నేనిప్పుడు బాగా మెరుగయ్యా: నాయర్‌ 

12 Jun, 2018 00:42 IST|Sakshi

బెంగళూరు: రెండేళ్లక్రితం ఉన్నట్లు ఇప్పుడు లేనని, ఫిట్‌నెస్‌ పరంగా, ఆటపరంగా చాలా మెరుగయ్యానని భారత క్రికెటర్‌ కరుణ్‌ నాయర్‌ చెప్పాడు. అఫ్గానిస్తాన్‌తో జరగనున్న ఏకైక టెస్టులో పాల్గొనే భారత జట్టులో సభ్యుడిగా ఉన్న కరుణ్‌ సోమవారం జరిగిన మీడియా సమావేశంలో పలు అంశాలపై మాట్లాడాడు. ‘గత ఏడాదిన్నర కాలంగా జట్టుకు దూరమయ్యాను. దీంతో ఆటలో నైపుణ్యం, ఫిట్‌నెస్‌ పెంచుకునే పనిలో నిమగ్నమయ్యా. దేశవాళీ క్రికెట్లో చెప్పుకోదగ్గ స్కోర్లు చేశాను. గతంలోకంటే ఇప్పుడు చాలా పరిణతి సాధించానని నాకు అనిపిస్తుంది’ అని నాయర్‌  చెప్పాడు. చివరిసారిగా గతేడాది మార్చిలో ఆస్ట్రేలియాతో టెస్టు ఆడిన కరుణ్‌... ఇప్పుడు అఫ్గానిస్తాన్‌తో జరగనున్న చారిత్రక టెస్టు కోసం తిరిగి టీమిండియాలో చోటు దక్కించుకున్నాడు. అలాగే ఇంగ్లండ్‌లో పర్యటించే భారత ‘ఎ’ జట్టుకు ఎంపికయ్యాడు. అయితే తన దృష్టి మాత్రం ప్రస్తుత టెస్టుపైనే ఉందన్నాడు. స్పిన్‌ ట్రాక్‌ భారత్‌ కంటే తమకే అనుకూలమన్న అఫ్గాన్‌ కెప్టెన్‌ అస్గర్‌ స్తానిక్జాయ్‌ వ్యాఖ్యలపై స్పందిస్తూ... ‘అది ఏమాత్రం తగని వ్యాఖ్య. ఎందుకంటే ఇంకా ఒక్క టెస్టు కూడా ఆడని జట్టు కెప్టెన్‌ అలా మాట్లాడటం తొందరపాటే అవుతుంది.

టెస్టుల్లో భారత స్పిన్నర్లు అద్భుతంగా రాణిస్తున్నారు. అఫ్గాన్‌ స్పిన్నర్లు రషీద్‌ ఖాన్, ముజీబ్‌ జద్రాన్‌ ప్రతిభావంతులే అయినప్పటికీ రెడ్‌ బాల్‌ (టెస్టులాడే బంతి)తో ఆడటం ఇదే తొలిసారి. పరిమిత ఓవర్ల ఆట వేరు. సంప్రదాయక టెస్టులు వేరన్న సంగతి గుర్తుంచుకోవాలి. టెస్టులు ఐపీఎల్‌ ఆడినంత ఈజీ కాదు. చాలా భిన్నమైనవి’ అని కరుణ్‌ నాయర్‌ అన్నాడు. ఇంగ్లండ్‌పై అరంగేట్రం చేసిన సిరీస్‌లోనే ట్రిపుల్‌ సెంచరీ సాధించినప్పటికీ జట్టులో స్థానం కోల్పోవడంపై మాట్లాడుతూ ‘అది రెండేళ్లక్రితం సంగతి. ఇప్పుడు మళ్లీ చేస్తే తప్పకుండా విషయం అవుతుంది. అయితే డబుల్, ట్రిపుల్‌ కంటే జట్టు గెలవడమే ముఖ్యం’ అని చెప్పుకొచ్చాడు.   

మరిన్ని వార్తలు