జాదవ్‌ బర్త్‌డే.. నెటిజన్లు ఫిదా!

26 Mar, 2020 18:39 IST|Sakshi

టీమిండియా మిడిలార్డర్‌ బ్యాట్స్‌మన్‌ కేదార్‌ జాదవ్‌ తన 35వ బర్త్‌డే వేడుకలను చాలా సింపుల్‌గా జరుపుకున్నాడు. అయితే తన బర్త్‌డే రోజు ఓ మంచి పని చేసి అభిమానుల మనసులు దోచుకున్నాడు. తన సొంత పట్టణమైన పుణేలోని ఓ ఆస్పత్రిలో ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్న ఓ వ్యక్తికి అత్యవసరంగా రక్తం అవసరం ఏర్పడింది. ఈ విషయాన్ని ఓ ఎన్జీవో నుంచి తెలుసుకున్న జాదవ్‌ స్పందించాడు. వెంటనే ఆ ఎన్జీవోకు వెళ్లి రక్త దానం చేశాడు. జాదవ్‌ రక్త దానం చేసిన ఫోటోలను ఆ ఎన్జీవో తన ట్విటర్‌లో షేర్‌ చేసింది. దీంతో ఆ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట్లో తెగ వైరల్‌ అవుతున్నాయి.  బర్త్‌డే రోజు ఓ నిండు ప్రాణాన్ని కాపాడవని నెటిజన్లు జాదవ్‌ను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. అంతేకాకుండా ప్రతీ ఒక్కరూ కనీసం వారివారి పుట్టినరోజునైనా రక్త దానం చేయాలని కొందరు నెటిజన్లు విజ్ఞప్తి చేస్తున్నారు. 

ఇక కేదార్‌ జాదవ్‌ మిడిలార్డర్‌ బ్యాట్స్‌మన్‌గా, జట్టుకు అవసరమైన సమయంలో తన ఆఫ్‌ స్పిన్‌ బౌలింగ్‌తో టీమిండియాకు సేవలందిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ మధ్య కాలంలో గాయాల కారణంగా, ఫామ్‌లో లేక జట్టు నుంచి ఉద్వాసనకు గురయ్యాడు. ఈ క్రమంలోనే శ్రేయాస్‌ అ‍య్యర్‌, మనీశ్‌ పాండేలు తమకు వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకోవడంతో వీరి నుంచి జాదవ్‌కు విపరీతమైన పోటీ ఏర్పడింది. అయితే ఇప్పటికీ జాదవ్‌ టీమిండియా సెలక్షన్స్‌లో రెగ్యులర్‌గా ఉంటాడు. ఇక ఐపీఎల్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ తరుపున ప్రాతిని​థ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ ఐపీఎల్‌లో రాణించి అక్టోబర్‌లో జరిగే టీ20 ప్రపంచకప్‌లో టీమిండియాలో చోటు దక్కించుకోవాలని తహతహలాడాడు. కానీ కరోనా కారణంగా ఐపీఎల్‌ రద్దు అయ్యే అవకాశాలు ఉండటంతో జాదవ్‌ కాస్త నిరుత్సాహపడ్డాడు. 

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా