ఇంతకంటే అధ్వాన్నం ఉండదు!

20 Jul, 2020 14:12 IST|Sakshi

నువ్వు సహజసిద్ధంగా ఆడు..

భారత్‌పై మ్యాచ్‌ గెలవడానికి అదే ప్రేరణ

ఇంజమామ్‌ మాటల్ని గుర్తు చేసుకున్న కమ్రాన్‌

కరాచీ: దాదాపు 14 ఏళ్ల క్రితం పాకిస్తాన్‌లో పర్యటించిన భారత క్రికెట్‌ జట్టులో సభ్యుడైన ఇర్ఫాన్‌ పఠాన్‌ హ్యాట్రిక్‌ సాధించిన సంగతి తెలిసిందే. కరాచీలో జరిగిన టెస్టు మ్యాచ్‌లో ఇర్ఫాన్‌ పఠాన్‌ తన స్వింగ్‌ బౌలింగ్‌తో చెలరేగిపోయాడు. ఈ క్రమంలోనే ఓపెనర్‌ సల్మాన్‌ భట్‌తో పాటు మహ్మద్‌ యూసఫ్‌, యూనిస్‌ ఖాన్‌లను వరుస బంతుల్లో ఔట్‌ చేసి హ్యాట్రిక్‌ సాధించి తొలి ఓవర్‌ ఆ ఫీట్‌ నమోదు చేసిన భారత బౌలర్‌గా నిలిచాడు. అదే సమయంలో పాకిస్తాన్‌పై హ్యాట్రిక్‌ సాధించిన మొదటి బౌలర్‌గా నిలిచాడు.కాగా, ఆ మ్యాచ్‌లో ఇర్ఫాన్‌ హ్యాట్రిక్‌ వికెట్లతో చెలరేగిపోయినా పాకిస్తాన్‌నే విజయం వరించింది.  

తొలి ఇన్నింగ్స్‌లో పాకిస్తాన్‌ 39 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన సమయంలో కమ్రాన్‌ అక్మల్‌ సెంచరీతో మెరిశాడు. పాకిస్తాన్‌ జట్టులో అప్పుడు కొత్తగా అడుగుపెట్టిన అక్మల్‌పై ఎటువంటి ఒత్తిడి లేకుండా శతకం నమోదు చేశాడు. అయితే తాను సెంచరీ చేయడానికి మాజీ కెప్టెన్‌ ఇంజమాముల్‌ హక్‌ ఇచ్చిన సలహానే కారణమన్నాడు.  క్రిక్‌ కాస్ట్‌ యూట్యూబ్‌ చాట్‌లో 2006 కరాచీ టెస్టు మ్యాచ్‌ విశేషాల్ని కమ్రాన్‌ గుర్తు చేసుకున్నాడు. ‘ నిజం చెప్పాలంటే నా మైండ్‌లో ఏమీ లేదు. అప్పటికే ఇర్ఫాన్‌ హ్యాట్రిక్‌ వికెట్లు సాధించి మా జట్టును కష్టాల్లోకి నెట్టాడు. నేను కూడా కొత్త ముఖాన్నే. దాంతో పెద్దగా ఒత్తిడి తీసుకోలేదు. ఆ మ్యాచ్‌కు ఇంజీ భాయ్‌ వెన్నుగాయంతో దూరమయ్యాడు. (గంగూలీ చేసిందేమీ లేదు!)

కాకపోతే డ్రెస్సింగ్‌ రూమ్‌లో ఇంజీ ఒక్కటే చెప్పాడు. ఇప్పటికే జరిగిన నష్టం చాలా పెద్దది. ఇంతకంటే అధ్వానం ఏమీ ఉండదు. నువ్వు మాత్రం ఎటువంటి ఒత్తిడి తీసుకోవద్దు. నీ సహజసిద్ధమైన ఆటనే ప్రదర్శించు. భారత్‌పై ఎలా ఆడతావో అలానే ఆడు. ఆస్ట్రేలియాలో సెంచరీ చేసిన విషయాన్ని గుర్తుపెట్టుకో. కేవలం నీ నేచురల్‌ గేమ్‌ను మాత్రమే ఆడు. ఏదీ జరిగినా పర్వాలేదు. ఇప్పటికే చాలా పెద్ద నష్టం జరిగింది. నువ్వు ఎలా ఆడిన ఇంతకంటే అధ్వానం కాదు’ అని ఇంజీ తనలో ప్రేరణ నింపినట్లు కమ్రాన్‌ తెలిపాడు. దాంతోనే తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ సాధించడంతో కీలక భాగస్వామ్యాలు నెలకొల్పి పాక్‌ను పటిష్ట స్థితిలో నిలిపినట్టు తెలిపాడు. ఇదే తమ విజయానికి బాటలు వేసిందన్నాడు. అది తన కెరీర్‌లోనే అత్యుత్తమ మ్యాచ్‌ అని ఈ సందర్భంగా కమ్రాన్‌ పేర్కొన్నాడు.  ఆ మ్యాచ్‌ తొలి ఇన్నింగ్స్‌లో పాకిస్తాన్‌ 245 పరుగులకు ఆలౌట్‌ కాగా, కమ్రాన్‌ 113 పరుగులు చేశాడు. ఇక మొదటి ఇన్నింగ్స్‌లో భారత్‌ 238 పరుగులకే ఆలౌట్‌ కాగా, పాకిస్తాన్‌ తన రెండో ఇన్నింగ్స్‌లో 599/7 వద్ద డిక్లేర్డ్‌ చేసింది. ఫలితంగా భారత్‌కు 607 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించగా 265 పరుగులకే చాపచుట్టేయడంతో పాకిస్తాన్‌ 341 పరుగుల తేడాతో విజయం సాధించింది. 

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు