భారత్‌ను ఓడించడం అంత ఈజీ కాదు!

11 Feb, 2018 17:28 IST|Sakshi
కెప్టెన్ విరాట్ కోహ్లి, ఎంఎస్ ధోని (ఫైల్ ఫొటో)

వచ్చే వన్డే వరల్డ్ కప్‌లో భారత్‌తో అంత ఈజీ కాదు

భువనేశ్వర్, బూమ్రా, ధావన్ అద్భుతంగా రాణిస్తున్నారు

భారత జట్టుపై దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ ప్రశంసలు

జొహన్నెస్‌బర్గ్‌: దక్షిణాఫ్రికా చేతిలో టెస్టు సిరీస్‌ కోల్పోయిన టీమిండియా వన్డే సిరీస్‌లో మాత్రం అంచనాలకు మించి రాణిస్తోంది. వరుసగా మూడు వన్డేల్లో నెగ్గిన విరాట్ కోహ్లి నేతృత్వంలోని టీమిండియా కొన్ని ప్రతికూల పరిస్థితుల కారణంగా శనివారం జరిగిన నాలుగో వన్డేలో ఓటమి పాలైంది. దీనిపై దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ కెప్లర్ వెస్సెల్స్ స్పందించాడు. కోహ్లి నేతృత్వంలోని ప్రస్తుత వన్డే జట్టును ఓడించడం 2019 వన్డే ప్రపంచ కప్‌లో ఏ జట్టుకైనా కష్టమేనని అభిప్రాయపడ్డాడు. టీమిండియా తన ఫెవరెట్ మాత్రం కాదని, అయితే బలమైన జట్టు అని తాను నమ్ముతున్నట్లు తెలిపాడు.

భారత జట్టు వన్డేల్లోనూ బలమైన ప్రత్యర్థిని ఓడించగలదు. అందులోనూ కోహ్లి లాంటి ఆటగాడు పరుగులు చేయడం, కెప్టెన్‌గా జట్టును ముందుండి నడిపించడం భారత్‌కు కలిసొచ్చే అంశం. దక్షిణాఫ్రికా టెస్టు, వన్డే జట్లకు ఎంతో వ్యత్యాసం ఉంది. టెస్టు సిరీస్‌లో ఆడిన ఆటగాళ్లు కొందరు మాత్రమే సఫారీ వన్డే టీమ్‌లో కొనసాగుతున్నారు. అందుకే నాణ్యమైన ఆటతీరును ఆతిథ్య జట్టు ప్రదర్శించలేక పోతుంది. భారత్ విజయానికొస్తే.. భువనేశ్వర్ కుమార్, జస్ప్రిత్ బూమ్రా లాంటి మేటి ఫాస్ట్ బౌలర్లు ప్లస్ పాయింట్. భువీ  బంతితో పాటు బ్యాట్‌తోనూ జట్టు విజయాల్లో కీలక పోషిస్తాడు. యార్లర్లతో ప్రత్యర్ధి బ్యాట్స్‌మెన్లను ముప్పుతిప్పలు పెట్టగల నైపుణ్యం బూమ్రా సొంతం.

రోహిత్ లోపం అదే!
దక్షిణాఫ్రికా పర్యటనలో దారుణంగా విఫలమైన ఆటగాడు, టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ. టెస్టుల్లో ఏమాత్రం రాణించని రోహిత్.. వన్డే సిరీస్‌లో గత నాలుగు వన్డేల్లోనూ చెత్త షాట్లతో వికెట్లు సమర్పించుకుంటున్నాడు. ఫుట్‌వర్క్ లోపం వల్లే రోహిత్ త్వరగా ఔట్ అవుతున్నాడు. అందుకే రోహిత్ సగటు ఇక్కడ 10 ఉంది. మరో ఓపెనర్ శిఖర్ ధావన్ మాత్రం స్థాయికి తగ్గట్లు పరుగులు సాధిస్తున్నాడు. షార్ట్‌ పిచ్ బంతులు ఆడలేకపోయినా.. చెత్త బంతులను వదిలేస్తూ జట్టుకు విలువైన భాగస్వామ్యాలు అందిస్తున్నాడని కెప్లర్ వెస్సెల్స్ కొనియాడాడు.

మరిన్ని వార్తలు