చరిత్ర సృష్టించిన కిదాంబి శ్రీకాంత్‌

10 Apr, 2018 14:24 IST|Sakshi

తెలుగు తేజం.. బ్యాడ్మింటన్ ఆటగాడు కిదాంబి శ్రీకాంత్‌ చరిత్ర సృష్టించాడు. బ్యాడ్మింటన్‌లో భారత్‌ తరపున ప్రపంచ నంబర్‌ వన్‌ ర్యాంక్‌ను(పురుషుల విభాగంలో) కైవసం చేసుకోబోతున్నాడు. బ్యాడ్మింటన్‌ వరల్డ్‌ ఫెడరేషన్‌ ఈ గురువారం విడుదల చేయబోయే జాబితాలో 25 ఏళ్ల శ్రీకాంత్‌కు మొదటి ర్యాంక్‌ దక్కబోతోంది. 

మొత్తం 76, 895 పాయింట్లతో శ్రీకాంత్‌ మొదటి స్థానం కైవసం చేసుకోనున్నాడు. ప్రస్తుతం వరల్డ్‌ నంబర్ వన్‌ స్థానంలో ఉన్న విక్టర్‌ అక్సెల్సన్‌ ప్రస్తుతం 77,130 పాయింట్లతో ఉన్నాడు. అయితే గాయం కారణంగా కొంత కాలంగా ఆటకు దూరంగా ఉన్న విక్టర్‌.. తాజా ర్యాకింగ్స్‌లో 1,660 పాయింట్లు కోల్పోబోతున్నాడు. దీంతో శ్రీకాంత్‌ నంబర్‌ వన్‌ ర్యాంక్‌ ఖరారైపోయింది. 

నిజానికి గతేడాదే శ్రీకాంత్‌ ఈ రికార్డును దక్కించుకోవాల్సింది. కానీ, గాయం కారణంతో ఆ అవకాశాన్ని పోగొట్టుకున్నాడు. కాగా, భారత్‌ తరపున బ్యాడ్మింటన్‌లో సైనా నెహ్వాల్‌(2015లో) నంబర్ వన్‌ ర్యాంక్‌(మహిళ విభాగంలో)ను దక్కించుకుంది.   ఇదిలా ఉంటే ప్రస్తుతం జరుగుతున్న కామన్‌ వెల్త్‌ క్రీడల్లో మిక్స్‌డ్‌ టీమ్‌ బ్యాడ్మింటన్‌ విభాగంలో భారత్‌కు స్వర్ణం దక్కగా.. ఆ టీమ్‌లో కిదాంబి, సైనా కూడా ఉన్నారు.

మరిన్ని వార్తలు