బాధ్యతగా ఆడాలి: విలియమ్సన్‌

7 Jun, 2019 04:57 IST|Sakshi
రాస్‌ టేలర్‌

లండన్‌: బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో స్వల్ప వ్యవధిలో కోల్పోయిన వికెట్లతో ఇబ్బందులెదురయ్యాయని న్యూజిలాండ్‌ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ చెప్పాడు. బ్యాట్స్‌మెన్‌ మరింత బాధ్యతగా ఆడాల్సివుందని అన్నాడు. ‘ఈ మ్యాచ్‌లో ఇరు జట్ల ఫీల్డింగ్‌ అద్భుతం. మొదట బంగ్లా చక్కగా బ్యాటింగ్‌ చేసింది. పిచ్‌ పరిస్థితుల దృష్ట్యా 250 మెరుగైన స్కోరే! దీంతో ఛేదనలో వికెట్లు కాపాడుకుంటే మంచిదని భావించాం. బ్యాటింగ్‌లో కష్టపడితేనే విజయం దక్కుతుంది. అయితే రెండు సార్లు స్వల్పవ్యవధిలో కోల్పోయిన వికెట్లతో కష్టాల్లో పడ్డాం. చివరకు విజయం సాధించినందుకు ఆనందంగా ఉంది’ అని విలియమ్సన్‌ అన్నాడు.

బంగ్లాదేశ్‌తో బుధవారం అర్ధరాత్రి దాటాక ముగిసిన ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ 2 వికెట్ల తేడాతో గట్టెక్కింది. మొదట బంగ్లాదేశ్‌ 49.2 ఓవర్లలో 244 పరుగులు చేసింది. న్యూజిలాండ్‌ 47.1 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 248 పరుగులు చేసి గెలిచింది. ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ రాస్‌ టేలర్‌ (91 బంతుల్లో 82; 9 ఫోర్లు) కివీస్‌ విజయంలో కీలకపాత్ర పోషించాడు. పది ఓవర్లలోపే ఓపెనర్లు గప్టిల్‌ (25), మున్రో (24) వికెట్లను కివీస్‌ కోల్పోయింది. ఆ తర్వాత విలియమ్సన్‌ (40; 1 ఫోర్‌), టేలర్‌ మూడో వికెట్‌కు 105 పరుగులు జోడించారు. ఆ తర్వాత కివీస్‌ వరుస క్రమంలో వికెట్లు కోల్పోయినా... చివర్లో టెయిలెండర్‌ సాన్‌ట్నర్‌ (17 నాటౌట్‌; 2 ఫోర్లు) పట్టుదలగా ఆడటంతో న్యూజిలాండ్‌ గట్టెక్కింది.

మరిన్ని వార్తలు