‘అశ్విన్‌ను చూసి గర్వపడుతున్నా’

26 Mar, 2019 17:49 IST|Sakshi

జైపూర్‌: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)లో భాగంగా రాజస్తాన్‌ రాయల్స్‌ బ్యాట్స్‌మన్‌ జోస్‌ బట్లర్‌ను కింగ్స్‌ పంజాబ్‌ కెప్టెన్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ మన్కడింగ్‌ చేయడం పెద్ద దుమారమే రేపింది. ఇది క్రికెట్‌ రూల్స్‌లో భాగమే అయినప్పటికీ అశ్విన్‌ క్రీడాస్ఫూర్తిని మరిచాడంటూ పలువురు విమర్శలు గుప్పించారు. అయితే అశ్విన్‌కు భారత మాజీ స్పిన్నర్‌ మురళీ కార్తీక్‌ మాత్రం మద్దతుగా నిలిచాడు.  ‘అశ్విన్‌ బాగా ఆడావు. నిన్ను చూసి గర్వపడుతున్నా. క్రీడా స్ఫూర్తి అనేది సమర్థించుకునే పదంగా మారింది’ అని పేర్కొన్నాడు. నిబంధనలకు లోబడే బట్లర్‌ను అశ్విన్‌ ఔట్‌ చేశాడని, బ్యాట్స్‌మన్‌ను ఔట్‌ చేయడంలో మన్కడింగ్‌ కూడా ఓ అవకాశమని వివరించాడు. ఈ మేరకు తన ట్వీటర్‌ అకౌంట్‌లో వరుస ట్వీట్లు చేశాడు కార్తీక్‌.
(ఇక్కడ చదవండి: అశ్విన్‌ ఏందీ తొండాట..!)

ఈ వివాదాస్పద ఔట్‌ను ఇంగ్లండ్‌ ఆటగాళ్లు తీవ్రంగా ఖండిస్తుండగా వారికి గట్టిగానే సమాధానమిచ్చాడు కార్తీక్‌. ‘బట్లర్‌ను హెచ్చరించకుండానే ఔట్‌ చేయడం’ సరికాదని కెవిన్‌ పీటర్‌సన్‌ ట్వీట్ చేయగా.. అందుకు బదులిస్తూ.. ‘ఎంసీసీ నిబంధనలు మీ దేశంలోనే ఉన్నాయి. వెళ్లి మార్పులు చేసుకోండి. ఇంగ్లిష్‌ ఆటగాళ్లే దీనిపై వివాదం చేస్తున్నారు’ అని పేర్కొన్నాడు. ‘సర్‌ నేను మీ అభిమానిని. అనవసరంగా దీన్ని సమర్థించడం మంచిది కాదు. మీ ట్వీట్లను చూసుకోండి’ అని ఓ అభిమాని ట్వీట్‌ చేయగా.. ‘మీరెవరైనా సరే.. బ్యాట్స్‌మెన్‌ క్రీజు దాటి వెళ్లకూడదు. ఎవరికైనా నిబంధనలు అలాగే ఉంటాయి’ అని చెప్పుకొచ్చాడు.  ఇదిలా ఉండగా 2012, 2013లో కార్తీక్‌ ప్రత్యర్థులను ఇలాగే ఔట్‌ చేశాడు. అప్పట్లో అవి కూడా చర్చనీయాంశంగా మారాయి.
(ఇక్కడ చదవండి: మన్కడింగ్‌ ఔట్‌ అంటే ఏంటో తెలుసా?)

మరిన్ని వార్తలు