సింధు ముందుకు... శ్రీకాంత్‌ ఇంటికి

25 Jul, 2019 04:56 IST|Sakshi

జపాన్‌ ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీ

టోక్యో: ఈ సీజన్‌లో తన నిరాశాజనక ప్రదర్శన కొనసాగిస్తూ భారత బ్యాడ్మింటన్‌ స్టార్‌ ప్లేయర్, ప్రపంచ మాజీ నంబర్‌వన్‌ కిడాంబి శ్రీకాంత్‌ జపాన్‌ ఓపెన్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌–750 టోర్నమెంట్‌లో తొలి రౌండ్‌లోనే ఇంటిముఖం పట్టాడు. మహిళల సింగిల్స్‌లో పీవీ సింధు శుభారంభం చేసి ప్రిక్వార్టర్‌ ఫైనల్‌కు చేరింది.  బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్‌ తొలి రౌండ్‌ మ్యాచ్‌లో ప్రపంచ పదో ర్యాంకర్‌ శ్రీకాంత్‌ 21–13, 11–21, 20–22తో భారత్‌కే చెందిన ప్రపంచ 34వ ర్యాంకర్‌ హెచ్‌ఎస్‌ ప్రణయ్‌ చేతిలో ఓడిపోయాడు.

ఈ మ్యాచ్‌కు ముందు శ్రీకాంత్‌ చేతిలో వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో ఓడిన ప్రణయ్‌ ఈసారి మాత్రం సంచలన ప్రదర్శన చేసి తన సహచరుడికి షాక్‌ ఇచ్చాడు. 2011లో ఏకైకసారి శ్రీకాంత్‌ను ఓడించిన ప్రణయ్‌ ఎనిమిదేళ్ల తర్వాత మళ్లీ అతడిపై గెలుపొందడం విశేషం. మరో సింగిల్స్‌ తొలి రౌండ్‌ మ్యాచ్‌లో సమీర్‌ వర్మ (భారత్‌) 17–21, 12–21తో ఆంటోన్సన్‌ (డెన్మార్క్‌) చేతిలో ఓటమి చవిచూశాడు. మహిళల సింగిల్స్‌ తొలి రౌండ్‌లో ఐదో సీడ్‌ సింధు 21–9, 21–17తో హాన్‌ యుయె (చైనా)పై గెలిచింది. 37 నిమిషాల్లోనే ముగిసిన ఈ మ్యాచ్‌లో సింధుకు రెండో గేమ్‌లో కాస్త పోటీ ఎదురైంది. 

మిక్స్‌డ్‌ డబుల్స్‌ తొలి రౌండ్‌లో నేలకుర్తి సిక్కి రెడ్డి–ప్రణవ్‌ చోప్రా (భారత్‌) జంట 11–21, 14–21తో ప్రపంచ నంబర్‌వన్, టాప్‌ సీడ్‌ జోడీ జెంగ్‌ సి వె–హువాంగ్‌ యా కియోంగ్‌ (చైనా) చేతిలో ఓడింది. మహిళల డబుల్స్‌ తొలి రౌండ్‌లో సిక్కి రెడ్డి–అశ్విని పొన్నప్ప (భారత్‌) ద్వయం 16–21, 14–21తో కిమ్‌ సో యోంగ్‌–కాంగ్‌ హీ యోంగ్‌ (కొరియా) జంట చేతిలో పరాజయం పాలైంది. పురుషుల డబుల్స్‌ తొలి రౌండ్‌లో సాత్విక్‌ సాయిరాజ్‌–చిరాగ్‌ శెట్టి (భారత్‌) జోడీ 21–16, 21–17తో మార్కస్‌ ఇలిస్‌–క్రిస్‌ లాంగ్‌రిడ్జ్‌ (ఇంగ్లండ్‌) జంటపై గెలిచి ప్రిక్వార్టర్‌ ఫైనల్‌కు చేరింది. నేడు జరిగే సింగిల్స్‌ ప్రిక్వార్టర్‌ ఫైనల్స్‌లో అయా ఒహోరి (జపాన్‌)తో సింధు; కాంటా సునెయామ (జపాన్‌)తో సాయిప్రణీత్‌; రాస్‌ముస్‌ గెమ్కే (డెన్మార్క్‌)తో ప్రణయ్‌ తలపడతారు.  

మరిన్ని వార్తలు