శ్రీశాంత్‌పై నిషేధాన్ని ఎత్తివేయండి

4 Mar, 2017 01:15 IST|Sakshi
శ్రీశాంత్‌పై నిషేధాన్ని ఎత్తివేయండి

బీసీసీఐకి కేరళ హైకోర్టు నోటీసు  

న్యూఢిల్లీ: తనపై విధించిన జీవితకాల నిషేధం తొలగింపుపై అవిశ్రాంతంగా పోరాడుతున్న పేస్‌ బౌలర్‌ ఎస్‌.శ్రీశాంత్‌కు ఇది ఊరటనిచ్చే విషయమే. భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) విధించిన ఈ నిషేధాన్ని సవాల్‌ చేస్తూ బుధవారం అతడు కేరళ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశాడు. ఈ విచారణలో 34 ఏళ్ల కేరళ స్పీడ్‌స్టర్‌కు హైకోర్టు సాంత్వన కలిగించింది. వెంటనే అతడిపై ఉన్న జీవితకాల నిషేధాన్ని ఎత్తేయాల్సిందిగా బీసీసీఐకి కోర్టు నోటీస్‌ పంపింది. 2013లో జరిగిన ఐపీఎల్‌–6 సీజన్‌లో శ్రీశాంత్‌ స్పాట్‌ ఫిక్సింగ్‌ ఆరోపణలతో అరెస్ట్‌ అయ్యాడు. అయితే 2015 జూలైలో అతడిపై ఉన్న అభియోగాలను కొట్టివేస్తూ పటియాలా హౌస్‌ కోర్టు నిర్దోషిగా విడుదల చేసింది. ఆ తర్వాత స్థానిక టోర్నీల్లో ఆడేందుకు శ్రీశాంత్‌ ప్రయత్నించినా బీసీసీఐ మాత్రం తాము విధించిన నిషేధాన్ని అలాగే కొనసాగిస్తూ వస్తోంది.

గత నెల 16న శ్రీశాంత్‌ లీగల్‌ నోటీస్‌ పంపినా బీసీసీఐ పట్టించుకోలేదు. అయితే స్కాటిష్‌ క్లబ్‌ తరఫున లీగ్‌ క్రికెట్‌ ఆడేందుకు అతను ఒప్పందం కుదుర్చుకున్నాడు. అంతకంటే ముందుగా ఏప్రిల్‌లో జరిగే ఈ టోర్నీలో ఆడేందుకు బోర్డు నుంచి నిరభ్యంతర పత్రం (ఎన్‌ఓసీ) తీసుకోవడం తప్పనిసరి. కానీ బోర్డు నుంచి స్పందన కనిపించకపోవడంతో శ్రీశాంత్‌ కోర్టుకెక్కాడు.

>
మరిన్ని వార్తలు