రాహుల్‌, గేల్‌ మెరుపులు

10 Apr, 2019 22:04 IST|Sakshi

ముంబై: ఐపీఎల్‌లో భాగంగా ఇక్కడ ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కింగ్స్‌ పంజాబ్‌ 198 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించింది. కేఎల్‌ రాహుల్‌ సెంచరీకి జతగా, గేల్‌ హాఫ్‌ సెంచరీ సాధించడంతో కింగ్స్‌ పంజాబ్‌ భారీ స్కోరు సాధించింది. టాస్‌ ఓడి ముందుగా తీసుకున్న కింగ్స్‌ పంజాబ్‌కు శుభారంభం లభించింది. క్రిస్‌ గేల్‌-కేఎల్‌ రాహుల్‌లు మెరుపులు మెరిపించి తొలి వికెట్‌కు 116 పరుగులు జోడించారు. ఒకవైపు గేల్‌ ఆకాశమే హద్దుగా చెలరేగి పోతే, రాహుల్‌ కుదురుగా బ్యాటింగ్‌ చేశాడు. గేల్‌ సిక్సర్ల వర్షం కురిపించాడు. బౌలర్‌ ఎవరన్నది చూడకుండా విరుచుకుపడ్డాడు. అయితే గేల్‌(63; 36 బంతుల్లో 3 ఫోర్లు, 7 సిక్సర్లు) ఔటైన తర్వాత పంజాబ్‌ కాస్త తడబడినట్లు కనిపించింది.

డేవిడ్‌ మిల్లర్‌(7), కరుణ్‌ నాయర్‌(5), కరన్‌(8)లు స్వల్ప వ్యవధిలో పెవిలియన్‌ చేరారు. అయినప్పటికీ రాహుల్‌ మాత్రం కడవరకూ క్రీజ్‌లో ఉండి జట్టుకు భారీ స్కోరు అందించాడు. ప్రధానంగా ఆఖరి ఓవర్లలో రాహుల్‌ రెచ్చిపోయి ఆడాడు. హర్దిక్‌ వేసిన 19 ఓవర్‌లో మూడు సిక్సర్లు, ఫోర్‌ కొట్టి తన పవర్‌ గేమ్‌ను చూపించాడు. ఓవరాల్‌గా 64 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్సర్లతో సెంచరీ సాధించి అజేయంగా నిలిచాడు. దాంతో కింగ్స్‌ పంజాబ్‌ నిర్ణీత ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 197 పరుగులు చేసింది. ముంబై బౌలర్లలో హార్దిక్‌కు రెండు వికెట్లు లభించగా,బెహ్రాన్‌డార్ఫ్‌, బుమ్రాలకు తలో వికెట్‌ దక్కింది.


 

మరిన్ని వార్తలు