రోహిత్‌ శర్మ, కోహ్లిపై కివీస్‌ కెప్టెన్‌ ప్రశంసలు

9 Jul, 2019 08:43 IST|Sakshi

మాంచెస్టర్‌ : రికార్డుల వేటగాడు, హిట్‌మ్యాన్‌ రోహిత్‌ శర్మపై కివీస్‌ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ ప్రశంసలు కురిపించాడు. ప్రపంచకప్‌లో తన ప్రదర్శన అద్భుతంగా ఉందని కొనియాడాడు. ఈ మెగాటోర్నీలో అత్యుత్తమంగా రాణిస్తున్న ఏకైక ఆటగాడు రోహితే అనడంలో ఏమాత్రం సందేహంలేదన్నాడు. ఇక క్రికెట్‌ ప్రపంచంలో టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి ఎదుగుదలను ప్రత్యక్షంగా చూసిన వాడిలో తానూ ఒకడినని విలియమ్సన్‌ పేర్కొన్నాడు. అండర్‌-19 వరల్డ్‌కప్‌ సమయంలో కోహ్లి దూకుడుగా ఆడటం చూశానని.. ఇప్పుడు కూడా తను అదే ఆటతీరుతో దూసుకుపోతున్నాడని కితాబిచ్చాడు. ప్రపంచకప్‌లో భాగంగా మంగళవారం ఓల్డ్‌ ట్రఫోర్డ్‌ మైదానంలో టీమిండియా-న్యూజిలాండ్‌ జట్ల మధ్య తొలి సెమీ ఫైనల్‌ మ్యాచ్‌ జరుగనున్న సంగతి తెలిసిందే.

చదవండి : ఇద్దరు కెప్టెన్లు... వరల్డ్‌కప్‌లో అరుదైన ఘట్టం!

ఈ నేపథ్యంలో ప్రీ-మ్యాచ్‌ కాన్ఫరెన్స్‌లో కేన్‌ విలియమ్సన్‌ మాట్లాడుతూ మంగళవారం నాటి మ్యాచ్‌లో తమ జట్టులోని ప్రతీ ఆటగాడు సరికొత్త ఉత్సాహంతో మైదానంలో దిగుతాడన్నాడు. ఇది తమకు సవాలుతో కూడుకొన్న మ్యాచ్‌ అన్నాడు. ‘ అసలు ఇదంతా ఆలోచించనే లేదు. ఇటువంటి పెద్ద వేదికపై దేశం తరఫున జట్టును ముందుండి నడిపించడం నాకు చాలా ప్రత్యేకం. ఇది నిజంగా నా అదృష్టం. ఇక ఆట విషయానికొస్తే మా బౌలింగ్‌ అటాక్‌ చాలా బాగుంది. పరిస్థితులను తమకు తగ్గట్లుగా మలచుకోవడంలో మా బౌలర్లు దిట్ట. టోర్నీ ఆసాంతం అద్భుత బౌలింగ్‌తో అదరగొట్టారు. సెమీస్‌ చేరేందుకు మేము అన్ని విధాలా అర్హులమే. సెమీ ఫైనల్‌లో కచ్చితంగా మా అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తాం. టీమిండియా కూడా సూపర్‌ బౌలింగ్‌ అటాక్‌తో దుసుకుపోతోంది. వాళ్లది ఒక సమతౌల్యమైన జట్టు. అండర్‌డాగ్స్‌గా బరిలో దిగినా పరిస్థితులకు అనుగుణంగా ఆడి పోరాటపటిమ కనబరుస్తాం’ అని కివీస్‌ కెప్టెన్‌ ధీమా వ్యక్తం చేశాడు.

చదవండి : లార్డ్స్‌ దారిలో కివీస్‌ అడ్డంకి

కాగా ప్రపంచకప్‌లో రోహిత్‌ శర్మ ఇప్పటికే 647 పరుగులు సాధించాడు. సచిన్‌ పేరిట ఉన్న ఆల్‌టైమ్‌ వరల్ట్‌ కప్‌ రికార్డు (673)ని దాటేందుకు కేవలం 27 పరుగుల దూరంలో ఉన్న అతను సెమీస్‌లోనూ చెలరేగితే భారత్‌కు తిరుగుండదు. కాబట్టి అతడిని ఆపేందుకు కివీస్‌ తమ ‘ట్రంప్‌ కార్డ్‌’ ట్రెంట్‌ బౌల్ట్‌ను ప్రయోగిస్తుందనడంలో సందేహం లేదు. ముఖ్యంగా లెఫ్టార్మ్‌ పేసర్లు వేసే ఇన్‌స్వింగర్లను ఎదుర్కోవడంలో అతని బలహీనత చాలా సార్లు బయటపడింది. వార్మప్‌ మ్యాచ్‌లో కూడా బౌల్ట్‌ సరిగ్గా ఇలాంటి బంతితోనే రోహిత్‌ను ఎల్బీగా ఔట్‌ చేశాడు. ఈసారి రోహిత్‌ అతడిని ఎంత బాగా ఎదుర్కొంటాడో చూడాలి. వన్డేల్లో బౌల్ట్‌ బౌలింగ్‌లో 136 బంతులు ఎదుర్కొన్న రోహిత్‌ 64.7 స్ట్రయిక్‌ రేట్‌తో 88 పరుగులు మాత్రమే చేయగలిగాడు. నాలుగుసార్లు అతని బౌలింగ్‌లో ఔటయ్యాడు. కాబట్టి బౌల్ట్‌ బౌలింగ్‌లో రోహిత్‌ రికార్డు గొప్పగా లేకపోవడం కాస్త ఆందోళన కలిగించే విషయమే.

మరిన్ని వార్తలు