు.

అద్భుతమైన బౌండరీలతో చివరివరకూ కొనసాగి జట్టుకు విజయం అందించాడు. ఈ మ్యాచ్‌లో రాహుల్‌ 54 బంతుల్లో 7 బౌండరీలు, 3 సిక్స్‌లు బాది  84 పరుగులు సాధించాడు. మ్యాచ్‌ ముగిసిన తర్వాత రాహుల్‌ మాట్లాడుతూ... ‘నేను చేసిన హాఫ్‌ సెంచరీల్లో నాకు నిజంగా తృప్తినిచ్చిన మొదటి అర్ధ శతకం ఇదే. జట్టును గెలిపించడం కోసం చివరి వరకూ ఆడాను. ఐపీఎల్‌ నా ఆత్మ విశ్వాసాన్ని రెట్టింపు చేసింది. ఇంకా బాగా రాణించి మా జట్టుకు మరిన్ని విజయాలు అందించాలని భావిస్తున్నాను. నాపై నేను నమ్మకం ఉంచడం వల్లే ఇంత బాగా ఆడగలిగాను. అందుకే మరీ జాగ్రత్తగా ఆడకుండా మంచి షాట్స్‌ను కొట్టగలిగాను. టి20ల్లోనూ బాగా రాణిస్తాననే నమ్మకం కలిగింద’ని అన్నాడు.

అదేవిధంగా ఈ మ్యాచ్‌లో తనకు మద్దతుగా నిలిచిన బ్యాట్సమెన్‌ నాయర్‌, స్టోనిస్‌లకు గురించి చెబుతూ.. ‘నాకు జతగా ఎవరైనా ఉంటే బాగుండు అన్పించింది. ఆ విషయంలో కరుణ్‌, స్టోనిస్‌లు చాలా బాగా తోడ్పడ్డారు. వారు కూడా మంచి స్కోరు సాధించార’ని అన్నాడు. రాహుల్‌కు జతగా కరుణ్‌ నాయర్‌(31), స్టోనిస్‌(23 నాటౌట్‌)లు ఆకట్టుకున్నారు.

మరిన్ని వార్తలు