చెన్నై సూపర్‌ కింగ్స్‌కు ఎదురుదెబ్బ

9 Apr, 2018 19:43 IST|Sakshi
కేదార్‌ జాదవ్‌

సాక్షి, చెన్నై: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)లో చెన్నై సూపర్‌ కింగ్స్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆల్‌రౌండర్‌ కేదార్‌ జాదవ్‌ గాయం కారణంగా జట్టుకు దూరమయ్యాడు. ముంబై ఇండియన్స్‌తో శనివారం వాంఖేడే మైదానంలో జరిగిన ఈ సీజన్‌ ఆరంభ మ్యాచ్‌లో ఓపెనర్‌గా బరిలోకి దిగిన జాదవ్‌ రిటైర్డ్‌ హర్ట్‌గా వెనుదిరిగాడు. మ్యాచ్‌ చివరిలో వచ్చి కీలక షాట్లతో జట్టుకు విజయాన్ని అందించాడు. చివరి ఓవర్‌లో 7 పరుగులు అవసరం కాగా సిక్స్‌, ఫోర్‌ బాది సత్తా చాటాడు.

తొడ నరాలు పట్టేయడంతో జాదవ్‌ ఐపీఎల్‌ సిరీస్‌ మొత్తానికి దూరమయ్యాడు. మిడిలార్డర్‌లో కీలక బ్యాట్స్‌మన్‌ అయిన జాదవ్‌ గాయంతో తప్పుకోవడం తమ జట్టుకు పెద్ద నష్టమని బ్యాటింగ్‌ కోచ్‌ మైకేల్‌ హసీ పేర్కొన్నాడు.

జనవరిలో జరిగిన వేలంలో రూ. 7.8 కోట్లకు అతడిని చెన్నై సూపర్‌ కింగ్స్‌ దక్కించుకుంది. తర్వాతి మ్యాచ్‌లో జాదవ్‌ స్థానంలో ఎవరిని ఆడిస్తారో చూడాలి. మంగళవారం చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరిగే మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో సూపర్‌ కింగ్స్‌ తలపడనుంది.

మరిన్ని వార్తలు