కపిల్‌దేవ్‌ సంచలన నిర్ణయం

2 Oct, 2019 11:25 IST|Sakshi

న్యూఢిల్లీ: పరస్పర విరుద్ద ప్రయోజనాల అంశం మరోసారి ప్రకంపనలు సృష్టిస్తోంది. గతంలో సచిన్‌ టెండూల్కర్‌, సౌరవ్‌ గంగూలీ, రాహుల్‌ ద్రవిడ్‌ వంటి దిగ్గజాలకు ఈ అంశంపై నోటీసులు రావడంతో అందరూ విమర్శల వర్షం కురిపించారు. తాజాగా బీసీసీఐ  క్రికెట్‌ సలహా మండలి (సీఏసీ) సభ్యులకు కూడా ఆ వేడి తగిలింది.  పరస్పర విరుద్ధ ప్రయోజనాల అంశమై అక్టోబర్‌ 10లోగా వివరణ ఇవ్వాలని దిగ్గజ ఆల్‌రౌండర్‌ కపిల్‌దేవ్‌ నేతృత్వంలోని క్రికెట్‌ సలహా మండలి (సీఏసీ)కి బీసీసీఐ నైతిక విలువల అధికారి జస్టిస్‌ డీకే జైన్‌ నోటీసులు పంపారు. ఇప్పటికే తనకు నోటీసులు రావడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన శాంత రంగస్వామి సీఏసీ నుంచి తప్పుకున్నారు. తాజాగా సీఏసీ నుంచి కపిల్‌దేవ్‌ కూడా తప్పుకుంటూ సంచలన నిర్ణయం తీసుకున్నారు.  

సీఏసీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు కపిల్‌ దేవ్‌ బుధవారం ప్రకటించారు. అయితే ఇందుకు గల కారణాలను వెల్లడించలేదు. కపిల్‌దేవ్‌ అత్యంత సన్నిహిత వర్గాల సమాచారం ప్రకారం పరస్పర విరుద్ద ప్రయోజనాల అంశంపై నోటీసుల రావడంతో కొంచెం ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా దీనిపై ఎవరికి సమాధానం చెప్పే ఇష్టం లేకనే తప్పుకుంటున్నట్లు సమాచారం. ఇక గత జులై నెలలో బీసీసీఐ ముగ్గురు సభ్యులతో కూడిన క్రికెట్‌ సలహా మండలిని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ బృందమే టీమిండియా హెడ్‌ కోచ్‌, సహాయ సిబ్బందిని ఎంపిక చేసిన విషయం తెలిసిందే.   

ఇక 'భారత క్రికెట్‌లో ఇదో కొత్త ఫ్యాషన్‌. విరుద్ద ప్రయోజనాల కింద నోటీసులు ఇవ్వడం.. వార్తల్లో నిలవడం. భగవంతుడే భారత క్రికెట్‌ను కాపాడాలి’ అంటూ మాజీ సారథి సౌరవ్‌ గంగూలీ బహిరంగంగా విమర్శించాడు. అంతేకాకుండా ప్రస్తుత పరిస్థితుల్లో ఇతర పదవులు, పనులు చేయకుండా కేవలం క్రికెట్‌ పాలనకు తగిన మాజీ ఆటగాళ్లను ఎంపిక చేయడం బీసీసీఐకి పెద్ద తలపోటుగా మారే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ అంశంపై మాజీ క్రికెటర్లు పెదవి విరుస్తున్న విషయం తెలిసిందే. 

కపిల్‌ వ్యాఖ్యాతగా, ఫ్లడ్‌లైట్ల సంస్థ అధిపతిగా, భారత క్రికెటర్ల సంఘం సభ్యుడి (ఐసీఏ)గా ఉన్నాడు. గైక్వాడ్‌ సొంత అకాడమీతో పాటు బీసీసీఐ అఫిలియేషన్‌ కమిటీలో సభ్యుడు. శాంత కూడా ఐసీఏ సభ్యురాలు. వీటిని పేర్కొంటూ మధ్యప్రదేశ్‌ క్రికెట్‌ సంఘం సభ్యుడు సంజీవ్‌ గుప్తా ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు