కేరళను ఆదుకున్న బ్యాట్స్‌మెన్

3 Sep, 2013 03:09 IST|Sakshi
కేరళను ఆదుకున్న బ్యాట్స్‌మెన్

 సాక్షి, హైదరాబాద్: ఆలిండియా మొయినుద్దౌలా గోల్డ్ కప్ క్రికెట్ టోర్నమెంట్ తొలి రోజు సోమవారం కేరళ బ్యాట్స్‌మెన్ రాణించారు. ఉప్పల్ స్టేడియంలో  హైదరాబాద్ ఎలెవన్‌తో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో కేరళ నిర్ణీత 90 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 312 పరుగులు చేసింది. అక్షయ్ కొడాత్ (111 బంతుల్లో 65; 10 ఫోర్లు), ఆర్‌ఎస్ రంజిత్ (185 బంతుల్లో 63; 10 ఫోర్లు), అక్షయ్ చంద్రన్ (73 బంతుల్లో 60 నాటౌట్; 8 ఫోర్లు) అర్ధ సెంచరీలు చేయగా, మను కృష్ణన్ (76 బంతుల్లో 44; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించాడు. హైదరాబాద్ బౌలర్లలో అన్వర్ ఖాన్, ఆశిష్ రెడ్డి, అమోల్ షిండే తలా 2 వికెట్లు పడగొట్టారు.
 సందీప్ రాజన్ సెంచరీ
 ఈసీఐఎల్ మైదానంలో కర్ణాటకతో జరుగుతున్న మ్యాచ్‌లో హైదరాబాద్ ప్రెసిడెంట్స్ ఎలెవన్ బ్యాట్స్‌మన్ సందీప్ రాజన్ (126 బంతుల్లో 106; 9 ఫోర్లు, 5 సిక్స్‌లు) శతకం సాధించాడు. అభినవ్ కుమార్ (126 బంతుల్లో 66; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు), బెంజమిన్ థామస్ (48), ఆకాశ్ భండారి (35) కూడా రాణించడంతో ప్రెసిడెంట్స్ ఎలెవన్ తొలి ఇన్నింగ్స్‌లో 89.3 ఓవర్లలో 339 పరుగులకు ఆలౌటైంది. కర్ణాటక బౌలర్లలో ఎస్.అరవింద్ 3, అక్షయ్, అబ్రార్, కరుణ్ నాయర్‌లు తలా 2 వికెట్లు తీశారు.
 రవికాంత్‌కు 4 వికెట్లు
 ఏఓసీ మైదానంలో జరుగుతున్న మరో మ్యాచ్‌లో సర్వీసెస్ జట్టు తమిళనాడును కట్టడి చేసింది. ఫలితంగా తమిళనాడు తొలి ఇన్నింగ్స్‌లో 88.1 ఓవర్లలో 261 పరుగులకు ఆలౌటైంది. సురేశ్ కుమార్ (106 బంతుల్లో 65; 7 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీ చేయగా, సుశీల్ (45), కౌశిక్ (34), అపరాజిత్ (30) ఫర్వాలేదనిపించారు. రవికాంత్ 4, దినేశ్, అజహరుద్దీన్ చెరో 2 వికెట్లు తీశారు.
 మనన్ శర్మ 5/77
 ఢిల్లీ బౌలర్ మనన్ శర్మ (5/77) రాణించడంతో ఎన్‌ఎఫ్‌సీ గ్రౌండ్‌లో జరుగుతున్న మ్యాచ్‌లో గోవా మొదటి ఇన్నింగ్స్‌లో 69.1 ఓవర్లలో 244 పరుగులకే ఆలౌటైంది. రాహుల్ (176 బంతుల్లో 77; 9 ఫోర్లు, 1 సిక్స్), స్నేహల్ (119 బంతుల్లో 51; 5 ఫోర్లు) అర్ధ సెంచరీలు చేశారు. సుమీత్ నర్వాల్‌కు 2 వికెట్లు దక్కాయి. అనంతరం ఢిల్లీ ఆట ముగిసే సరికి తమ తొలి ఇన్నింగ్స్‌లో 9 ఓవర్లలో వికెట్ నష్టానికి 25 పరుగులు చేసింది.

>
మరిన్ని వార్తలు