శ్రీకాంత్‌ నంబర్‌ వన్‌ 

13 Apr, 2018 01:23 IST|Sakshi

బీడబ్ల్యూఎఫ్‌ అధికారిక ప్రకటన

న్యూఢిల్లీ: భారత స్టార్‌ కిడాంబి శ్రీకాంత్‌ ప్రపంచ బ్యాడ్మింటన్‌ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్‌) ర్యాంకుల్లో నంబర్‌వన్‌గా నిలిచాడు. రెండురోజుల క్రితమే అతడికి అగ్రస్థానం ఖరారు కాగా, గురువారం సమాఖ్య విడుదల చేసిన జాబితాతో అధికారికంగా ప్రకటించినట్లైంది. శ్రీకాంత్‌ ప్రస్తుతం 76,895 పాయింట్లతో టాప్‌ ర్యాంక్‌లో ఉన్నాడు. తాజా ర్యాంక్‌తో కంప్యూటరైజ్డ్‌ పద్ధతి ప్రవేశపెట్టిన తర్వాత పురుషుల సింగిల్స్‌లో నంబర్‌వన్‌ అయిన తొలి భారతీయ ప్లేయర్‌గా అతను గుర్తింపు పొందాడు. 2015 లో మహిళల సింగిల్స్‌లో సైనా నెహ్వాల్‌ టాప్‌ ర్యాంక్‌లో నిలిచింది.

వైఎస్‌ జగన్‌ అభినందన 
టాప్‌ ర్యాంక్‌కు చేరుకున్న శ్రీకాంత్‌కు ఆంధ్రప్రదేశ్‌ ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి అభినందనలు తెలిపారు. శ్రీకాంత్‌ ఘనత పట్ల తెలుగువారందరూ ఎంతో గర్వపడుతున్నారని మెచ్చుకున్నారు. అతను ఇలాంటి మరె న్నో విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.

నంబర్‌వన్‌ కావడం గౌరవంగా, భారతీయులకు స్ఫూర్తిగా నిలుస్తుందని భావిస్తున్నా. ఈ ఘనత గోపి సర్, ఇతర కోచ్‌లు, కుటుంబ సభ్యులు, సహాయక బృందం ఇలా అందరి శ్రమకు ప్రతిఫలం. ప్రస్తుతానికి  దృష్టంతా కామన్వెల్త్, ఆసియా క్రీడలు సహా పెద్ద టోర్నీల్లో నెగ్గడమే. నాపై నమ్మకం ఉంచిన అందరికీ ధన్యవాదాలు.
– శ్రీకాంత్‌  

మరిన్ని వార్తలు