బుమ్రాకు మద్దతిచ్చిన కివీస్‌ కెప్టెన్‌

12 Feb, 2020 17:24 IST|Sakshi

మౌంట్ మాంగనుయ్ : చేతిలో బంతి ఉంటే భారత పేసర్ జస్‌ప్రీత్‌ బుమ్రా ఎంతో ప్రమాదకారి అని, అయితే అతని బౌలింగ్‌లో కాస్త పదును పెరగాల్సిన అవసరం ఉందని న్యూజిలాండ్‌ కెప్టెన్ కేన్ విలియమ్సన్‌ పేర్కొన్నాడు. మంగళవారం న్యూజిలాండ్‌తో జరిగిన మూడో మ్యాచ్‌లో భారత్ 5 వికెట్ల తేడాతో ఓటమిపాలై  0-3తో సిరీస్‌ను కోల్పోయి వైట్‌వాష్‌ అయిన సంగతి తెలిసిందే. కివీస్‌తో జరిగిన సిరీస్‌లో దారుణంగా విఫలమైన బుమ్రాపై పలువురు మాజీ క్రికెటర్లు విమర్శలు సందిస్తున్న వేళ కివీస్‌ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ మాత్రం అతనికి మద్దతుగా నిలిచాడు. (అందుకే ఓడిపోయాం: విలియమ్సన్‌)

'అన్ని ఫార్మాట్‌లో ఇప్పటికే బుమ్రా ప్రపంచ స్థాయి బౌలర్‌గా తనేంటో నిరూపించుకున్న విషయం మనందరికి తెలుసు. ప్రస్తుతం అతడు బాగానే బౌలింగ్‌ చేస్తున్నాడు. చేతిలో బంతి ఉంటే బుమ్రా ఎంతో ప్రమాదకరం. కానీ అతడి బౌలింగ్‌లో కాస్త పదును పెరగాల్సిన అవసరం ఉంది. బుమ్రా విషయంలో టీమిండియాకు ఎలాంటి అనుమానాలు వద్దు. ఏ సమయంలోనైనా పుంజుకోగలడు' అని కేన్‌ విలియమ్సన్‌ తెలిపాడు.

ప్రపంచ నంబర్‌ వన్‌ బౌలర్‌ గుర్తింపు పొందిన బుమ్రా న్యూజిలాండ్‌ సిరీస్‌లో మాత్రం ఒక సాధారణ బౌలర్‌లా బౌలింగ్‌ చేయడం అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తింది. కనీసం ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. భారత్ జట్టులోకి అరంగేట్రం చేసిన తర్వాత ఓ ద్వైపాక్షిక సిరీస్‌లో బుమ్రా కనీసం ఒక్క వికెట్ కూడా పడగొట్టలేకపోవడం ఇదే తొలిసారి కావడం విశేషం.గత ఏడాది గాయం కారణంగా మూడు నెలలు క్రికెట్‌కి దూరమైన బుమ్రా.. ఈ ఏడాది ఆరంభంలో తిరిగి  జట్టులోకి రీఎంట్రీ ఇచ్చాడు. అయితే పునరాగమనంలో మునుపటిలా బౌలింగ్ చేయలేకపోతున్నాడు. ముఖ్యంగా డెత్ ఓవర్లలో తన పదునైన యార్కర్లని సంధించడంలో తేలిపోతున్నాడు. భారత్-న్యూజిలాండ్ మధ్య ఈ నెల 21 నుంచి రెండు టెస్టుల సిరీస్ ప్రారంభంకానుండగా.. కనీసం టెస్టుల్లోనైనా బుమ్రా తన మ్యాజిక్‌ను చూసిస్తాడేమో చూడాలి.(అరె! అచ్చం బుమ్రాను దింపేశాడుగా)

మరిన్ని వార్తలు