పొలార్డ్‌కు జరిమానా

6 Aug, 2019 14:01 IST|Sakshi
పొలార్డ్‌

లాడర్‌హిల్‌(అమెరికా) : వెస్టిండీస్‌ ఆల్‌రౌండర్‌ కీరన్‌ పొలార్డ్‌పై ఐసీసీ జరిమానా విధించింది. భారత్‌తో జరిగిన రెండో టీ20లో అంపైర్‌ సూచనలను పొలార్డ్‌ అతిక్రమించాడనే అభియోగాలపై ఐసీసీ చర్యలు తీసుకుంది. విచారణలో పొలార్డ్‌ తప్పు తేలడంతో 20 శాతం మ్యాచ్‌ ఫీజు కోతతో పాటు ఓ డీమెరిట్‌పాయింట్‌ను విధించింది. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో పొలార్డ్‌ సబ్‌స్టిట్యూట్‌ విషయంలో నిబంధనలను అతిక్రమించాడు. ఓవర్‌ పూర్తయ్యేవరకు ఆగమని అంపైర్లు చెప్పినా వినకుండా పదేపదే సబ్‌స్టిట్యూట్‌ ఆటగాడిని మైదానంలోకి రావాలని పిలిచాడు. ఇది ఐసీసీ ఆర్టికల్‌ 2.4 నియమావళికి విరుద్దం కావడంతో పొలార్డ్‌ ఖాతాలో ఒక డీమెరిట్‌ పాయింట్‌తో పాటు మ్యాచ్‌ ఫీజులో కోత విధించారు.

24 నెలల కాలంలో ఒక ఆటగాడు ఖాతాలో నాలుగు అంతకంటే ఎక్కువ డిమెరిట్‌ పాయింట్లు చేరితే అతనిపై సస్పెన్షన్‌ వేటు తీవ్రంగా ఉంటుంది. సదరు ఆటగాడిని నిషేధించే అధికారం ఐసీసీకి ఉంది. రెండు డిమెరిట్‌ పాయింట్లు చేరితే మాత్రం ఒక టెస్టు కానీ రెండు వన్డేలు కానీ, రెండు టీ20లు కానీ నిషేధం విధిస్తారు. రెండో టీ20లో డక్‌వర్త్‌ లూయిస్‌ ప్రకారం 22 పరుగుల తేడాతో విజయం సాధించిన భారత్‌ ఒక మ్యాచ్‌ మిగిలి ఉండగానే 2-0తో సిరీస్‌ కైవసం చేసుకుంది.

మరిన్ని వార్తలు