పాక్‌ విజయం: కశ్మీర్‌లో పేలిన టపాసులు

19 Jun, 2017 11:31 IST|Sakshi
పాక్‌ విజయం: కశ్మీర్‌లో పేలిన టపాసులు

శ్రీనగర్‌: పాకిస్తాన్‌తో జరిగిన చాంపియన్స్‌ ట్రోఫీ ఫైనల్లో టీమిండియా ఓడిపోయిందని భారత క్రికెట్‌ అభిమానులు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తుంటే జమ్మూకశ్మీర్‌లోని కొన్ని ప్రాంతాల్లో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. చాంపియన్స్‌ ట్రోఫీ టైటిల్‌ను పాకిస్తాన్‌ గెలవడంతో కశ్మీర్‌ యువత సంబరాలు చేసుకుంది. చాలా ప్రాంతాల్లో యువకులు బాణాసంచా కాల్చి, డాన్సులు చేశారు. శ్రీనగర్‌లోని పాతబస్తీలో ఫరా కాదల్‌, సెకిదాఫార్‌ ప్రాంతాల్లో సంబరాలు మిన్నంటాయి. కొంత మంది అత్యుత్సాహవంతులు బాణాసంచా కాల్చి సీఆర్ఫీఎఫ్‌ క్యాంపులు, స్థానిక పోలీస్‌ స్టేషన్‌లోకి విసిరారు.

పాకిస్తాన్‌ విజయంతో సాధించినందుకు ఆనందోత్సాహాలు వ్యక్తం చేస్తూ మహిళలు కూడా కశ్మీర్‌ లోయలోని చాలా ప్రాంతాల్లో వీధుల్లోకి వచ్చి హర్షాతిరేకాలు వ్యక్తం చేయడం గమనార్హం. గ్రామీణ ప్రాంతాల్లో యువత ఇంత హడావుడి చేయనప్పటికి బాజాలు, డప్పులు వాయించి తమ ఆనందాన్ని తెలిపారు.

అటు పాకిస్తాన్‌లోనూ సంబరాలు ఆకాశన్నంటాయి. తమ జట్టు తొలిసారి చాంపియన్స్‌ ట్రోఫీ సాధించడంతో పాక్‌ క్రికెట్‌ అభిమానులు వేడుకల్లో ముగినితేలుతున్నారు. తమ టీమ్‌కు ఘన స్వాగతం పలింకేందుకు సిద్ధమవుతున్నారు.

>
మరిన్ని వార్తలు