ఆస్ట్రేలియా ఓపెన్ ఫైనల్లో సెరెనాకు షాక్

30 Jan, 2016 17:12 IST|Sakshi
ఆస్ట్రేలియా ఓపెన్ ఫైనల్లో సెరెనాకు షాక్

మెల్బోర్న్: డిఫెండింగ్ చాంపియన్, వరల్డ్ నంబర్ వన్ క్రీడాకారిణి సెరెనా విలియమ్స్ కు  ఆస్ట్రేలియా ఓపెన్  ఫైనల్లో అనూహ్య ఓటమి  ఎదురైంది.  ఆదివారం జరిగిన ఫైనల్లో సెరెనా 4-6,  6-3,  4-6 తేడాతో  ఏడో సీడ్ క్రీడాకారిణి  కెర్బర్(జర్మనీ) చేతిలో ఓటమి పాలైంది. దీంతో తన కెరీర్ లో 22 గ్రాండ్ స్లామ్ సాధించి స్టెఫీగ్రాఫ్ రికార్డును సమానం చేద్దామనుకున్న సెరెనా ఆశలు తీరకపోగా, ఏడోసారి ఆస్ట్రేలియా ఓపెన్ గ్రాండ్ స్లామ్ ను గెలుద్దామనుకున్న నల్ల కలువ లక్ష్యానికి బ్రేక్ పడింది.


అంచనాలు మించి రాణించిన కెర్బర్ ఆస్ట్రేలియా ఓపెన్ మహిళల చాంపియన్ గా అవతరించి సరికొత్త రికార్డును సృష్టించింది. తన కెరీర్ లో తొలి గ్రాండ్ స్లామ్ గెలిచిన కెర్బర్.. కొత్త చరిత్రతో ప్రపంచ టెన్నిస్ నివ్వెరపోయేలే చేసింది. తొలి సెట్ లో సెరెనా సర్వీసులను పలుమార్లు బ్రేక్ చేసిన కెర్బర్ ఆ గేమ్ ను సొంతం చేసుకుని పైచేయి సాధిచింది.  అయితే రెండో సెట్ లో తిరిగి పుంజుకున్న సెరెనా తనదైన సర్వీసులతో రెచ్చిపోయి రెండో సెట్ ను చేజిక్కించుకుంది.  దీంతో నిర్ణయాత్మక మూడో సెట్ అనివార్యమైంది.  తన కెరీర్ లో తొలి గ్రాండ్ స్లామ్ సాధించాలన్న పట్టుదలతో ఉన్న కెర్బర్.. సెరెనాను  ముప్పుతిప్పలు పెట్టింది.  ఈ సెట్ లో సెరెనా అనవసర తప్పిదాలు చేసి తగిన మూల్యం చెల్లించుకుంది. ఓవరాల్ గా 26వ గ్రాండ్ స్లామ్ ఫైనల్ ఆడిన సెరెనాకు ఇది ఐదో ఓటమి.

>
మరిన్ని వార్తలు