యూఎస్‌ ఓపెన్‌ మనదే

24 Jul, 2017 01:07 IST|Sakshi
యూఎస్‌ ఓపెన్‌ మనదే

పురుషుల సింగిల్స్‌ ఫైనల్లో కశ్యప్, ప్రణయ్‌

న్యూఢిల్లీ: విదేశీ గడ్డపై తొలి గ్రాండ్‌ప్రి గోల్డ్‌ టైటిల్‌ సాధించేందుకు హైదరాబాద్‌ బ్యాడ్మింటన్‌ ప్లేయర్‌ పారుపల్లి కశ్యప్‌ మరో విజయం దూరంలో ఉన్నాడు. కాలిఫోర్నియాలో జరుగుతున్న యూఎస్‌ ఓపెన్‌ గ్రాండ్‌ప్రి గోల్డ్‌ టోర్నీలో కశ్యప్‌తోపాటు భారత్‌కే చెందిన మరో అగ్రశ్రేణి ఆటగాడు హెచ్‌ఎస్‌ ప్రణయ్‌ ఫైనల్‌కు చేరడంతో పురుషుల సింగిల్స్‌ టైటిల్‌ భారత్‌ ఖాతాలో చేరడం ఖాయమైంది. ఆదివారం జరిగిన సెమీఫైనల్స్‌లో కశ్యప్‌ 15–21, 21–15, 21–16తో క్వాంగ్‌ హీ హియో (కొరియా)పై గెలుపొందగా... ప్రణయ్‌ 21–14, 21–19తో తియెన్‌ మిన్‌ ఎన్గుయెన్‌ (వియత్నాం)ను ఓడించాడు.

ఈ ఏడాది ఓ అంతర్జాతీయ టోర్నీలో ఇద్దరు భారత ఆటగాళ్లు ఫైనల్‌కు చేరడం ఇది రెండోసారి. ఇంతకుముందు ఏప్రిల్‌లో సింగపూర్‌ ఓపెన్‌లో సాయిప్రణీత్, శ్రీకాంత్‌ టైటిల్‌ కోసం తలపడ్డారు. 30 ఏళ్ల కశ్యప్‌ తన కెరీర్‌లో రెండు గ్రాండ్‌ప్రి గోల్డ్‌ టైటిల్స్‌ సాధించగా... ఆ రెండు టైటిల్స్‌ భారత్‌లో జరిగిన సయ్యద్‌ మోడీ టోర్నీలోనే కావడం విశేషం. మరోవైపు పురుషుల డబుల్స్‌ విభాగంలో భారత పోరాటం ముగిసింది. సెమీఫైనల్లో సుమీత్‌ రెడ్డి–మనూ అత్రి ద్వయం 12–21, 21–12, 20–22తో టాప్‌ సీడ్‌ లు చింగ్‌ యావో–యాంగ్‌ పో హాన్‌ (చైనీస్‌ తైపీ) జోడీ చేతిలో ఓడిపోయింది.

మరిన్ని వార్తలు