కశ్యప్ పరాజయం

23 Oct, 2013 01:12 IST|Sakshi
కశ్యప్ పరాజయం

పారిస్: ఈ ఏడాది నాలుగోసారి భారత స్టార్ ప్లేయర్ పారుపల్లి కశ్యప్ సూపర్ సిరీస్ టోర్నమెంట్ నుంచి తొలి రౌండ్‌లోనే నిష్ర్కమించాడు. మంగళవారం మొదలైన ఫ్రెంచ్ ఓపెన్ సూపర్ సిరీస్ టోర్నమెంట్‌లో ఈ ఆంధ్రప్రదేశ్ క్రీడాకారుడికి తొలి రౌండ్‌లోనే ఓటమి ఎదురైంది. ప్రపంచ నంబర్‌వన్, టాప్ సీడ్ లీ చోంగ్ వీ (మలేసియా)తో జరిగిన మ్యాచ్‌లో ప్రపంచ 13వ ర్యాంకర్ కశ్యప్ 20-22, 12-21తో పరాజయాన్ని చవిచూశాడు. ఈ సంవత్సరం సింగపూర్ ఓపెన్, ఇండోనేసియా ఓపెన్, ఇండియా ఓపెన్ సూపర్ సిరీస్ టోర్నీలలో కూడా కశ్యప్ తొలి రౌండ్‌లోనే ఓడిపోయాడు.
 
  గతవారం జరిగిన డెన్మార్క్ ఓపెన్‌లో అతను రెండో రౌండ్‌లో ఓటమి పాలయ్యాడు. మరో మ్యాచ్‌లో అజయ్ జయరామ్ 21-16, 21-11తో కజుమాసా సకాయ్ (జపాన్)ను ఓడించి రెండో రౌండ్‌లోకి అడుగుపెట్టాడు. అంతకుముందు జరిగిన పురుషుల క్వాలిఫయింగ్ పోటీల నుంచి ముగ్గురు భారత ఆటగాళ్లు మెయిన్ ‘డ్రా’కు అర్హత సాధించారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కిడాంబి శ్రీకాంత్, భమిడిపాటి సాయిప్రణీత్, మహారాష్ట్ర ప్లేయర్ ఆనంద్ పవార్ మెయిన్ ‘డ్రా’కు చేరుకున్నారు.
 
 మంగళవారం జరిగిన క్వాలిఫయింగ్ చివరి రౌండ్ మ్యాచ్‌ల్లో శ్రీకాంత్ 18-21, 21-18, 21-11తో సౌరభ్ వర్మ (భారత్)పై, సాయిప్రణీత్ 21-12, 21-15తో లూకాస్ కోర్వీ (ఫ్రాన్స్)పై, ఆనంద్ పవార్ 16-21, 21-11, 21-19తో జోచిమ్ పెర్సన్ (డెన్మార్క్)పై గెలిచారు. బుధవారం జరిగే మ్యాచ్‌ల్లో సుంగ్ జీ హున్ (దక్షిణ కొరియా)తో పి.వి.సింధు; నిచావోన్ జిందాపోన్ (థాయ్‌లాండ్)తో సైనా నెహ్వాల్; వింగ్ కీ వోంగ్ (హాంకాంగ్)తో శ్రీకాంత్; విటిన్‌గస్ (డెన్మార్క్)తో సాయిప్రణీత్; థామస్ రూక్సెల్ (ఫ్రాన్స్)తో ఆనంద్ పవార్ పోటీపడతారు.

మరిన్ని వార్తలు