సీఎస్‌కేకు థాంక్స్‌: కేదర్‌ జాదవ్‌

17 Nov, 2018 15:34 IST|Sakshi
కేదర్‌ జాదవ్‌(ఫైల్‌ఫొటో)

చెన్నై: వచ్చే ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)లో భాగంగా తనను రిటైన్‌ చేసుకున్న చెన్నై సూపర్‌కింగ్స్‌(సీఎస్‌కే)కు కేదార్‌ జాదవ్‌ ధన్యవాదాలు తెలియజేశాడు. 2019 ఐపీఎఎల్‌ సీజన్‌కు సంబంధించి ప్రతీ జట్టు భారీ మార్పులు చేసిన సంగతి తెలిసిందే. కొంతమంది ఆటగాళ్లను అట్టిపెట్టుకున్న సదరు ఫ్రాంచైజీలు.. మరి కొంతమంది స్టార్‌ ఆటగాళ్లను సైతం విడుదల చేశాయి. ఈ క్రమంలోనే చెన్నై సూపర్‌కింగ్స్‌ ఇంగ్లిష్‌ క్రికెటర్‌ మార్క్‌ వుడ్‌తో సహా గత సీజన్‌లో ఒక్క మ్యాచ్‌ కూడా ఆడని క్షితిజ్‌ శర్మ, కనిష్క్‌ సేత్‌లకు ఉద్వాసన పలికింది. కాగా, గత సీజన్‌లో రూ. 7.80 కోట్ల ధరతో సీఎస్‌కేకు వచ్చిన జాదవ్‌ను రిటైన్‌ జాబితాలో ఉంచింది. దాంతో సీఎస్‌కేకు ట‍్వీటర్‌ ద్వారా జాదవ్‌ కృతజ్ఞతలు తెలియజేశారు. ‘నన్ను సీఎస్‌కే అట్టిపెట్టుకున్నందుకు చాలా రుణపడి ఉంటాను. థాంక్యూ చెన్నై. మరోసారి ఎల్లో జెర్సీ ధరించడానికి ఆతృతగా ఉన్నా’ అని జాదవ్‌ ట్వీట్‌ చేశాడు.

నవంబర్ 15లోగా ఐపీఎల్‌ ఫ్రాంచైజీలు తాము రిటైన్ చేసుకున్న ఆటగాళ్ల జాబితాను అందించాలని ఐపీఎల్ నిర్వాహకులు సూచించారు. దాంతో కాంట్రాక్ట్ పూర్తయిన ఆటగాళ్లతో పాటు ఫామ్‌లో లేని ఆటగాళ్లందరినీ ఐపీఎల్ ఫ్రాంచైజీలు వదులుకున్నాయి. పంజాబ్‌ జట్టులోని కీలక ఆటగాళ్లైన యువరాజ్‌, అరోన్‌ ఫించ్‌, అక్షర్‌ పటేల్‌ను విడుదల చేసింది. గత ఐపీఎల్ వేలంలో అత్యధికంగా రూ 11.5 కోట్లు వెచ్చించి తీసుకున్న ఎడమచేతివాటం పేసర్‌ ఉనాద్కత్‌ను సైతం రాజస్తాన్‌ రాయల్స్‌ విడుదల చేయగా, గౌతం గంభీర్‌ను ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ వదులుకోవడం గమనార్హం.

మరిన్ని వార్తలు