ఆమ్లా అదుర్స్.. లయన్స్ లక్ష్యం 189

23 Apr, 2017 17:41 IST|Sakshi
ఆమ్లా అదుర్స్.. లయన్స్ లక్ష్యం 189

►రాణించిన మాక్స్ వెల్, అక్షర్ పటేల్

రాజ్ కోట్: గుజరాత్ లయన్స్, కింగ్స్ పంజాబ్ లమధ్య జరుగుతున్న మ్యాచ్ లో పంజాబ్ ఓపెనర్ హాషీమ్ ఆమ్లా మరో సారి రెచ్చి పోయాడు.  ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ లో సెంచరీ సాధించిన ఆమ్లా తాజా మ్యాచ్ లో 2 సిక్సర్లు, 9 ఫోర్లతో 65 పరుగులు చేశాడు. దీంతో ఆమ్లా  299 పరుగులతో అగ్రస్ధానంలో నిలిచి ఆరేంజ్ క్యాప్ సొంతం చేసుకున్నాడు.

ఆమ్లా దూకుడుకు, మాక్స్ వెల్ తొడవ్వడంతో పంజాబ్ నిర్ణిత 20 ఓవర్లకు 7 వికెట్లు కోల్పోయి 189పరుగుల లక్ష్యాన్ని నిర్ధేశించింది.  టాస్ గెలిచిన గుజరాత్ లయన్స్ ఫీల్డింగ్ ఎంచుకుంది. పంజాబ్ కు ఆదిలోనే ఓపెనర్ మనన్ ఓహ్ర (2) వికెట్ కోల్పోయింది. ఆతర్వాత క్రీజులోకి వచ్చిన ఎస్ మార్ష్ తో మరో ఓపెనర్ ఆమ్లా దూకుడుగా ఆడాడు. వీరి దూకుడుకు పంజాబ్ పవర్ ప్లే ముగిసే సరికి ఒక వికెట్ కోల్పోయి 50 పరుగులు చేసింది. ఈ దశలో ఆమ్లా 30 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 70 పరుగుల భాగస్వామ్యం అందించిన ఈ జంటను ఆండ్రూ తై విడదీశాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన పంజాబ్ కెప్టెన్ మాక్స్ వెల్, ఆమ్లా తో స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. 14 ఓవర్లకే 128 పరుగులతో పటిష్ట స్థితిలో ఉన్న పంజాబ్ ఆమ్లా, మాక్స్ వెల్ వికెట్లు వరుసగా కోల్పోయింది. ఆమ్లాను అగర్వాల్ అవుట్ చేయగా, మాక్స్ వెల్ ను జడేజా పెవిలియన్ కు చేర్చాడు.

దీంతో పంజాబ్ 132 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది. తర్వాత బ్యాటింగ్ కు వచ్చిన అక్సర్ పటేల్, స్టోయినిస్ ఇన్నింగ్స్ ను చక్కదిద్దాలని ప్రయత్నించినా తై మరో సారి స్టోయినిస్ ను పెవిలియన్ కు పంపాడు. డెన్ స్మిత్ వేసిన 19 ఓవర్లో అక్సర్ పటేల్  వరుస బంతుల్లో  రెండు సిక్సర్లు, ఒక ఫోర్ బాది నాలుగో బంతికి భారీ షాట్ కు ప్రయత్నించి అవుటయ్యాడు. చివరి 2 ఓవర్లో 30 పరుగులు రావడంతో పంజాబ్ 188 పరుగులు చేయగలిగింది. గుజరాత్ బౌలర్లలో ఆండ్రూ తైకి 2 వికెట్లు పడగా, ఎన్.బి సింగ్, జడేజా, స్మిత్, అగర్వాల్ లకు ఒక్కో వికెట్ దక్కింది. ఈ మ్యాచ్ తో గుజరాత్ వికెట్ కీపర్ దినేష్ కార్తీక్ ఓ అరుదైన ఘనత సొంతం చేసుకున్నాడు. ఐపీఎల్ లో 100 మందిని అవుట్ చేసిన తొలి వికెట్ కీపర్ గా రికార్డు నమోదు చేశాడు.

మరిన్ని వార్తలు