సౌత్‌ ఏషియన్‌ గేమ్స్‌కు ‘కూత’ వేటు దూరంలో...!

7 Nov, 2019 13:33 IST|Sakshi
మూల శివగణేష్‌రెడ్డి

ఇండియన్‌ కబడ్డీ ప్రాబబుల్స్‌కు ఎంపికైన పెండ్లిమర్రి క్రీడాకారుడు

సీమ నుంచి ఎంపికైన గ్రామీణ ఆణిముత్యం

శుభాకాంక్షలు తెలిపిన కబడ్డీ సంఘం ప్రతినిధులు

కబడ్డీ.. కబడ్డీ అంటూ కూతపెడుతూ గ్రామసీమల్లో సరదాగా ఆడుకునే ఆట నుంచి దేశసరిహద్దులు దాటిఅంతర్జాతీయస్థాయి పోటీల్లో పాల్గొనే అవకాశం మూల శివగణేష్‌రెడ్డికి లభించింది. నేపాల్‌లో నిర్వహింనున్న సౌత్‌ ఏషియన్‌ గేమ్స్‌లో పాల్గొనే ఇండియన్‌ కబడ్డీ జట్టు ప్రాబబుల్స్‌లో చోటు సంపాదించాడు. ఈనెల 26వ తేదీ వరకు హర్యాణలోని రోహ్‌తక్‌లో నిర్వహించే ఇండియన్‌ కబడ్డీ టీం సన్నాహక క్యాంపునకు ఈయన ఎంపికయ్యాడు. అక్కడ సత్తాచాటితే సౌత్‌ ఏషియన్‌ గేమ్స్‌లో పాల్గొనే ఇండియన్‌ టీంకు ప్రాతినిథ్యం వహించే అవకాశాలు ఉన్నాయి. దేశానికి ప్రాతినిత్యం వహించడమే తన లక్ష్యమని చెబుతున్న మూల శివగణేష్‌రెడ్డిపై ప్రత్యేక కథనం..

కడప స్పోర్ట్స్‌ : వైఎస్‌ఆర్‌ జిల్లా పెండ్లిమర్రి మండలం గోపాలపురం గ్రామానికి చెందిన మోటార్‌మెకానిక్‌ రామసుబ్బారెడ్డి, నాగమల్లమ్మ దంపతుల కుమారుడైన మూల శివగణేష్‌రెడ్డికి అరుదైన అవకాశం లభించింది. కాగా శివగణేష్‌రెడ్డి ఈ యేడాది నిర్వహించిన ప్రొ కబడ్డీ లీగ్‌ పోటీల్లో తెలుగుటైటాన్స్‌ జట్టుకు ఎంపికయ్యాడు. రాయలసీమ నుంచి ప్రొకబడ్డీకి ఎంపికైన తొలి క్రీడాకారుడుగా ఈయన చరిత్ర సృష్టించాడు. ఇప్పటి వరకు రాష్ట్రం నుంచి ముగ్గురు క్రీడాకారులు మాత్రమే ప్రొ కబడ్డీలో వివిధ ప్రాంఛైజీలకు ప్రాతినిథ్యం వహించగా అందులో శివగణేష్‌రెడ్డి ఒకరు కావడం విశేషం. నవంబర్‌ 28 నుంచి డిసెంబర్‌ 11వ తేదీ వరకు నేపాల్‌లో నిర్వహించనున్న సౌత్‌ఏషియన్‌ గేమ్స్‌లో పాల్గొనే ఇండియన్‌ జట్టుకు సన్నాహక క్యాంపు నిర్వహిస్తున్నారు. ఈ క్యాంపులో పాల్గొనే క్రీడాకారులకు ఈనెల 5 నుంచి 26వ తేదీ వరకు ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. ఈ క్యాంపునకు రాష్ట్రం నుంచి మూల శివగణేష్‌రెడ్డికి అవకాశం లభించింది. క్యాంపులో వీరు చూపే ప్రతిభ ఆధారంగా ఇండియన్‌ టీం తుది జట్టును ప్రకటించనున్నారు.

తల్లిదండ్రులతో శివగణేష్‌రెడ్డి
మూడు సంవత్సరాల కాలంలోనే అసమాన్య ప్రతిభ..
తన సోదరుడు జనార్ధన్‌రెడ్డి కబడ్డీ క్రీడలో రాణిస్తుండటం చూడటంతో పాటు ఆయన సైతం ప్రోత్సహించడంతో ఇంటర్‌ పూర్తయిన తర్వాత కబడ్డీ సాధన ప్రారంభించాడు. కబడ్డీ శిక్షకుడు టి. జనార్ధన్‌ ఆధ్వర్యంలో కబడ్డీలో ఓనమాలు దిద్దుకున్న ఈయన అనతికాలంలోనే పలు అవకాశాలను దక్కించుకున్నాడు. 2018లో నరసాపురంలో నిర్వహించిన జాతీయస్థాయి కబడ్డీ పోటీల్లో ఏపీ జట్టుకు ప్రాతినిథ్యం వహించి రన్నరప్‌గా నిలిచారు. అదే విధంగా ఈ యేడాది ముంబైలోని రోహులో నిర్వహించిన సీనియర్‌ నేషనల్స్‌ కబడ్డీ చాంపియన్‌షిప్‌ పోటీల్లో సైతం ఏపీ నుంచి ప్రాతినిథ్యం వహించాడు. గత సీజన్‌లో ప్రొ కబడ్డీ ఎంపికలకు వెళ్లిన ఈయన తృటిలో జట్టులో అవకాశం కోల్పోయాడు. వైజాగ్‌లో నిర్వహించిన క్యాంపులో ఈయన ప్రతిభను గుర్తించిన తెలుగుటైటాన్‌ నిర్వాహకులు తెలుగుటైటాన్స్‌లో ఆల్‌రౌండర్‌గా అవకాశం కల్పించారు. ప్రొకబడ్డీ లీగ్‌ ఏడోసీజన్‌ కోసం నిర్వహించిన వేలంలో శివగణేష్‌రెడ్డిని రూ. 6లక్షలకు టైటాన్స్‌ జట్టు సొంతం చేసుకుంది. ఈ సీజన్‌లో తెలుగుటైటాన్స్‌ నుంచి ఈయన ప్రొ కబడ్డీలో సత్తాచాటారు.  కాగా ఈయన ప్రస్తుతం విజయవాడలో ఇండియన్‌ కబడ్డీ సాయ్‌ కోచ్‌ పద్మజబాల పర్యవేక్షణలో శిక్షణ పొందుతున్నాడు.

కబడ్డీ సంఘం ప్రతినిధులు హర్షం..
ఇండియన్‌ కబడ్డీ కోచింగ్‌ క్యాంపునకు శివగణేష్‌రెడ్డి ఎంపికకావడం పట్ల జిల్లా కబడ్డీ అసోసియేషన్‌ అధ్యక్షుడు ఎస్‌. గోవర్ధన్‌రెడ్డి, కార్యదర్శి చిదానందగౌడ్, కోశాధికారి టి.జనార్ధన్‌ సంతోషం వ్యక్తం చేశారు.

దేశానికి ప్రాతినిథ్యం వహించడమే లక్ష్యం..
దేశానికి ప్రాతినిథ్యం వహించడమే నా లక్ష్యం. మాది సాధారణ కుటుంబం. అటువంటి కుటుంబం నుంచి వచ్చిన నాకు ఇంత మంచి అవకాశం లభించడం సంతోషంగా ఉంది. భారత జట్టుకు ప్రాతినిథ్యం వహించే అవకాశం కోసం ఎదురుచూస్తున్నా.– మూల శివగణేష్‌రెడ్డి, ఇండియన్‌ కబడ్డీ టీం క్రీడాకారుడు, కడప

మరిన్ని వార్తలు