'వరల్డ్ కప్ గెలవడానికి అతనే కారణం'

13 Feb, 2017 11:54 IST|Sakshi
'వరల్డ్ కప్ గెలవడానికి అతనే కారణం'

బెంగళూరు:1983లో కపిల్ దేవ్ నేతృత్వంలోని భారత క్రికెట్ జట్టు వన్డే వరల్డ్ కప్ ను గెలుచుకున్న సంగతి తెలిసిందే. అయితే  ఆ వరల్డ్ కప్ గెలుచుకోవడానికి తమకు సారథిగా ఉన్న కపిల్ దేవ్లోని అపారమైన నమ్మకమే కారణమంటున్నారు ఆనాటి త్రయం కృష్ణమాచారి శ్రీకాంత్, సయ్యద్ కిర్మాణి, రోజర్ బిన్నీలు. తాజాగా నగరంలోని జరిగిన ఓ సదస్సుకు హాజరైన ఈ త్రిమూర్తులు.. అప్పటి జ్ఞాపకాల్ని నెమరువేసుకున్నారు. 'ఫైనల్ మ్యాచ్ కు ముందు కపిల్ దేవ్ ఇచ్చిన ప్రసంగం మాలో ఆత్మవిశ్వాసాన్ని నింపింది. ఆ ప్రసంగం చాలా స్ఫూర్తిదాయకంగా ఉంది. మమ్మల్ని ఎంతో ఎత్తులో చూసుకునే స్పీచ్ అది. ఆ ప్రసంగంతో మాలో విపరీతమైన నమ్మకం ఏర్పడింది. ఆ క్రమంలోనే మేము ఫైనల్  పోరులో విజయం సాధించాం' అని శ్రీకాంత్ పేర్కొన్నాడు.

ఆనాటి వరల్డ్ కప్ లో జింబాబ్వేతో జరిగిన సెమీ ఫైనల్లో 17పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన  తరుణంలో కపిల్ దేవ్ ఆడిన తీరు అద్భుతమని రోజర్ బిన్నీ తెలిపాడు. 'ఆ మ్యాచ్లో కపిల్ దేవ్ ముఖ్య భూమిక పోషించాడు. అజేయంగా 175 పరుగులు చేసి ఇన్నింగ్స్ నిలబెట్టాడు. చావో-రేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్లో కపిల్ బాధ్యతాయుతంగా ఆడి గౌరవప్రదమైన స్కోరు చేయడంలో సహకరించాడు. అదొక స్ఫూర్తిదాయకమైన ఇన్నింగ్స్ అనడంలో ఎటువంటి సందేహం లేదు' అని బిన్నీ తెలిపాడు.

ఫైనల్ మ్యాచ్ కు ముందు కపిల్ దేవ్ చెప్పిన కొన్ని పదాలే తమలో నమ్మకానికి కారణమయ్యాయని కిర్మాణీ పేర్కొన్నాడు. ఆ నమ్మకమే వెస్టిండీస్ ను ఫైనల్ ఓడించి తొలిసారి వరల్డ్ కప్ సాధించడానికి దోహద పడిందన్నాడు.

 

మరిన్ని వార్తలు