క్రికెట్‌ చరిత్రలోనే అదో అద్భుతం!

26 Jun, 2019 10:51 IST|Sakshi

క్రికెట్‌ చరిత్రలోనే అదో అద్భుత ఇన్నింగ్స్‌.. బహుషా యావత్‌ క్రికెట్‌ ప్రపంచాన్ని నేడు భారత్‌ శాసిస్తోందంటే అది ఆ ఇన్నింగ్స్‌ చలవే. మనదేశంలో క్రికెట్‌ ఓ ఆటగా కాకుండా మతంలా మారడానికి బీజం పడింది అక్కడే. ఆ మ్యాచ్‌కు ప్రత్యక్ష ప్రసారం లేదు.. ఆఖరికి రేడియోలో కామెంట్రీ కూడా రాలేదు. ఆ మ్యాచ్‌ జరిగి కూడా 36 ఏళ్లు అవుతోంది. కానీ అందరి మదిలో ఇప్పటికి కదలాడుతూనే ఉంది. చిత్తుగా ఓడాల్సిన జట్టును ఆ ఇన్నింగ్సే విశ్వవిజేతగా నిలిపింది. ఇలా అభిమానులకు ఓ మధురానుభూతిగా మిగిలిపోయిన ఆ అద్భుత ఇన్నింగ్స్‌ సంగతేంటో తెలుసుకుందాం!

అది జూన్‌ 18, 1983 భారత్‌-జింబాంబ్వే ప్రపంచకప్‌ మ్యాచ్‌. భారత కెప్టెన్‌ కపిల్‌ దేవ్‌ టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ ఎంచుకున్నాడు. ప్రపంచకప్‌ రేసులో భారత్‌ నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌. బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ ఖాతా తెరవకుండానే ఓపెనర్‌ సునీల్‌ గావాస్కర్‌ వికెట్‌ కోల్పోయింది. 6 పరుగులనంతరం మరో ఓపెనర్‌ శ్రీకాంత్‌ డకౌట్‌. అదే స్కోర్‌ వద్ద అమర్‌నాథ్‌(5) కూడా పెవిలియన్‌ బాట పట్టాడు. మరో 11 పరుగుల వ్యవధిలో టాపార్డర్‌ అంతా ప్యాకప్‌. భారత్‌ స్కోర్‌ 17/5. దీంతో ప్రపచంకప్‌ పోరులో మరోసారి భారత్‌ కథ ముగిసిందని, భారత ఆటగాళ్లతో సహా అందరూ అనుకున్నారు. ఆర్గనైజర్స్‌ అయితే మరో మ్యాచ్‌ నిర్వహించవచ్చని టాస్‌ ఏర్పాట్లకు సిద్ధమయ్యారు. కానీ ఒకే ఒక్కడు మాత్రం చివరి బంతి వరకు పోరాడాలనుకున్నాడు. ఏదిఏమైనా తన సారథ్యంలోనే భారత్‌ను విశ్వవిజేతగా నిలపాలనుకున్నాడు. మరోవైపు వికెట్లు కోల్పోతున్నా.. చెక్కుచెదరని ఆత్మవిశ్వాసంతో పోరాడాడు. బంతిని బ్యాట్‌కు తగిలించడానికే ఇబ్బంది పడ్డ పిచ్‌లో అలవోక షాట్స్‌తో ఆకట్టుకున్నాడు. జింబాంబ్వే కెప్టెన్‌ డంకన్‌ ఫ్లెచర్‌ ఎన్ని వ్యూహాలు రచించినా.. కొత్త బంతితో బౌలర్లను మార్చినా కపిల్‌ చూడచక్కని షాట్స్‌తో అదరగొట్టాడు. సహజసిద్ధమైన ఆటతో కవర్‌ డ్రైవ్స్‌, ట్రేడ్‌మార్క్‌ కట్స్‌తో ఔరా అనిపించాడు. మదన్‌లాల్‌(17)తో కలిసి 8వ వికెట్‌కు కీలక 62 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. 

సయ్యద్‌ కిర్మాణీ కీలకం..
కపిల్‌ ఇన్నింగ్స్‌లో వికెట్‌ కీపర్‌ సయ్యద్‌ కిర్మాణీ(56 బంతుల్లో 26 నాటౌట్‌) పాత్ర కీలకం. అతను స్ట్రైక్‌ రొటేట్‌ చేస్తూ కపిల్‌కు అండగా నిలవడంతో తొమ్మిదో వికెట్‌కు 126 పరుగుల రికార్డు భాగస్వామ్యం నమోదైంది. దీంతో భారత్‌ 8 వికెట్లు కోల్పోయి 266 పరుగులు చేసింది. ‘మదన్‌లాల్‌ వికెట్‌ అనంతరం క్రీజులోకి వచ్చిన నేను కపిల్‌ను సహజ సిద్ధంగా ఆడమని చెప్పాను. మనం 60 ఓవర్లు ఆడుతున్నాం. నాశక్తి మేరకు నేను పోరాడుతా.’ అని కపిల్‌తో అన్నట్లు కిర్మాణీ నాటి రోజులను ఓ ఇంటర్వ్యూలో గుర్తుచేసుకున్నాడు. 

72 బంతుల్లో భారత్‌ తరఫున తొలి ప్రపంచకప్‌ సెంచరీ సాధించిన కపిల్‌.. వెంటనే కొత్త బ్యాట్‌ తీసుకురావాలని గ్యాలరీలోని ఆటగాళ్లకు సూచించాడు. అప్పటికీ అతను సెంచరీ పూర్తి కాలేదనుకున్నాడు. స్కేర్వ్‌ ఆఫ్‌ ది వికెట్‌ మీదుగా ఎక్కువ బౌండరీలు బాదిన కపిల్‌‌.. సిక్సర్లను మాత్రం లాంగాన్‌ దిశగా కొట్టాడు. స్ట్రైట్‌డ్రైవ్‌ బౌండరీలు కూడా బాదాడు. ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి 138 బంతుల్లో 16 ఫోర్లు.. 6 సిక్స్‌లతో 175 పరుగులతో నాటౌట్‌గా నిలిచి చరిత్రసృష్టించాడు. సువర్ణాక్షరాలతో తన పేరును లిఖించుకున్నాడు. 267 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన జింబాంబ్వే సైతం భారత్‌ పడిన కష్టాలనే ఎదుర్కొంది. 113 పరుగులకే 6 వికెట్లు కోల్పోగా.. ఆ జట్టు ఆల్‌రౌండర్‌ కెవిన్‌ కుర్రాన్‌ (73) ఒంటరి పోరాటం చేశాడు. అతనికి మధన్‌లాల్‌ అడ్డుకట్ట వేయగా.. రిటర్న్‌ క్యాచ్‌తో చివరి వికెట్‌ను కపిల్‌ పడగొట్టడంతో జింబాంబ్వే పోరాటం ముగిసింది. భారత్‌ ఓడాల్సిన మ్యాచ్‌లో 31 పరుగులతో విజయం సాధించింది. అనంతరం ఆస్ట్రేలియాతో చివరి లీగ్‌ మ్యాచ్‌ను 118 పరుగులతో గెలిచిన కపిల్‌సేన సగర్వంగా సెమీస్‌లోకి అడుగుపెట్టింది. ఇంగ్లండ్‌పై 6 వికెట్లతో గెలిచి ఫైనల్లో వెస్టిండీస్‌ను మట్టికరిపించి విశ్వవిజేతగా నిలిచింది. ఇంగ్లండ్‌ వేదికగా జరిగిన ఈ ప్రపంచకప్‌లో పెద్దగా అంచనాలు లేకుండానే బరిలోకి దిగిన కపిల్‌సేన టైటిల్‌తో తిరిగొచ్చి భారత్‌లో క్రికెట్‌ను ఓ మతంలా మార్చింది.

కలిసొచ్చిన అదృష్టం..
కపిల్‌దేవ్‌ అద్భుత ఇన్నింగ్స్‌కు అదృష్టం కూడా తోడైంది. 90 పరుగుల వ్యక్తిగత స్కోర్‌ వద్ద కపిల్‌ ఇచ్చిన సునాయస క్యాచ్‌ను గ్రాంట్‌ ప్యాటర్సన్‌ వదిలేశాడు. భారీ షాట్స్‌ ఆడే ప్రయత్నంలో చాల బంతులు ఫీల్డింగ్‌ లేని ప్రదేశాల్లో పడ్డాయి. ఇక కపిల్‌ సాధించిన అత్యధిక పరుగుల రికార్డును  ఆ మరుసటి ఏడాదే వెస్టిండీస్‌ దిగ్గజం వీవీ రిచ్చర్డ్స్‌ అధిగమించాడు. ఇంగ్లండతో జరిగిన మ్యాచ్‌లో 189 పరుగులతో నాటౌట్‌గా నిలిచి ఈ ఘనతను అందుకున్నాడు. సయ్యద్‌ కిర్మాణీతో కపిల్‌ 9వ వికెట్‌కు నెలకొల్పిన భాగస్వామ్యపు రికార్డు 27 ఏళ్ల వరకు చెక్కుచెదరకుండా ఉంది. 2010లో శ్రీలంక ఆటగాళ్లు ఏంజేలో మాథ్యూస్‌-లసిత్‌ మలింగాలు ఆస్ట్రేలియాపై 136 పరుగుల భాగస్వామ్యంతో ఈ రికార్డును అధిగమించారు.

సిగ్గుతో మొహం చూపించలేకపోయాం..
కపిల్‌ ఇన్నింగ్స్‌పై ఆనాటి ఓపెనర్‌ సునీల్‌ గావస్కర్‌ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘ఆ మ్యాచ్‌లో 17 పరుగులకే 5 వికెట్లు కోల్పోయాం. నిజంగా కపిల్‌ ఇన్నింగ్స్‌ గొప్పతనం ఏమిటో మాటల్లో చెబితే ఎవరికీ అర్థం కాదు. టాపార్డర్‌ బ్యాట్స్‌మెన్‌ బంతికి బ్యాట్‌కు తగిలించలేకపోయిన చోట అతను అదే బంతిని మైదానం నలుదిశలా బాదాడు. 60 ఓవర్ల మ్యాచ్‌ కావడం వల్ల మొదటి ఇన్నింగ్స్‌ ముగియడానికి ముందే మాకు లంచ్‌ బ్రేక్‌ ఉండేది. కపిల్‌ లంచ్‌కు వచ్చాక అతని సీటుపై ఒక జ్యూస్‌ గ్లాస్‌ మినహా అటు డ్రెస్సింగ్‌ రూమ్‌లో కానీ, లంచ్‌ రూమ్‌లో కానీ ఒక్కరూ లేరు. నిజంగా చెప్పాలంటే సిగ్గుతో మేమంతా అతనికి మొహాలు చూపించలేక దాక్కున్నాం! ఎలా బ్యాటింగ్‌ చేయాలో అతను చేసి చూపించాడు. ఆ తర్వాతే మాలో నమ్మకం పెరిగి టైటిల్‌ గెలిచే వరకు  వెళ్లగలిగాం’ అని సన్నీ చెప్పాడు. 

కపిల్‌ అద్భుత ఇన్నింగ్స్‌ లేకుంటే నాడు భారత్‌ ప్రపచంకప్‌ గెలిచేది కాదు.. నేడు మనదేశంలో క్రికెట్‌కు ఇంత ఆదరణ ఉండేది కాదు. ఏది ఏమైనా.. కపిల్.. భారత క్రికెట్లో నీది చెరపలేని చరిత్ర.. చెరిగిపోని యాత్ర.. మరెవరిని ఊహించలేని పాత్ర..
-శివ ఉప్పల, సాక్షి వెబ్‌డెస్క్‌
 

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

అంతా పీడకలలా అనిపిస్తోంది

వీధి రౌడీలా కాదు హీరోలా...

అదృష్టం మా వైపు ఉంది!

ప్రపంచకప్‌ ఫైనల్‌పై స్పందించిన కోహ్లి

వన్డేలకు రోహిత్‌.. టెస్ట్‌లకు కోహ్లి!

ఐసీసీ టీమ్‌ ఆఫ్‌ ది టోర్నీ.. కోహ్లికి దక్కని చోటు

క్రికెట్‌ రూల్స్‌పై దృష్టి సారించాల్సిందే: రోహిత్‌

‘ధోని రనౌట్‌ పాపమే చుట్టుకుంది’

ట్రోఫీ చేజార్చుకోవడం సిగ్గుచేటు : స్టోక్స్‌ తండ్రి

ఆర్చర్‌కు సూపర్‌ పవర్‌ ఉందా?

ఎట్లిస్తరయ్యా 6 పరుగులు?

అనూహ్యంగా వచ్చాడు.. టాప్‌ లేపాడు!

బెన్‌ స్టోక్స్‌కు అంత సీన్‌ లేదు!

మీరెవరూ క్రీడల్లోకి రాకండి: నీషమ్‌ ఆవేదన

డీఆర్‌ఎస్‌ లేకుంటే బలైపోయేవారే..!

టామ్‌ లాథమ్‌ నయా రికార్డు

హీరో.. విలన్‌.. గప్టిలే!

ఇదొక చెత్త రూల్‌: గంభీర్‌

జీవితాంతం కేన్‌కు క్షమాపణలు చెప్తాను : స్టోక్స్‌

‘ఓటమి మమ్మల్ని తీవ్రంగా కలిచి వేస్తోంది’

నమ్మశక్యం కానిరీతిలో.. మ్యాచ్‌లో కీలక మలుపు

ఇంగ్లాండ్‌ అలా గెలిచిందట.!

సారీ న్యూజిలాండ్‌...

లార్డ్స్‌ నుంచి లార్డ్స్‌ వరకు...

ప్రపంచ కల నెరవేరింది

ప్రపంచకప్‌ 2019: పుట్టినింటికే చేరింది

మ్యాట్‌ హెన్రీ అరుదైన ఘనత

ఫైనల్‌ అప్‌డేట్స్‌: విశ్వవిజేతగా ఇంగ్లండ్‌