కేదార్‌ జాధవ్‌పై వేటు.. తుదిజట్టు నుంచి ఔట్‌!

1 Jul, 2019 17:43 IST|Sakshi

ప్రపంచకప్‌లో భాగంగా టీమిండియా మంగళవారం బంగ్లాదేశ్‌తో కీలక మ్యాచ్‌ ఆడబోతున్న సంగతి తెలిసిందే. ఎడ్జ్‌బాస్టన్‌ మైదానంలో జరిగే తమ ఎనిమిదో మ్యాచ్‌లో టీమిండియా తుదిజట్టులో పలు మార్పులు చేసే అవకాశముంది. ముఖ్యంగా కేదార్‌ జాధవ్‌ను తుదిజట్టు నుంచి తప్పించే అవకాశం కనిపిస్తోంది.

ప్రపంచకప్‌లో కేదార్‌ జాధవ్‌కు వరుసగా అవకాశాలు లభిస్తున్నాయి. అయితే, ఆదివారం ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో కేదార్‌ చెత్త బ్యాటింగ్‌తో అభిమానుల ఆగ్రహాన్ని చవిచూస్తున్నాడు. గెలుపు కోసం 31 బంతుల్లో 71 పరుగులు చేయాల్సిన తరుణంలో ఇటు కేదార్‌ జాధవ్‌ కానీ, అటు సీనియర్‌ బ్యాట్స్‌మన్‌ మహేంద్రసింగ్‌ ధోనీ కానీ.. ఆ కసిని, తపనను చూపించలేదు. భారీ లక్ష్యాన్ని ఛేదించాలన్న ధోరణి వారి ఆటతీరులో ఏ కోశాన కనిపించలేదు. భారీ లక్ష్యం ఎదురుగా ఉన్నా... ఈ జోడీ తమకు ఉన్న 31 బంతుల్లో 20 సింగిళ్లు తీసింది. ఏడు డాట్‌ బాల్స్‌ ఆడింది. చివరి ఓవర్‌లో ధోనీ ఒక సిక్స్‌ కొట్టాడు. అప్పటికే మ్యాచ్‌ ఇంగ్లండ్‌ చేతిలో వాలిపోయింది.

ఉత్కంఠభరిత క్షణాల్లో వీరోచితంగా ఆడాల్సిన సమయంలో నింపాదిగా టెస్ట్‌ మ్యాచ్‌ ఆడినట్టు ధోనీ-జాధవ్‌ బ్యాటింగ్‌ చేశారనే విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. ఒకవైపు రిక్వైర్డ్‌ రన్‌రేట్‌ రాకేట్‌లా పైకి దూసుకుపోతుంటే... వీరు నింపాదిగా బ్యాటింగ్‌ చేస్తుండటం.. కామెంటేటర్లుగా వ్యవహరించిన సౌరవ్‌ గంగూలీ, నాసీర్‌ హుస్సేన్‌ను సైతం విస్తుగొలిపింది.  ఈ నేపథ్యంలో కేదార్‌ జాధవ్‌పై వేటు పడటం ఖాయమేనని వినిపిస్తోంది. అతన్ని తుది జట్టు నుంచి తప్పించి.. ఆ స్థానంలో రవీంద్ర జడ్డేజాను జట్టులోకి తీసుకునే అవకాశముంది. జడేజా బెస్ట్‌ ఫీల్డర్‌, లెఫ్ట్‌ ఆర్మ్‌ లెగ్‌ స్పిన్‌ బౌలరే కాకుండా.. లోయర్‌ ఆర్డర్‌లో ధాటిగా ఆడగల బ్యాట్స్‌మన్‌ కూడా. 
 

>
మరిన్ని వార్తలు