కరుణ్ ది గ్రేట్

20 Dec, 2016 08:26 IST|Sakshi
కరుణ్ ది గ్రేట్

ట్రిపుల్‌ సెంచరీ చేసిన నాయర్‌
అశ్విన్, జడేజా అర్ధ సెంచరీలు

తొలి ఇన్నింగ్స్‌లో 759/7 డిక్లేర్డ్‌
టెస్టుల్లో భారత్‌కిదే అత్యధిక స్కోరు
ఇంగ్లండ్‌ రెండో ఇన్నింగ్స్‌ 12/0

బ్యాటింగ్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌కే సాధ్యం కాని ఫీట్‌ అది.. ఇప్పటి దాకా భారత టెస్టు క్రికెట్‌ చరిత్రలో ఒక్కరంటే ఒక్కరే సాధించిన రికార్డు.. ఎంతో మంది మేటి బ్యాట్స్‌మెన్‌ కలలు కన్నా అందుకోలేని విన్యాసమది.. అలాంటి అరుదైన ట్రిపుల్‌ సెంచరీని యువ బ్యాట్స్‌మన్‌ కరుణ్‌ నాయర్‌ సాధించాడు. అదీ ఆడుతున్న మూడో టెస్టులోనే కావడం విశేషం. అంతేకాదు తన తొలి సెంచరీనే ట్రిపుల్‌గా మలుచుకున్న తొలి భారత ఆటగాడయ్యాడు. ఈ సిరీస్‌లో ఈ మ్యాచ్‌కు ముందు అతడు చేసిన స్కోర్లు 4, 13 మాత్రమే.. ఈ స్థితిలో ఎవరైనా ఈ ఆటగాడి గురించి ఎక్కువగా ఊహిస్తారా? కానీ ఎవరి అంచనాలకు అందకుండా ఈ కర్ణాటక స్టార్‌ అనూహ్య రీతిలో సాగించిన విజృంభణక్రికెట్‌ పండితులనే ఆశ్చర్యపరిచింది. కుటుంబసభ్యుల సమక్షంలో అసమాన ఆటను ప్రదర్శించి ఈ టెస్టును చిరస్మరణీయం చేసుకున్నాడు. మరోవైపు ఈ మరపురాని ఆటతీరుకు తోడు అశ్విన్, జడేజా అర్ధ సెంచరీలు సాధించడంతో భారత జట్టు తమ టెస్టు చరిత్రలోనే అత్యధిక పరుగుల రికార్డునూ తమ ఖాతాలో వేసుకుంది..


చెన్నై: ఇంగ్లండ్‌తో జరుగుతున్న చివరి టెస్టులో భారత జట్టు రికార్డుల మోత మోగించింది. తన అరంగేట్ర సిరీస్‌లోనే  కరుణ్‌ నాయర్‌ (381 బంతుల్లో 303 నాటౌట్‌; 32 ఫోర్లు, 4 సిక్సర్లు) ఇంగ్లండ్‌ బౌలర్లను ఊచకోత కోస్తూ అజేయంగా ట్రిపుల్‌ సెంచరీ సాధించాడు.  ఎప్పటిలాగే భారత టెయిలెండర్లు అశ్విన్‌ (149 బంతుల్లో 67; 6 ఫోర్లు, 1 సిక్స్‌), జడేజా (55 బంతుల్లో 51; 1 ఫోర్, 2 సిక్స్‌లు) మెరుగైన ఆటతో ఆకట్టుకోవడంతో భారత్‌ తమ తొలి ఇన్నింగ్స్‌లో 190.4 ఓవర్లలో ఏడు వికెట్లకు 759 పరుగులకు డిక్లేర్‌ చేసింది. తమ టెస్టు చరిత్రలో భారత్‌కు ఇదే అత్యధిక స్కోరు. ద్విశతకం పూర్తి చేసుకున్న అనంతరం వన్డే తరహాలో రెచ్చిపోయిన నాయర్‌ 75 బంతుల్లోనే తన చివరి 103 పరుగులను సాధించడం విశేషం. అంతేకాకుండా సోమవారం ఒక్కరోజే తను 245 బంతుల్లోనే 232 పరుగులు సాధించడం అతని జోరును సూచిస్తోంది. జడేజా కూడా ఇదే స్థాయి జోరు చూపడంతో భారత ఇన్నింగ్స్‌లో పరుగులు వేగంగా వచ్చాయి. అలాగే అశ్విన్‌తో కలిసి నాయర్‌ ఆరో వికెట్‌కు 181 పరుగులు జత చేయగా, జడేజాతో కలిసి ఏడో వికెట్‌కు 138 పరుగులు అందించాడు. బ్రాడ్, డాసన్‌లకు రెండేసి వికెట్లు దక్కాయి. అనంతరం 282 పరుగులు వెనకబడిన దశలో తమ రెండో ఇన్నింగ్స్‌ ఆరంభించిన ఇంగ్లండ్‌ సోమవారం ఆట ముగిసే సమయానికి 5 ఓవర్లలో వికెట్‌ నష్టపోకుండా 12 పరుగులు చేసింది. క్రీజులో కుక్‌ (3 బ్యాటింగ్‌), జెన్నింగ్స్‌ (9 బ్యాటింగ్‌) ఉన్నారు.

సెషన్‌ – 1     తొలి సెంచరీ పూర్తి
391/4 ఓవర్‌నైట్‌ స్కోరుతో మూడో రోజు ఆట ప్రారంభించిన భారత్‌ జోరును కనబరిచింది. చక్కటి నిలకడను ప్రదర్శిస్తూ కరుణ్, విజయ్‌ ఆటతీరు సాగింది. డాసన్‌ బౌలింగ్‌లో భారీ సిక్స్‌ బాదిన కరుణ్‌.. స్టోక్స్‌ బౌలింగ్‌లో మరో చక్కటి బౌండరీతో 185 బంతుల్లో కెరీర్‌తో తొలి శతకాన్ని అందుకున్నాడు. ఆ తర్వాత ఓవర్‌లోనే విజయ్‌ (76 బంతుల్లో 29; 4 ఫోర్లు) డాసన్‌ బౌలింగ్‌లో వికెట్ల ముందు దొరికిపోయాడు. విజయ్‌ రివ్యూ కోరినా ఫలితం లేకపోయింది. వీరిద్దరి మధ్య ఐదో వికెట్‌కు 63 పరుగులు జత చేరాయి. అనంతరం నాయర్‌కు ఫామ్‌లో ఉన్న అశ్విన్‌ జత కలవడంతో ఇంగ్లండ్‌ బౌలర్లకు కష్టాలు ప్రారంభమయ్యాయి. ఆరంభంలో డిఫెన్స్‌కు ప్రాధాన్యత ఇచ్చిన అశ్విన్‌ పరుగుల ఖాతా తెరిచేందుకు 20 బంతులు తీసుకున్నాడు.
ఓవర్లు: 27, పరుగులు: 72, వికెట్లు: 1

సెషన్‌ – 2       నాయర్, అశ్విన్‌ జోరు
లంచ్‌ విరామం అనంతరం భారత బ్యాటింగ్‌లో జోరు కనిపించింది. మూడో ఓవర్‌లో కరుణ్‌ ఫోర్‌ బాదగా ఐదో ఓవర్‌లో అశ్విన్‌ సిక్సర్‌తో భారత్‌కు తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యాన్ని అందించాడు. ఆ తర్వాతి ఓవర్లలోనూ ఇద్దరు బౌండరీల వర్షం కురిపిస్తూ సాగారు. రషీద్‌ వేసిన 155వ ఓవర్‌లో నాయర్‌ రివర్స్‌ స్వీప్‌ ఆడగా ఇంగ్లండ్‌ క్యాచ్‌ అప్పీల్‌కు వెళ్లింది. అయితే థర్డ్‌ అంపైర్‌ తిరస్కరించడంతో వారికి నిరాశే మిగిలింది. 115 బంతుల్లో అశ్విన్‌ సిరీస్‌లో నాలుగో అర్ధ సెంచరీని సాధించాడు. టీ బ్రేక్‌కు ముందు ఓవర్‌లో జెన్నింగ్స్‌ ఎల్బీ అవుట్‌ నిర్ణయాన్ని అశ్విన్‌ సవాల్‌ చేయగా రివ్యూలో అనుకూలంగా వచ్చింది. ఈ సెషన్‌ను వీరిద్దరు ఆటగాళ్లు ఓవర్‌కు నాలుగు పరుగుల చొప్పున సాధించారు. ఓవర్లు: 30, పరుగులు: 119, వికెట్లు: 0

సెషన్‌ – 3  నాయర్‌ తుఫాన్‌ ఇన్నింగ్స్‌
టీ బ్రేక్‌ అయిన రెండో ఓవర్‌లో మరోసారి ఫోర్‌తో నాయర్‌ తన సెంచరీని డబుల్‌గా మార్చాడు. అయితే కొద్దిసేపటికే అశ్విన్‌.. బ్రాడ్‌ బౌలింగ్‌లో అవుటయ్యాడు. మరుసటి ఓవర్‌లో నాయర్‌ ఇచ్చిన క్యాచ్‌ను రూట్‌ వదిలేసాడు. ఇక జడేజా వచ్చీ రాగానే బ్యాట్‌కు పనిచెప్పాడు. బాల్‌ బౌలింగ్‌లో వరుసగా సిక్స్, ఫోర్‌ బాదాడు. అటు నాయర్‌ కూడా మేనేజిమెంట్‌ నుంచి వచ్చిన ఆదేశాలతో ఇన్నింగ్స్‌లో దూకుడు చూపించాడు. రషీద్‌ వేసిన ఇన్నింగ్స్‌ 185వ ఓవర్‌లో ఓ సిక్స్, రెండు ఫోర్లు బాదాడు. ఆ తర్వాత జడేజా సిక్సర్‌తో భారత్‌ టెస్టుల్లో అత్యధిక స్కోరును అందుకుంది. 52 బంతుల్లో జడేజా అర్ధ సెంచరీ చేసిన అనంతరం డాసన్‌ బౌలింగ్‌లో అవుటయ్యాడు. ఆ తర్వాతే నాయర్‌ బౌండరీతో అరుదైన ట్రిపుల్‌ సాధించడంతో కెప్టెన్‌ కోహ్లి తమ ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేశాడు. అనంతరం ఇంగ్లండ్‌ 5 ఓవర్లలో వికెట్‌ నష్టపోకుండా రెండో ఇన్నింగ్స్‌లో 12 పరుగులు చేసింది.
భారత్‌ ఓవర్లు: 25.4, పరుగులు: 177, వికెట్లు: 2
ఇంగ్లండ్‌: 5, పరుగులు 12, వికెట్లు 0 వికెట్‌ కోల్పోకుండా) 12.


ఫోర్‌.. ఫోర్‌.. ఫోర్‌
కరుణ్‌ నాయర్‌ అద్భుత బ్యాటింగ్‌లో మరో అరుదైన ఫీట్‌ నమోదైంది. మామూలుగా ఏ ఆటగాడైనా సెంచరీకి అతి సమీపంలో ఉన్నప్పుడు సింగిల్‌ తీసేందుకు ప్రాధాన్యమిస్తాడే కానీ బౌండరీ కొట్టాలని ఏమాత్రం ప్రయత్నించడు. అయితే కరుణ్‌ ఒక్కసారి కాదు తన ‘మూడు’ సెంచరీలను ఇలాగే చేయడం విశేషం. 99 పరుగుల వద్ద ఫుల్‌ డెలివరీని ఆఫ్‌ సైడ్‌లో, 197 పరుగుల వద్ద కవర్స్‌ వైపు, 299 వద్ద పాయింట్‌ వైపు బౌండరీ కొట్టి అజేయంగా తన రికార్డు ఇన్నింగ్స్‌ను అందుకున్నాడు.

1 కెరీర్‌ మొదలయ్యాక తక్కువ ఇన్నింగ్స్‌ (3)లోనే ట్రిపుల్‌ సెంచరీ చేసిన తొలి ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు.

2 భారత్‌ నుంచి ట్రిపుల్‌ సెంచరీలు సాధించిన రెండో ఆటగాడు కరుణ్‌. గతంలో సెహ్వాగ్‌ రెండు సార్లు ట్రిపుల్‌ సాధించాడు.

3  ప్రపంచ టెస్టు క్రికెట్‌లో తన తొలి సెంచరీనే ట్రిపుల్‌ సెంచరీగా మలిచిన మూడో బ్యాట్స్‌మన్‌ నాయర్‌



కరుణ్‌ను అభినందిస్తున్న కోహ్లి ఇతర సభ్యులు

మరిన్ని వార్తలు