మనం మరచిన మల్లయోధుడు

27 Apr, 2020 01:23 IST|Sakshi
స్వర్ణ, రజత పతక విజేతలతో ఖాషాబా (కుడి చివర)

ఒలింపిక్స్‌లో వ్యక్తిగత పతకం నెగ్గిన తొలి భారతీయ ప్లేయర్‌గా ఘనత

ఖాషాబా దాదాసాహెబ్‌ జాదవ్‌... ఈ తరంలో చాలామందికి తెలియని పేరు! గడిచిపోయిన గతానికి... మరచిపోయిన మల్లయోధుడే జాదవ్‌! స్వాతంత్య్రం రాకముందే కుస్తీ క్రీడలో ఆరితేరాడు. రాటుదేలాక ఒలింపిక్స్‌లో పోటీపడ్డాడు. దీనికంటే ముందు ఆర్థిక సమస్యలతోనూ తలపడ్డాడు. అయినా సరే చివరకు విశ్వ క్రీడల్లో సత్తా చాటాడు. తన రెండో ఒలింపిక్స్‌ ప్రయత్నంలో కాంస్యం సాధించాడు. స్వతంత్ర భారతావని తరఫున వ్యక్తిగత విభాగంలో పతకం గెలిచిన తొలి భారతీయ క్రీడాకారుడిగా చరిత్ర పుటల్లోకి చేరాడు.   

ఇప్పుడైతే దేశంలో ఏ మూలనో ఉన్నా కూడా ప్రతిభ ఉన్నవారు నిమిషాల నిడివి వీడియోలతోనే వైరల్‌ అవుతున్నారు. తర్వాత్తర్వాత ‘రియల్‌ హీరో’లూ అవుతున్నారు. కానీ దేశానికి స్వేచ్ఛావాయువులొచ్చిన తొలి నాళ్లలో రియల్‌ హీరో అయినా... ఖాషాబా వైరల్‌ మాత్రం కాలేకపోయాడు. ఇది అలనాటి కాలమహిమ! అందుకే రోజులో గంటల తరబడి మట్టిలో కసరత్తు చేసి ఒలింపిక్స్‌ లాంటి విశ్వక్రీడలకు 1948లోనే అర్హత సాధించగలిగాడు. ఇప్పుడెన్నో వసతులు... ‘టాప్‌’లాంటి పథకాలున్నాయి. అప్పుడేవీ లేవు. కాబట్టే అర్హత సాధించినా... ఒలింపిక్స్‌ బరిలోకంటే ముందు ఆర్థిక సవాళ్లతోనే జాదవ్‌ పట్టు పట్టాల్సి వచ్చింది.

విలేజ్‌లో విజేయుడు...
మహారాష్ట్రలోని అప్పటి కొల్హాపూర్‌ సంస్థానంలోని గోలేశ్వర్‌ అనే మారుమూల పల్లెకు చెందిన ఖాషాబా మల్లయుద్ధంలో సింహబలుడు. బాల్యంలోనే ప్రత్యర్థుల్ని ‘మట్టి’కరిపించే క్రీడలో తెగ కుస్తీ పట్టేవాడు. ఇలా ఊరు–వాడా గెలిచాక ఓ రోజు జాతీయ చాంపియన్‌నే ఓడించడంతో విశ్వక్రీడలకు అర్హత పొందాడు. 1948లో బెంగాల్‌కు చెందిన జాతీయ ఫ్లయ్‌ వెయిట్‌ చాంపియన్‌ నిరంజన్‌ దాస్‌ను కంగుతినిపించి అదే ఏడాది లండన్‌ ఒలింపిక్స్‌కు సై అన్నాడు. కానీ అణాలతో, నాణేలతో గడిచే ఆ రోజుల్లో రూపాయలు, వేలు వెచ్చించి వెళ్లేదెట్లా? కొల్హాపూర్‌ సంస్థానాధీశుడు దయతలచడంతో జాదవ్‌ లండన్‌ పయనమయ్యాడు. పాల్గొన్న తొలి విశ్వక్రీడల్లో ఆరో స్థానంతో ఖాషాబా టాప్‌–10లో నిలిచాడు.

మరో నాలుగేళ్లకు హెల్సింకి (1952) ఒలింపిక్స్‌కు అర్హత సాధించినా... మళ్లీ కాసుల కష్టాలు ‘హాయ్‌’, హలో అని పల కరించాయి. విరాళాలతో, తెలిసిన వారి చేయూతతో కిట్‌ కొనుక్కునే పైసలే పోగయ్యాయి. మరి పయనానికి డబ్బులెక్కడ్నించి తేవాలి. జాదవ్‌ ప్రతిభా, పాటవం తెలిసినా కాలేజీ ప్రిన్సిపాల్‌ ఆర్‌. ఖర్దీకర్‌ తన ఇంటిని తాకట్టు పెట్టి రూ. 7000 జాదవ్‌ చేతుల్లో పెడితే అతను... కాంస్య పతకం పట్టుకొచ్చాడు. నిజానికి ఆ మెగా ఈవెంట్‌లో అతనికి స్వర్ణం కాకపోయినా... రజతమైనా దక్కేది. కానీ వెంటవెంటనే బౌట్‌లోకి దిగాల్సి రావడం, ఇదేంటనీ దన్నుగా నిలిచి అడిగే భారత అధికారి ఎవరూ లేకపోవడంతో ఏకబికిన వరుసగా బౌట్లు ఆడేయడంతో అలసిసొలసి కాంస్యానికి పరిమితమయ్యాడు.

ఖాషాబా నెగ్గిన ఒలింపిక్‌ పతకం

రుణపడి... తలపడి... 
పతకం గెలిచాక ఖాషాబా కష్టాలు కొంత తీరాయి. కానీ లక్షల్లో నజరానాలొచ్చాయనుకుంటే పొరపాటే. ఇటు రాష్ట్రం నుంచీ, అటు కేంద్రం నుంచీ ప్రోత్సాహకంగా నజరానా కాదు కదా నయాపైసా రాలేదు. ఘనస్వాగతం కూడా లభించలేదు. కానీ ఊర్లో మాత్రం ఈ విజేయుడి పతక ఆగమనానికి 151 ఎడ్లబండ్లతో స్వాగతం పలకడం అప్పట్లో గొప్ప విశేషం. ఇక ఆ తర్వాత టోర్నీలు ఆడగా వచ్చిన డబ్బులు, బతుకుదెరువు కోసం చేసిన కొలువుతోనే తన ప్రిన్సిపాల్‌ ఇంటిపై ఉన్న రుణాన్ని జాదవ్‌ తీర్చేశాడు. తర్వాత మహారాష్ట్ర పోలీసు శాఖలో సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఏళ్లకు ఏళ్లు ఎదుగుబొదుగు (పదోన్నతి) లేని ఉద్యోగం చేశాడు. 1984లో 58 ఏళ్ల ప్రాయంలో ఆగస్టు 14న మోటర్‌ సైకిల్‌ ప్రమాదంలో ఖాషాబా జాదవ్‌ ప్రాణాలు కోల్పోయాడు.

జాతికి తెలియదు సరేకానీ...
ఈ జాతి రత్నం గురించి భారతీయులెవరికీ అంతగా తెలియకపోవడం వింతేమీ కాదు. కానీ తొలి వ్యక్తిగత పతకం అందించిన చాంపియన్‌ గురించి భారత ప్రభుత్వంగానీ, మహారాష్ట్ర ప్రభుత్వంగానీ పట్టించుకోకపోవడమే విడ్డూరం. అందుకేనే మో అతను బతికుండగా ఏ గుర్తింపూ దక్కలేదు. ఏ పురస్కారం అతని చేతికి అందలేదు. చివరకు చనిపోయాక కూడా అలసత్వమే చేశారు పాలకులు. జాదవ్‌ కన్నుమూసిన దశాబ్దం తర్వాత మహారాష్ట్ర ప్రభుత్వం 2004లో ‘శివ్‌ ఛత్రపతి’ అవార్డును అతని కుటుంబసభ్యులకు అందజేయగా... తీరిగ్గా కేంద్రం అర్జున అవార్డును (2000)లో ప్రదానం చేసింది. జాతి క్షోభించే తప్పును ఇప్పటికీ భారత ప్రభుత్వం సవరిం చుకోనేలేదు. అందుకే ఒలింపిక్‌ పతకం గెలిచినా... ‘పద్మశ్రీ’ వరించని ఏకైక భారత క్రీడాకారుడిగా ఇప్పటికీ మిగిలిపోయాడు.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా