మెయిన్‌ ‘డ్రా’కు కశ్యప్‌

22 Nov, 2017 01:49 IST|Sakshi

కౌలూన్‌ (హాంకాంగ్‌): మళ్లీ పూర్వ వైభవం కోసం తపిస్తున్న భారత మాజీ నంబర్‌వన్‌ పారుపల్లి కశ్యప్‌ హాంకాంగ్‌ ఓపెన్‌ సూపర్‌ సిరీస్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీలో మెయిన్‌ ‘డ్రా’కు అర్హత పొందాడు. మంగళవారం జరిగిన పురుషుల సింగిల్స్‌ క్వాలిఫయింగ్‌ మ్యాచ్‌ల్లో కశ్యప్‌ 21–12, 21–10తో కాన్‌ చావో యు (చైనీస్‌ తైపీ)పై, 21–13, 21–19తో లీ చెయుక్‌ యియు (హాంకాంగ్‌)పై గెలిచాడు. మిక్స్‌డ్‌ డబుల్స్‌ క్వాలిఫయింగ్‌ తొలి రౌండ్‌లో సాత్విక్‌ సాయిరాజ్‌–అశ్విని పొన్నప్ప జంట 18–21, 11–21తో హఫీజ్‌ ఫైజల్‌–గ్లోరియా (ఇండోనేసియా) జోడీ చేతిలో ఓడిపోయింది. బుధవారం జరిగే మెయిన్‌ ‘డ్రా’ మ్యాచ్‌ల్లో మెటీ పౌల్సెన్‌ (డెన్మార్క్‌)తో సైనా నెహ్వాల్‌; లెయుంగ్‌ యీ (హాంకాంగ్‌)తో పీవీ సింధు; టామీ సుగియార్తో (ఇండోనేసియా)తో సౌరభ్‌ వర్మ; హు యున్‌ (హాంకాంగ్‌)తో ప్రణయ్‌; సన్‌ వాన్‌ హో (కొరియా)తో సాయిప్రణీత్‌; లీ డాంగ్‌ కెయున్‌ (కొరియా)తో కశ్యప్‌ తలపడతారు.   

ప్రాంజల జంట ముందంజ
ముంబై: హైదరాబాద్‌ అమ్మాయి యడ్లపల్లి ప్రాంజల ముంబై ఓపెన్‌ డబ్ల్యూటీఏ ఓపెన్‌ టెన్నిస్‌ టోర్నీలో డబుల్స్‌లో క్వార్టర్‌ ఫైనల్‌కు చేరింది. మంగళవారం జరిగిన మహిళల డబుల్స్‌ తొలి రౌండ్‌లో ప్రాంజల–కర్మన్‌కౌర్‌ థండి (భారత్‌) జంట 6–3, 7–5తో నైక్‌తా బెయిన్స్‌ (ఆస్ట్రేలియా)–ఫ్యానీ స్టోలర్‌ (హంగేరి) ద్వయంపై గెలిచింది.   

మరిన్ని వార్తలు