బంగర్‌కు ఉద్వాసన..భరత్‌కు భరోసా!

27 Jul, 2019 09:58 IST|Sakshi

కపిల్‌ కమిటీకే కోచ్‌ ఎంపిక బాధ్యత

న్యూఢిల్లీ: ముందుగా ఊహించిన మేరకు భారత పురుషుల క్రికెట్‌ జట్టు ప్రధాన కోచ్‌ ఎంపిక బాధ్యతను దిగ్గజ క్రికెటర్, మాజీ కెప్టెన్‌ కపిల్‌ దేవ్‌ ఆధ్వర్యంలోని క్రికెట్‌ సలహా కమిటీ (సీఏసీ)నే చేపట్టనుంది. ఈ మేరకు క్రికెట్‌ పాలకుల కమిటీ (సీవోఏ) చీఫ్‌ వినోద్‌ రాయ్‌ శుక్రవారం ప్రకటించారు. ‘కోచ్‌ ఎంపికకు కపిల్‌ బృందం ఆగస్టు రెండో వారంలో ఇంటర్వ్యూలు నిర్వహిస్తుంది. ఇది తాత్కాలిక కమిటీ కాదు. కపిల్, శాంత రంగస్వామిలకు పరస్పర విరుద్ధ ప్రయోజనాల అంశం వర్తిస్తుందా? లేదా? అనేది మేం చూసుకుంటాం. ఇది పూర్తిగా న్యాయబద్ధమైనదే’ అని ఆయన పేర్కొన్నారు. కోచ్‌ ఎంపిక ప్రక్రియపై కెప్టెన్‌ కోహ్లి ఏమీ చెప్పలేదని రాయ్‌ వివరించారు.

బంగర్‌కు ఉద్వాసన..భరత్‌కు భరోసా!
కొత్త సహాయ బృందం ఎంపిక సందర్భంగా టీమిండియా బ్యాటింగ్‌ కోచ్‌ సంజయ్‌ బంగర్‌కు ఉద్వాసన తప్పదని తెలుస్తోంది. నాలుగేళ్ల పదవీ కాలంలో బలమైన మిడిలార్డర్‌ను తయారు చేయలేకపోవడం బంగర్‌ ప్రధాన వైఫల్యంగా చెబుతున్నారు. ప్రపంచ కప్‌ సెమీస్‌లో ధోనిని ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు పంపాలన్న నిర్ణయమూ అతడిదేనని సమాచారం. బౌలింగ్‌ కోచ్‌గా భరత్‌ అరుణ్‌ స్థానానికి భరోసా దక్కుతోంది. ఏడాదిన్నరగా పేస్‌ విభాగాన్ని అతడు తీర్చిదిద్దిన తీరే ఇందుకు కారణం. ఫీల్డింగ్‌ కోచ్‌గా ఆర్‌.శ్రీధర్‌ పై మంచి అభిప్రాయమే ఉన్నా... జాంటీ రోడ్స్‌ (దక్షిణాఫ్రికా) వంటి మేటి ఫీల్డర్‌ పోటీ పడుతుండటం ప్రతికూలంగా మారింది. సహాయ కోచ్‌ పదవులకు సెలక్టర్లు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. 

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు