నాలో నేనే మాట్లాడుకున్నా: రోహిత్‌

22 Oct, 2019 15:09 IST|Sakshi

రాంచీ: దక్షిణాఫ్రికాతో టెస్టు  సిరీస్‌లో విశేషంగా రాణించిన టీమిండియా ఓపెనర్‌ రోహిత్‌ శర్మ మ్యాన్‌ ఆఫ్‌ ద సిరీస్‌ అవార్డు గెలుచుకున్నాడు. అలాగే చివరి టెస్టులో డబుల్‌ సెంచరీ సాధించడంతో మరో మాటలేకుండా ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డును కూడా దక్కించుకున్నాడు. ఓపెనర్‌గా అరంగేట్రం చేసిన టెస్టు సిరీస్‌లోనే రెండు ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌లు, మ్యాన్‌ ఆఫ్‌ ద సిరీస్‌ గెలుచుకోవడం విశేషం. కాగా, మూడో టెస్టులో అవార్డులు అందుకునే క్రమంలో మాట్లాడిన రోహిత్‌ శర్మ.. ఎలాగైనా రాణించాలనే ధృడ సంకల్పంతోనే బరిలోకి దిగినట్లు వెల్లడించాడు. ‘ టెస్టుల్లో ఓపెనర్‌గా ఇది నాకు గొప్ప ఆరంభాన్ని తీసుకొచ్చింది. ఇదే తరహా ప్రదర్శనను పునరావృతం చేయాలనుకుంటున్నా.

2013లో పరిమిత ఓవర్ల క్రికెట్‌లో ఓపెనర్‌గా దిగినప్పుడే నేను ఓపెనింగ్‌ అనేది కీలక బాధ్యతని గ్రహించా. ఈ స్థానంలో అత్యంత క్రమశిక్షణతో ఆడి ఇన్నింగ్స్‌ను ఆరంభించాల్సి ఉంటుంది. ఒకసారి గాడిలో పడిన తర్వాత మన సహజసిద్ధ గేమ్‌ను ఆడొచ్చు. అదే సూత్రాన్ని అవలంభించి వైట్‌బాల్‌ క్రికెట్‌లో ఓపెనర్‌గా సక్సెస్‌ అయ్యా. ఇక టెస్టు ఫార్మాట్‌ అనేది ఒక భిన్నమైన బాల్‌ గేమ్‌. ఎప్పటికప్పుడు మానసిక పరిపక్వతతో ఆడాలి. మన మైండ్‌ సెట్‌ను పరిస్థితులకు తగ్గట్టు అలవాటు చేసుకోవాలి. ఈ సిరీస్‌లో నేను ఎప్పటికప్పుడు నాలోనే మాట్లాడుకున్నా. భారీ స్కోర్లు సాధించాలని అనుకున్నా. జట్టును పటిష్ట స్థితిలో నిలపాలంటే నా నుంచి మంచి ఇన్నింగ్స్‌ రావాలనే లక్ష్యంతో ముందుకు సాగా. దాంతో నేను అనుకున్న ఫలితం వచ్చింది. ఇక్కడ టీమిండియా మేనేజ్‌మెంట్‌, కోచ్‌, కెప్టెన్‌ల సహకారం మరువలేనిది. వారి నుంచి నాకు ఎక్కువ సహకారం లభించడంతోనే స్వేచ్ఛగా ఆడా’ అని రోహిత్‌ వెల్లడించాడు.

మరిన్ని వార్తలు