కొడుకు కోసం.. కిక్‌ బాక్సింగ్‌ చాంపియనై..

7 Sep, 2019 10:36 IST|Sakshi

జాతీయస్థాయి స్వర్ణపతకం విజేత నాగప్రియ

అంతర్జాతీయ పోటీలకు అర్హత  

తన కుమారుడుని క్రీడల్లో ఉన్నతస్థితికి చేర్చాలనుకుంది. దాని కోసం తర్ఫీదు ఇప్పించాలని భావించింది. దగ్గరుండి మరీ శిక్షణకు తీసుకు వెళ్లేది. చివరికి ఆ క్రీడపై తానూ ఆసక్తి పెంచుకుంది. అంతే తనయుడితో పాటు తానూ శిక్షణ తీసుకుంది. అందులో రాణించి జాతీయస్థాయిలో ప్రతిభ చూపి స్వర్ణ పతకం సాధించింది. అంతేకాదు.. అంతర్జాతీయ పోటీలకు అర్హత సాధించింది. తనయుడి కోసం పీఈటీ కోర్సు పూర్తి చేసిన ఈమె కిక్‌ బాక్సింగ్‌లో కోచ్‌ కం రిఫరీ కావాలన్నది తన ఆశయమని చెబుతోంది.

రాజమహేంద్రవరం రూరల్‌: బోను అపర్ణ నాగప్రియ స్వస్థలం పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు. చిన్నతనంలో ఇంటర్‌ చదివే సమయంలో బాస్కెట్‌ బాల్, కబడీ ఆడేవారు. తండ్రి అనారోగ్యానికి గురికావడంతో ఇంటర్‌ తోనే చదువుకు ఫుల్‌స్టాప్‌ పెట్టి చిరుద్యోగాలు చేస్తూ కంప్యూటర్‌ నేర్చుకున్నారు. కొంతకాలం తరువాత పుప్పాల వినయ్‌కుమార్‌తో వివాహం జరిగింది. ఆ తరువాత కూడా ఖాళీగా ఉండడం ఇష్టం లేక హిందీ పండిట్‌ కోర్సు పూర్తిచేశారు నాగప్రియ. తన కుమారుడు పుప్పాల చేతన్‌చంద్‌షణ్ముఖ్‌నాయుడును మంచి క్రీడాకారుడిగా తీర్చిదిద్దాలని సంకల్పించిన ఆమె తాను పీఈటీ అయితే కుమారుడి భవితకు మెరుగులు దిద్దవచ్చని భావించారు. ఈ క్రమంలో నాగప్రియ గొల్లల మామిడాడ కళాశాలలో రెండేళ్ల పీఈటీ కోర్సు పూర్తి చేసి ఓ ప్రైవేటు పాఠశాలలో పీఈటీగా చేరి విధులు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో వేసవి సెలవుల్లో తన కుమారుడు చేతన్‌కు హ్యాండ్‌బాల్, స్కేటింగ్‌లో శిక్షణ ఇప్పించి, రెండేళ్ల క్రితం గ్రాండ్‌మాస్టర్‌ శామ్యూల్‌రాజ్, కోచ్‌లు పట్టపగలు సంతోష్, ఎం.గణేష్‌ల వద్ద కరాటే, బాక్సింగ్, కిక్‌బాక్సింగ్‌లో శిక్షణ ఇప్పించారు. చేతన్‌తో పాటు తాను బాక్సింగ్, కిక్‌బాక్సింగ్‌లో శిక్షణ పొందారు. గ్రాండ్‌మాస్టర్, కోచ్‌ల సహాకారంతో నాగప్రియ విశాఖపట్నంలో ఈ ఏడాది జూన్‌ 30న జరిగిన ఏపీ స్టేట్‌ కిక్‌బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్‌ పోటీల్లో స్వర్ణ పతకం సాధించి, హర్యానాలో ఈనెల 18, 19, 20, 21 తేదీల్లో వరల్డ్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ కిక్‌బాక్సింగ్‌ ఆర్గనైజేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన  జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని అక్కడ కూడా స్వర్ణ పతకం సాధించారు. అంతే కాకుండా మెక్సికోలో జరిగే ఇంటర్నేషనల్‌ కిక్‌ బాక్సింగ్‌ పోటీలకు అర్హత సాధించింది. కోచ్‌ కం రిఫరీ కావాలన్న ఆకాంక్షతో కిక్‌బాక్సింగ్‌లో థియరీ, ప్రాక్టికల్స్‌లో రాణించి బ్లాక్‌బెల్ట్‌ కైవసం చేసుకున్నారు.

కోచ్‌ కం రిఫరీకావాలన్నదే ఆకాంక్ష
కిక్‌ బాక్సింగ్‌ కోచ్‌ కం రిఫరీ కావాలన్నదే తన ముందున్న లక్ష్యం. నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ స్పోర్ట్స్‌ స్పెషలైజేషన్‌ చేసి కోచ్‌ కం రిఫరీ అవుతాను. తన కుమారుడిని చాంపియన్‌ చేయాలన్న ఆకాంక్షతో మొదలైన ప్రస్థానంలో భాగంగా తాను జాతీయస్థాయి కిక్‌బాక్సింగ్‌ పోటీల్లో పాల్గొని బంగారుపతకం సాధించడం ఆనందంగా ఉంది. తన కుమారుడు చేతన్‌ను జాతీయస్థాయి క్రీడాకారుడిగా తీర్చిదిద్దడమే తన లక్ష్యం.

– బోను అపర్ణ నాగప్రియ, బొమ్మూరు

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా