'కెరీర్‌లో ధోనీ చివరిదశలో ఉన్నాడు'

28 Feb, 2020 12:46 IST|Sakshi

నోయిడా : ఈ ఏడాది అక్టోబర్‌లో జరగనున్న టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనాలంటే ఎంఎస్‌ ధోనీ ఈసారి వీలైనన్ని ఐపీఎల్‌ మ్యాచ్‌లు ఆడాలని భారత క్రికెట్‌ దిగ్గజం కపిల్‌ దేవ్‌ అభిప్రాయపడ్డాడు. హెచ్‌సీఎల్‌ 5 వ వార్షికోత్సవం గ్రాండ్‌ ఈవెంట్‌ను గురువారం నోయిడాలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన కపిల్‌ ధోనిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ' ఐపీఎల్‌లో ధోనీ ఒక్కడే ఆడట్లేదు. ప్రస్తుతం క్రికెట్‌ ప్రపంచంలోకి ఎంతో మంది యువ ఆటగాళ్లు వస్తున్నారు. వారిలో మనం గర్వించే ఆటగాళ్లను వచ్చే పదేళ్లలో చూడనున్నాం.నా దృష్టిలో ధోనీ ఇప్పటికే దేశానికి చాలా సేవలందించాడు. అయితే ఒక అభిమానిగా మాత్రం ధోనీ టీ20 ప్రపంచకప్‌ జట్టులో ఉండాలని కోరుకుంటున్నా. ఇదంతా జట్టును ఎంపిక చేసే మేనేజ్‌మెంట్‌పై ఆధారపడి ఉంటుంది. కాగా ధోని అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమై ఏడాది పూర్తి కావొస్తోంది. అక్టోబర్‌లో మొదలయ్యే టీ20 విశ్వసమరంలో పాల్గొనే టీమిండియా జట్టులో ఉండాలంటే ధోని వచ్చే ఐపీఎల్‌లో వీలైనన్ని ఎక్కువ మ్యాచ్‌లు ఆడాలి. ధోని తన కెరీర్‌లో చివరి దశలో ఉన్నాడు. ఒక అభిమానిగా తను జట్టులో ఉండాలని కోరుకుంటున్నా.. కానీ కొత్త తరానికి కూడా అధిక ప్రాధాన్యమిస్తా' అని పేర్కొన్నాడు. (ధోని.. ఈసారి పిచ్‌ను దున్నేశాడుగా..!)

ఇక కివీస్‌ పర్యటనలో వరుసగా తమ ఆటతీరులో విఫలమవుతూ వస్తున్న జస్‌ప్రీత్‌ బుమ్రా, విరాట్‌ కోహ్లిల ప్రదర్శనపై ఆందోళన అక్కర్లేదని కపిల్ తెలిపాడు. 'ఆటగాళ్లు గాయపడి తిరిగి జట్టులోకి వచ్చినప్పుడు వారు నిలదొక్కుకునేందుకు కొంత సమయం తీసుకుంటారు. ఇప్పుడు బుమ్రా కూడా అదే స్టేజీలో ఉన్నాడు. వెన్నుముక గాయం నుంచి కోలుకొని తిరగివచ్చిన బుమ్రా కివీస్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో వికెట్లు తీయడంతో విఫలమయ్యాడు. ఒక బ్యాట్స్‌మెన్‌ ఒక మంచి ఇన్నింగ్స్‌ కోసం ఎలా ఐతే ఎదురుచూస్తాడో.. ఒక బౌలర్‌ కూడా గుడ్‌స్పెల్‌ కోసం అదే విధంగా ఎదురుచూస్తాడు. కోహ్లి ప్రదర్శనపై ఎలాంటి ఆందోళన అవసరం లేదు. అతను ఏ పరిస్థితుల్లోనైనా పుంజుకునే అవకాశం ఉందని' తెలిపాడు.(అలా అయితే ఐపీఎల్‌ మానేయండి: కపిల్‌)

కివీస్‌తో జరిగిన తొలి టెస్టులో కేఎల్‌ రాహుల్‌ను తీసుకోకపోవడాన్ని తప్పు పట్టాల్సిన అవసరం లేదని, అది జట్టు మేనేజ్‌మెంట్‌ నిర్ణయమని కపిల్‌ పేర్కొన్నాడు. తొలి టెసుట్లో టీమిండియా ఘోరంగా ఓటమి పాలవడం క్రైస్ట్‌చర్చిలో శనివారం నుంచి జరగనునన్న రెండో టెస్టులో ఎలాంటి ప్రభావం చూపదన్నాడు. ఇంతకుముందు కూడా ఫాస్ట్‌, బౌన్సీ పిచ్‌లపై షార్ట్‌బాల్స్‌తో తడబడినా టీమిండియా ఫుంజుకుందని తెలిపాడు. ఇక మహిళల టీ20లో అప్రతిహాత విజయాలతో దూసుకెళ్తున్న మహిళల జట్టును కపిల్‌ ప్రశంసించారు. మహిళల జట్టు బాగా ఆడుతోందని, పైనల్లో గెలిచి ఎలాగైనా కప్‌ గెలవాలని తాను మనస్పూర్తిగా కోరుకుంటున్నట్లు కపిల్‌దేవ్‌ వెల్లడించాడు. (మార్చి 2న మైదానంలోకి ధోని)

మరిన్ని వార్తలు