అక్షర్ అదరహో

1 May, 2016 23:26 IST|Sakshi
అక్షర్ అదరహో

‘హ్యాట్రిక్’తో మలుపు తిప్పిన స్పిన్నర్
పంజాబ్ అనూహ్య విజయం
23 పరుగులతో ఓడిన గుజరాత్


లయన్స్ విజయ లక్ష్యం 155 పరుగులు... భారీ హిట్టర్లతో పాటు మంచి ఫామ్‌లో, పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న ఆ జట్టుకు సొంతగడ్డపై దీనిని ఛేదించడం అంత కష్టమైన పనేం కాదు. అవతలివైపు ఉన్నదేమో వరుస పరాజయాలతో కునారిల్లి అట్టడుగున నిలిచిన పంజాబ్ జట్టు. కానీ అంచనాలు తారుమారయ్యాయి. స్పిన్నర్ అక్షర్ పటేల్ అద్భుత బౌలింగ్‌తో సునాయాసం అనుకున్న లక్ష్యం కాస్తా పెద్దదిగా మారి గుజరాత్‌కు షాక్ తగిలింది. రెండు ‘సింహా’ల పోరులో చివరకు కింగ్స్ ఎలెవన్‌దే పైచేయి అయింది.
 
 
తన రెండో ఓవర్లో నాలుగు బంతుల వ్యవధిలో
మూడు వికెట్లు తీసిన లెఫ్టార్మ్ స్పిన్నర్ అక్షర్ పటేల్, తర్వాతి ఓవర్ తొలి బంతితో హ్యాట్రిక్ పూర్తి చేశాడు. ఫలితంగా మూడు వరుస పరాజయాల తర్వాత కింగ్స్ ఎలెవన్‌కు గెలుపుతో ఊరట లభించింది. కెప్టెన్‌గా తొలి మ్యాచ్‌లో ఆకట్టుకున్న మురళీ విజయ్ కూడా అర్ధ సెంచరీతో విజయంలో కీలకపాత్ర పోషించాడు.
 
రాజ్‌కోట్: వరుస విజయాలతో దూసుకుపోతున్న గుజరాత్ లయన్స్ జట్టుకు బ్రేక్ పడింది. మూడు మ్యాచ్‌ల తర్వాత ఆ జట్టుకు ఓటమి ఎదురైంది. పేలవ ప్రదర్శనతో సీజన్‌లో ఆకట్టుకోలేకపోతున్న కింగ్స్ ఎలెవన్ పంజాబ్ అనూహ్యంగా చెలరేగి లయన్స్‌కు అడ్డుకట్ట వేసింది. ఆదివారం ఇక్కడ జరిగిన లీగ్ మ్యాచ్‌లో పంజాబ్ 23 పరుగుల తేడాతో లయన్స్‌పై విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ 19.5 ఓవర్లలో 154 పరుగులకు ఆలౌటైంది. మురళీ విజయ్ (41 బంతుల్లో 55; 6 ఫోర్లు) రాణించగా, వృద్ధిమాన్ సాహా (19 బంతుల్లో 33; 4 ఫోర్లు), మిల్లర్ (27 బంతుల్లో 31; 2 ఫోర్లు) ఫర్వాలేదనిపించారు. శివిల్ కౌశిక్‌కు 3 వికెట్లు దక్కాయి. అనంతరం గుజరాత్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 131 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఫాల్క్‌నర్ (27 బంతుల్లో 32; 3 ఫోర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అక్షర్ పటేల్ (4/21) సీజన్‌లో తొలి హ్యాట్రిక్ నమోదు చేయడం విశేషం. మోహిత్ 3 వికెట్లు పడగొట్టాడు.

నాయకుడు నడిపించగా...
కెప్టెన్‌గా తొలి మ్యాచ్ ఆడుతున్న మురళీ విజయ్, ప్రవీణ్ కుమార్ వేసిన మూడో ఓవర్లో మూడు ఫోర్లు బాది దూకుడుగా ఇన్నింగ్స్‌ను మొదలు పెట్టాడు. మరోవైపు స్టొయినిస్ (17 బంతుల్లో 27; 3 ఫోర్లు, 1 సిక్స్) కూడా ధాటిగా ఆడటంతో ఈ జోడి తొలి వికెట్‌కు 40 బంతుల్లోనే 65 పరుగులు జోడించింది. అయితే ఆ తర్వాత ఎనిమిది పరుగుల వ్యవధిలో పంజాబ్ 4 వికెట్లు కోల్పోయింది. స్టొయినిస్‌ను జడేజా అవుట్ చేయగా, కౌశిక్ తన తొలి ఓవర్లోనే వరుస బంతుల్లో షాన్ మార్ష్ (1), మ్యాక్స్‌వెల్ (0)లను పెవిలియన్ పంపించాడు. ఆ వెంటనే గుర్‌కీరత్ (0) రనౌటయ్యాడు.

మరోవైపు 36 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న విజయ్, కౌశిక్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి బ్రేవో చేతికి చిక్కాడు. ఈ దశలో మిల్లర్, సాహా భాగస్వామ్యం పంజాబ్‌కు మెరుగైన స్కోరు అందించింది. వీరిద్దరు ఆరో వికెట్‌కు 25 బంతుల్లో 39 పరుగులు జత చేశారు. మిల్లర్‌ను ధవల్ అవుట్ చేయగా... 19, 20 ఓవర్లలో పంజాబ్ రెండేసి వికెట్లను కోల్పోయింది. చివరి మూడు ఓవర్లలో గుజరాత్ ఒక్క ఫోర్ మాత్రమే ఇచ్చి ఐదు వికెట్లు తీసింది.  


అంతా కలిసికట్టుగా...
తన తొలి ఓవర్లోనే మెకల్లమ్ (1)ను బౌల్డ్ చేసి మోహిత్ పంజాబ్‌కు శుభారంభం అందించాడు. ఆ తర్వాత కొద్దిసేపటికే రైనా (15 బంతుల్లో 18; 2 ఫోర్లు, 1 సిక్స్)ను కూడా చక్కటి బంతితో మోహిత్ పెవిలియన్ పంపించాడు. పవర్‌ప్లేలో గుజరాత్ 36 పరుగులు మాత్రమే చేయగలిగింది. అయితే అసలు మ్యాజిక్ ఏడో ఓవర్లో ప్రారంభమైంది. ఓవర్ మూడో బంతికి డ్వేన్ స్మిత్ (15)ను అవుట్ చేసిన అక్షర్... ఐదు, ఆరు బంతులకు కార్తీక్ (2), బ్రేవో (0)లను పెవిలియన్ పంపించాడు. మరో మూడు ఓవర్ల తర్వాత మళ్లీ బౌలింగ్‌కు దిగిన అక్షర్ తొలి బంతికే జడేజా (11)ను ‘హ్యాట్రిక్’ వికెట్‌గా అవుట్ చేశాడు. తాను వేసిన ఐదు బంతుల వ్యవధిలో పటేల్ నాలుగు వికెట్లు తీయడం విశేషం. 57 పరుగుల వద్ద ఆరో వికెట్ కోల్పోయిన గుజరాత్ ఆ తర్వాత కోలుకోలేదు. చివర్లో ఫాల్క్‌నర్, ఇషాన్ కిషన్ (24 బంతుల్లో 27; 3 ఫోర్లు) పోరాడినా లక్ష్యానికి లయన్స్ చాలా దూరంలో నిలిచిపోయింది.


స్కోరు వివరాలు
కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఇన్నింగ్స్: విజయ్ (సి) బ్రేవో (బి) కౌశిక్ 55; స్టొయినిస్ (స్టంప్డ్) కార్తీక్ (బి) జడేజా 27; షాన్ మార్ష్ (సి) రైనా (బి) కౌశిక్ 1; మ్యాక్స్‌వెల్ (సి) కార్తీక్ (బి) కౌశిక్ 0; గుర్‌కీరత్ సింగ్ (రనౌట్) 0; మిల్లర్ (సి) డ్వేన్ స్మిత్ (బి) ధావల్ 31; సాహా (బి) బ్రేవో 33; అక్షర్ (సి) కిషన్ (బి) బ్రేవో 0; మోహిత్ (బి) ప్రవీణ్ కుమార్ 1; కరియప్ప (బి) ప్రవీణ్ కుమార్  1; సందీప్ శర్మ (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (19.5 ఓవర్లలో ఆలౌట్) 154.

వికెట్ల పతనం: 1-65; 2-70; 3-70; 4-73; 5-100; 6-139; 7-145; 8-151; 9-153; 10-154.
బౌలింగ్: ప్రవీణ్ కుమార్ 2.5-0-25-2; ధవల్ 4-0-28-1; జడేజా 3-0-28-1; కౌశిక్ 4-0-20-3; బ్రేవో 4-0-33-2; ఫాల్క్‌నర్ 2-0-19-0.

గుజరాత్ లయన్స్ ఇన్నింగ్స్: డ్వేన్ స్మిత్ (సి) గుర్‌కీరత్ (బి) అక్షర్ 15; మెకల్లమ్ (బి) మోహిత్ 1; రైనా (బి) మోహిత్ 18; కార్తీక్ (బి) అక్షర్ 2; జడేజా (సి) సాహా (బి) అక్షర్ 11; బ్రేవో (బి) అక్షర్ 0; కిషన్ (రనౌట్) 27; ఫాల్క్‌నర్ (సి) మిల్లర్ (బి) సందీప్ 32; ప్రవీణ్ కుమార్ (సి) కరియప్ప (బి) మోహిత్ 15; ధవల్ (నాటౌట్) 6; కౌశిక్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 131.

వికెట్ల పతనం: 1-13; 2-34; 3-38; 4-39; 5-39; 6-57; 7-86; 8-125; 9-125.
బౌలింగ్: సందీప్ శర్మ 4-0-31-1; మోహిత్ 4-0-32-3; స్టొయినిస్ 4-0-23-0; అక్షర్ 4-0-21-4; కరియప్ప 3-0-15-0; గుర్‌కీరత్ 1-0-8-0.

మరిన్ని వార్తలు