రాజసం బొక్కబోర్లా

26 Mar, 2019 01:02 IST|Sakshi

గెలిచే మ్యాచ్‌ను చేజార్చుకున్న  రాజస్తాన్‌ రాయల్స్‌

14 పరుగులతో పంజాబ్‌ విజయం

చెలరేగిన క్రిస్‌ గేల్‌ 

బట్లర్‌ ఇన్నింగ్స్‌ వృథా   

పంజాబ్‌తో మ్యాచ్‌లో రాజస్తాన్‌ విజయ లక్ష్యం 185 పరుగులు... బట్లర్‌ మెరుపు  బ్యాటింగ్‌తో ఒక దశలో స్కోరు 108/1... సాఫీగా సాగిపోతున్న ఇన్నింగ్స్‌లో రాయల్స్‌కు  కుదుపు... వివాదాస్పద రీతిలో బట్లర్‌ను అశ్విన్‌ ‘మన్కడింగ్‌’ ద్వారా ఔట్‌ చేయడంతో జట్టు లయ దెబ్బ తింది. ఆ తర్వాత రహానే బృందం కోలుకోలేకపోయింది. 21 బంతుల్లో 37 పరుగులు చేయాల్సిన స్థితిలో టీమ్‌ కుప్పకూలింది. 16 పరుగుల వ్యవధిలో 7 వికెట్లు కోల్పోయి రాయల్స్‌ ఓటమి పాలైంది. అంతకుముందు క్రిస్‌ గేల్‌ మెరుపు బ్యాటింగ్‌కు తోడు సర్ఫరాజ్‌ కూడా చెలరేగడంతో పంజాబ్‌ చెప్పుకోదగ్గ స్కోరు సాధించగలిగింది.   

జైపూర్‌: సొంతగడ్డపై తొలి మ్యాచ్‌ను రాజస్తాన్‌ రాయల్స్‌ ఓటమితో ప్రారంభించింది. సోమవారం ఇక్కడ జరిగిన పోరులో కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ 14 పరుగుల తేడాతో రాజస్తాన్‌ను ఓడించింది. టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది. క్రిస్‌ గేల్‌ (47 బంతుల్లో 79; 8 ఫోర్లు, 4 సిక్సర్లు) అర్ధ సెంచరీ సాధించగా... సర్ఫరాజ్‌ ఖాన్‌ (29 బంతుల్లో 46 నాటౌట్‌; 6 ఫోర్లు, 1 సిక్స్‌) రాణించాడు. అనంతరం రాజస్తాన్‌ 20 ఓవర్లలో 9 వికెట్లకు 170 పరుగులే చేయగలిగింది. జోస్‌ బట్లర్‌ (43 బంతుల్లో 69; 10 ఫోర్లు, 2 సిక్సర్లు) దూకుడుగా ఆడగా... సంజు శామ్సన్‌ (25 బంతుల్లో 30; 1 సిక్స్‌) మినహా మిగతావారంతా విఫలమయ్యారు.  

గేల్‌ దూకుడు... 
విధ్వంసక ఆటగాడు క్రిస్‌ గేల్‌ మరో ఐపీఎల్‌ సీజన్‌ను దూకుడుగా ప్రారంభించాడు. ఆరంభంలో నిలదొక్కుకునేందుకు కొంత సమయం తీసుకున్నా... ఆ తర్వాత అతను దూసుకుపోయాడు. తాను ఎదుర్కొన్న తొలి 27 బంతుల్లో 29 పరుగులు చేసిన గేల్‌... తర్వాతి 20 బంతుల్లో  50 పరుగులు చేయడం విశేషం. ముఖ్యంగా ఉనాద్కట్‌ ఓవర్లో చెలరేగిపోయిన గేల్‌ వరుస బంతుల్లో 4, 4, 4, 6 బాదాడు. స్టోక్స్‌ ఓవర్లో కూడా సిక్స్, 2 ఫోర్లు కొట్టిన అనంతరం అదే ఓవర్లో మరో భారీ షాట్‌కు ప్రయత్నించి డీప్‌ మిడ్‌ వికెట్‌లో క్యాచ్‌ ఇచ్చాడు. ఈ క్రమంలో తక్కువ ఇన్నింగ్స్‌ (112)లలో ఐపీఎల్‌లో 4 వేల పరుగులు పూర్తి చేసుకున్న ఆటగాడిగా గేల్‌ నిలిచాడు. మరోవైపు లోకేశ్‌ రాహుల్‌ (4) తొలి ఓవర్లోనే ఔట్‌ కాగా... కొన్ని చక్కటి షాట్లు ఆడిన మయాంక్‌ అగర్వాల్‌ (24 బంతుల్లో 22; 1 ఫోర్, 2 సిక్సర్లు) బౌండరీ వద్ద ధావల్‌ చక్కటి క్యాచ్‌కు వెనుదిరిగాడు.  

ఆకట్టుకున్న సర్ఫరాజ్‌... 
2018 ఐపీఎల్‌లో బెంగళూరు తరఫున ఆడిన సర్ఫరాజ్‌ 6 ఇన్నింగ్స్‌లలో కలిపి 51 పరుగులే చేశాడు. ఆ తర్వాత అతను ఏడాది కాలంగా ఒక్క మ్యాచ్‌ కూడా ఆడలేదు. అదృష్టవశాత్తూ వేలంలో పంజాబ్‌ సొంతం చేసుకోగా... తొలి మ్యాచ్‌లో చూడచక్కటి బౌండరీలు కొట్టాడు. స్టోక్స్‌ వేసిన ఓవర్లో స్కూప్‌ షాట్‌తో సర్ఫరాజ్‌ కొట్టిన ఫోర్‌ హైలైట్‌గా నిలవగా, ఆఖరి బంతికి సిక్సర్‌ కూడా బాదాడు.  

పాపం ఉనాద్కట్‌... 
వరుసగా రెండో ఏడాది వేలంలో భారీ మొత్తానికి (రూ.8.4 కోట్లు) రాజస్తాన్‌ సొంతం చేసుకున్న పేసర్‌ జైదేవ్‌ ఉనాద్కట్‌ లీగ్‌ను పేలవంగా ఆరంభించాడు. ఏ మాత్రం నియంత్రణ లేని బౌలింగ్‌తో తన మూడు ఓవర్లలో 13, 19, 12 చొప్పున పరుగులు సమర్పించుకున్నాడు. ఇందులో 6 ఫోర్లు, 2 సిక్సర్లు ఉన్నాయి. 

ఆర్చర్‌ సూపర్‌... 
రాయల్స్‌ మరో బౌలర్‌ జోఫ్రా ఆర్చర్‌ వల్లే పంజాబ్‌ స్కోరుకు కొంత కళ్లెం పడింది. వైవిధ్యభరిత బంతులతో అతను బ్యాట్స్‌మెన్‌ను కట్టి పడేశాడు. ఆర్చర్‌ తన నాలుగు ఓవర్లలో 1, 1, 10, 5 చొప్పున మాత్రమే పరుగులిచ్చాడు. అతని బౌలింగ్‌లో వచ్చిన ఒకే ఒక సిక్సర్‌ను గేల్‌ కొట్టాడు.  

బట్లర్‌ బాదుడు... 
గత ఏడాది ఐపీఎల్‌లో రాజస్తాన్‌ తరఫున ఓపెనింగ్‌కు దిగిన తర్వాత ఆరు ఇన్నింగ్స్‌లలో ఐదు అర్ధ సెంచరీలు చేసిన బట్లర్‌ కొత్త సీజన్‌లో మళ్లీ తన ప్రతాపం చూపించాడు. షమీ ఓవర్లో రెండు ఫోర్లతో జోరు మొదలు పెట్టిన అతను, ముజీబ్‌ వేసిన తర్వాతి ఓవర్లో 4, 6 కొట్టాడు. ఇంగ్లండ్‌ సహచరుడు కరన్‌ ఓవర్లో అతను 3 ఫోర్లు, భారీ సిక్సర్‌తో పండగ చేసుకున్నాడు. 29 బంతుల్లోనే అతని అర్ధ సెంచరీ పూర్తయింది. తొలి వికెట్‌కు 49 బంతుల్లోనే 78 పరుగులు జోడించిన అనంతరం రహానే (20 బంతుల్లో 27; 4 ఫోర్లు) బౌల్డ్‌ కాగా... కొద్ది సేపటికి బట్లర్‌ రనౌట్‌గా వెనుదిరిగాడు. ఐపీఎల్‌లో పునరాగమనం తర్వాత ఆడిన తొలి మ్యాచ్‌లో స్టీవ్‌ స్మిత్‌ (20) ఆకట్టుకోకపోగా...చివరి వరుస బ్యాట్స్‌మెన్‌ వైఫల్యంతో రాజస్తాన్‌కు ఓటమి తప్పలేదు.  

స్యామ్‌ కరన్‌పై దాడి... 
సొంతగడ్డపై టెస్టు సిరీస్‌లో భారత్‌ను తీవ్రంగా ఇబ్బంది పెట్టిన స్యామ్‌ కరన్‌కు తొలి ఐపీఎల్‌ మ్యాచ్‌లో శుభారంభం లభించలేదు. అతను వేసిన ఇన్నింగ్స్‌ మొదటి ఓవర్లో రాయల్స్‌ కెప్టెన్‌ అజింక్య రహానే మూడు ఫోర్లు కొట్టాడు. తన తర్వాతి రెండు ఓవర్లలో కలిపి 36 పరుగులు సమర్పించుకున్నాడు. అయితే తన చివరి ఓవర్లో 4 పరుగులే ఇచ్చిన అతను, 2 కీలక వికెట్లు తీసి పంజాబ్‌కు గెలుపు అవకాశం సృష్టించాడు.  

మరిన్ని వార్తలు