ఫోన్‌ మాట్లాడుతూ దొరికిపోయాడు!

22 Feb, 2020 15:52 IST|Sakshi

ఇది ఎప్పట్నుంచి నాయనా!

కరాచీ: ఇప్పటికే  మ్యాచ్‌ ఫిక్సింగ్‌ ఘటనలతో బెంబేలెత్తిపోతున్న పాకిస్తాన్‌ క్రికెట్‌లో తాజాగా మరో అలజడి రేగింది. మ్యాచ్‌ ఫిక్సింగ్‌ వివాదాలతో సతమవుతున్న పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌(పీఎస్‌ఎల్‌)లో ఓ అధికారి డగౌట్‌లో ఫోన్‌ మాట్లాడుతూ కనిపించడంతో తీవ్ర దుమారం రేపింది. తాజా పీఎస్‌ఎల్‌లో భాగంగా కరాచీ కింగ్స్‌-పెషావర్‌ జల్మీ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో మాజీ అధికారి ఒకరు మొబైల్‌ ఫోన్‌ను డగౌట్‌లోకి తీసుకొచ్చారు. అదే క్రమంలో ఫోన్లో మాట్లాడుతూ కనిపించిన దృశ్యాలు కెమెరాకు చిక్కడంతో దుమారం రేగింది. దీన్ని ప్రత్యక్ష ప్రసారం చేయడంతో అసలు విషయం వెలుగు చూసింది.  లీగ్‌ ప్రారంభమైన రెండో రోజే ఈ ఘటన చోటు చేసుకోవడంతో పాకిస్తాన్‌ క్రికెట్‌ పెద్దల్లో ఆందోళన రేకెత్తించింది. ఈ ఘటన పాకిస్తాన్‌ క్రికెట్‌కు మరొకసారి మచ్చను తెచ్చిపెట్టింది. (ఇక్కడ చదవండి: ‘జీవితకాల నిషేధం విధించండి’)

అసలు ఆ అధికారి ఎవరు, ఎందుకు ఫోన్‌ తీసుకొచ్చి నిబంధనల్ని ఉల్లఘించాడని కాసేపు తలలు పట్టుకున్నారు. దీనిపై అభిమానులు కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. డగౌట్‌లో ఫోన్‌లో మాట్లాడటాన్ని ఐసీసీ ఎప్పట్నుంచి అనుమతిస్తుందంటూ జోక్‌లు పేల్చుతున్నారు. అంతర్జాతీయ క్రికెట్‌ మండలి(ఐసీసీ)నిబంధనల ప్రకారం డగౌట్‌లో ఆటగాళ్లు కానీ అధికారులు కానీ మొబైల్‌ ఫోన్లను వాడకూడదు. ఇది నిబంధనలకు వ్యతిరేకం. కేవలం​ వాకీ టాకీలను మాత్రమే అనుమతిస్తారు. డగౌట్‌ నుంచి డ్రెస్సింగ్‌ రూమ్‌లో ఉన్న ఆటగాళ్లతో సంభాషించడానికి వాకీ టాకీలను వినియోగిస్తారు. మరి మాజీ అధికారి డగౌట్‌లోకి మొబైల్‌ ఫోన్‌ తీసుకురావడం ఏమటనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. దీనిపై కరాచీ కింగ్స్‌ మేనేజర్‌ ఫైజల్‌ మీర్జా వివరణ ఇస్తూ..  జట్టు మేనేజర్‌గా పని చేసిన తారిక్‌ వాసీ ఇలా ఫోన్‌లో మాట్లాడిన విషయాన్ని ఆలస్యంగా గుర్తించినట్లు తెలిపారు. ఈ మ్యాచ్‌లో కరాచీ కింగ్స్‌ 10 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన కరాచీ నాలుగ వికెట్ల నష్టానికి 201 పరుగులు చేయగా, పెషావర్‌ జట్టు 191 పరుగులకే పరిమితమై ఓటమి పాలైంది.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు