కరుణ్, జయంత్‌ రాణించడం వారి చలవే

26 Dec, 2016 00:47 IST|Sakshi
కరుణ్, జయంత్‌ రాణించడం వారి చలవే

రాహుల్‌ ద్రవిడ్‌ వ్యాఖ్య  

న్యూఢిల్లీ: కరుణ్‌ నాయర్, జయంత్‌ యాదవ్‌ల ప్రదర్శనకు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి, కోచ్‌ అనిల్‌ కుంబ్లేలే కారణమని రాహుల్‌ ద్రవిడ్‌ అన్నారు. యువ ఆటగాళ్లకు మార్గదర్శనం చేస్తున్న ఈ భారత యువ జట్ల కోచ్‌... కుర్రాళ్లు స్వేచ్ఛగా ఆడేందుకు వాళ్లిద్దరు చక్కని వాతావరణాన్ని కల్పిస్తున్నారని చెప్పుకొచ్చాడు. ‘బీసీసీఐ.టీవీ’ వెబ్‌సైట్‌కు ఇచ్చిన ఇంటర్వూ్యలో ద్రవిడ్‌ మాట్లాడుతూ దేశవాళీ టోర్నీల్లో కుర్రాళ్లు బాగా ఆడుతున్నారని కితాబిచ్చాడు. ‘తొలి టెస్టు సిరీస్‌లో సాధించిన సెంచరీని ట్రిపుల్‌ సెంచరీగా మలచుకోవడం గొప్ప విషయం. కేవలం అతని సత్తావల్లే ఇది సాధ్యమైందనుకోవడం లేదు.

సాధించాలన్న తపన, నిరూపించుకోవాలన్న కసి వల్లే ఈ చారిత్రక ఇన్నింగ్స్‌ వచ్చింది. కుర్రాళ్లు ఒకరి తర్వాత ఒకరు రాణించడం చూస్తుంటే నాకు ఆనందంగా ఉంది. భవిష్యత్‌ జట్టుకు మంచి పునాది పడుతుందనే ఆత్మవిశ్వాసం కలుగుతుంది’ అని ద్రవిడ్‌ అన్నాడు. కరుణ్, జయంత్‌లతో పాటు హార్దిక్‌ పాండ్యా, కె.ఎల్‌.రాహుల్‌లు భారత్‌ ‘ఎ’ జట్టు నుంచే వచ్చారు. వీరందరికి ద్రవిడే మార్గదర్శనం చేశారు. ఎప్పటికప్పుడు జాతీయ జట్టును సంప్రదిస్తూనే ఉన్నామని వారికి అవసరమైన నైపుణ్యమున్న ఆటగాళ్లను తయారు చేస్తున్నామని చెప్పాడు. ఇప్పుడు ఆల్‌రౌండర్లు కావాలంటే వారిపైనే దృష్టిపెడతామని ద్రవిడ్‌ వివరించాడు.
 

మరిన్ని వార్తలు