ఖేల్ రత్న సానియా

29 Aug, 2015 23:34 IST|Sakshi
ఖేల్ రత్న సానియా

♦ రాష్ట్రపతి చేతుల మీదుగా పురస్కారం అందుకున్న టెన్నిస్ ప్లేయర్
♦ అర్జున అవార్డు స్వీకరించిన శ్రీకాంత్, అనూప్

 
 న్యూఢిల్లీ : భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా... అత్యున్నత క్రీడా పురస్కారం ‘రాజీవ్‌గాంధీ ఖేల్ రత్న’ అవార్డును అందుకుంది. శనివారం రాష్ట్రపతి భవన్‌లో జరిగిన అవార్డుల కార్యక్రమంలో రాష్ర్టపతి ప్రణబ్ ముఖర్జీ ఆమెకు ఈ పురస్కారాన్ని అందజేశారు. అవార్డు కింద పతకం, సర్టిఫికెట్‌తో పాటు ఏడున్నర లక్షల నగదును బహుకరించారు. మెరూన్ రంగు చీర, పైన బ్లేజర్ ధరించిన ఈ హైదరాబాదీ కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలవగా, అవార్డు స్వీకరించే సమయంలో దర్బాల్ హాల్‌లోని అతిథులు చప్పట్లతో ఘనంగా స్వాగతించారు. కేంద్ర క్రీడల మంత్రి శర్బానంద సోనోవాల్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

బ్యాడ్మింటన్ రైజింగ్ స్టార్ కిడాంబి శ్రీకాంత్‌తో పాటు రోలర్ స్కేటింగ్ ప్లేయర్ అనూప్ కుమార్ యామా ‘అర్జున’ అవార్డులను ప్రణబ్ చేతుల మీదుగా స్వీకరించారు. అవార్డు కింద జ్ఞాపిక, సర్టిఫికెట్, 5 లక్షల నగదును ఇచ్చారు. హైదరాబాద్‌కు చెందిన టెన్నిస్ మాజీ ప్లేయర్ శివ ప్రకాశ్ మిశ్రాకు ‘ద్రోణచార్య’, సాయిబాబా వ్యవస్థాపక కార్యదర్శిగా ఉన్న స్పోర్ట్స్ కోచింగ్ ఫౌండేషన్‌కు ‘రాష్ట్రీయ ఖేల్ ప్రోత్సాహ’ పురస్కారాలను అందజేశారు. అర్జున అవార్డుకు ఎంపికైన క్రికెటర్ రోహిత్, బాక్సర్ మన్‌దీప్ జాంగ్రా, రన్నర్ ఎం.ఆర్.పూవమ్మ ఈ కార్యక్రమానికి హాజరుకాలేదు.

 అర్జున గ్రహీతలు: శ్రీజేశ్ (హాకీ), దీపా కర్మాకర్ (జిమ్నాస్టిక్స్), జీతూ రాయ్ (షూటింగ్), సందీప్ కుమార్ (ఆర్చరీ), బబిత (రెజ్లింగ్), భజరంగ్ (రెజ్లింగ్), స్వరణ్ సింగ్ విర్క్ (రోయింగ్), సతీశ్ శివలింగం (వెయిట్‌లిఫ్టింగ్), సంతోయ్ దేవి (వుషు), శరత్ గైక్వాడ్ (పారా సెయిలింగ్), మంజీత్ చిల్లర్ (కబడ్డీ), అభిలాష మహత్రే (కబడ్డీ).

 ద్రోణాచార్య గ్రహీతలు: నావల్ సింగ్ (అథ్లెటిక్స్-పారా స్పోర్ట్స్), అనూప్ సింగ్ (రెజ్లింగ్), హర్భన్స్ సింగ్ (అథ్లెటిక్స్-లైఫ్‌టైమ్), స్వతంతర్ రాజ్‌సింగ్ (బాక్సింగ్-లైఫ్‌టైమ్), నీహర్ అమీన్ (స్విమ్మింగ్-లైఫ్‌టైమ్).

 ధ్యాన్‌చంద్ అవార్డు గ్రహీతలు: రోమియో జేమ్స్ (హాకీ), శివ ప్రకాశ్ మిశ్రా (టెన్నిస్), టీపీపీ నాయర్ (వాలీబాల్).

 కేసీఆర్ అభినందన
ఖేల్ రత్న స్వీకరించిన సానియాకు తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అభినందనలు తెలిపారు. భవిష్యత్‌లో మరిన్ని జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలు సాధించాలని ఆకాంక్షించారు.
 
 దేశం కోసం ఆడుతున్నప్పుడు ప్రభుత్వం గుర్తిస్తే గర్వంగా ఉంటుంది. ఈ అవార్డు కోసం నా పేరు ప్రతిపాదించిన క్రీడాశాఖకు కృతజ్ఞతలు. నేను మరింత బాగా ఆడాలనే స్ఫూర్తిని ఈ అవార్డు అందిస్తుంది. ఈ ఏడాది ఎన్నో అద్భుతమైన ఘనతలు దక్కాయి. అవార్డు అందుకునేందుకు భారత్‌కు రావడానికి యూఎస్ ఓపెన్ నిర్వాహకులు సహకరించారు. నా మ్యాచ్‌లను వాయిదా వేశారు.     
- సానియా

మరిన్ని వార్తలు