కరణ్‌వీర్‌ కౌశల్‌ డబుల్‌ సెంచరీ 

7 Oct, 2018 08:34 IST|Sakshi

విజయ్‌ హజారే టోర్నీలో తొలి ద్విశతకం నమోదు

సిక్కింపై 199 పరుగులతో ఉత్తరాఖండ్‌ గెలుపు   

నదియాడ్‌ (గుజరాత్‌): పాతికేళ్ల దేశవాళీ వన్డే టోర్నీ చరిత్రలో తొలి ద్విశతకం నమోదైంది. ఉత్తరాఖండ్‌ ఓపెనర్‌ కరణ్‌వీర్‌ కౌశల్‌ (135 బంతుల్లో 202; 18 ఫోర్లు, 9 సిక్స్‌లు) డబుల్‌ సెంచరీతో చెలరేగడంతో విజయ్‌ హజారే వన్డే టోర్నీలో సిక్కింపై ఉత్తరాఖండ్‌ 199 పరుగుల తేడాతో విజయం సాధించింది. కరణ్‌వీర్‌ అద్భుత ఇన్నింగ్స్‌తో గతంలో అజింక్య రహానే (187, 2007–08) పేరిట ఉన్న అత్యధిక పరుగుల రికార్డు తెరమరుగైంది. తొలుత బ్యాటింగ్‌ చేసిన ఉత్తరాఖండ్‌ నిర్ణీత 50 ఓవర్లలో 2 వికెట్లకు 366 పరుగుల భారీ స్కోరు చేసింది.

కరణ్‌వీర్‌తో పాటు మరో ఓపెనర్‌ వినీత్‌ సక్సేనా (100; 4 ఫోర్లు) సెంచరీతో అదరగొట్టాడు. వీరిద్దరు తొలి వికెట్‌కు 296 పరుగులు జతచేశారు. భారత లిస్ట్‌ ‘ఎ’ క్రికెట్‌లో ఇదే అత్యధిక తొలి వికెట్‌ భాగస్వామ్యం కావడం మరో విశేషం. గతంలో ఈ రికార్డు ధావన్‌–ఆకాశ్‌ చోప్రా (277 పరుగుల, 2007–08) పేరిట ఉంది. అనంతరం సిక్కిం 50 ఓవర్లలో 6 వికెట్లకు 167 పరుగులకే పరిమితమై ఓడిపోయింది.

 

మరిన్ని వార్తలు