ఫైనల్లో సీఎస్‌కేతో ఢీకొట్టేదెవరో?

25 May, 2018 18:41 IST|Sakshi

కోల్‌కతా: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)-11 సీజన్‌లో రెండో ఫైనల్‌ బెర్త్‌ ఎవరిదో తేల్చుకునేందుకు సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌-కోల్‌కతా నైట్‌రైడర్స్‌ జట్లు క్వాలిఫయర్‌-2లో తలపడుతున్నాయి.  ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ఫీల్డింగ్‌ తీసుకుంది. టాస్‌ గెలిచిన కేకేఆర్‌ కెప్టెన్‌ దినేశ్‌ కార్తీక్‌.. సన్‌రైజర్స్‌ ను ముందుగా బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. సన్‌రైజర్స్‌ మూడు మార్పులతో బరిలోకి దిగుతుంది. మనీష్‌ పాండే, శ్రీవాత్సవ్‌, సందీప్‌ శర్మలను తప్పించి, దీపక్‌ హుడా, సాహా, ఖలీల్‌లు తుది జట్టులోకి తీసుకున్నారు. కేకేఆర్‌ ఒక మార్పుతో పోరుకు సిద్ధమైంది. శివం మావికి జట్టులోకి రాగా, సీర్లెస్‌కు ఉద్వాసన పలికారు.

ప్రస్తుత లీగ్‌లో గెలుపు గణాంకాలను లెక్కలోకి తీసుకుంటే వరుస విజయాలతో ప్లే ఆఫ్స్‌ చేరిన హైదరాబాద్‌కు కోల్‌కతా సమీపానికి రాలేదు. కానీ, క్లిష్ట పరిస్థితుల్లోనూ పుంజుకుని ఆడుతున్న ఆ జట్టు ఒక్కో మెట్టు ఎక్కుతూ వచ్చింది. వారి పోరాటానికి తగినట్లే పరిణామాలు కలిసొచ్చి ఎలిమినేటర్, క్వాలిఫయర్‌–2 మ్యాచ్‌లు ఈడెన్‌ గార్డెన్స్‌కు మారాయి. ఈ నేపథ్యంలో నేటి మ్యాచ్‌లో ఆసక్తికర సమరానికి అవకాశం ఉంది.

ఇదిలా ఉంచితే, చివరి ఐదు మ్యాచ్‌ల్లో నాలుగు పరాజయాలు హైదరాబాద్‌ను కలవరపెడుతున్నాయి. ఓ దశలో పటిష్టంగా కనిపించిన జట్టు క్రమంగా వెనుకబడింది. తప్పులు పునరావృతం కాకుండా చూసుకుంటేనే ఫైనల్‌ చేరేందుకు అర్హత సాధిస్తుంది. సన్‌రైజర్స్‌ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌తో పాటు ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ చెలరేగాల్సిన అవసరం ఉంది. మనీష్‌ పాండే, శ్రీవాత్సవ్‌లను పక్కన కూర్చోబెట్టి సాహా, దీపక్‌ హుడాలను తుది జట్టులో తీసుకోవడం సన్‌రైజర్స్‌లో కీలక మార‍్పుగా చెప్పొచ్చు.

మరోవైపు మొదటి నుంచి అండగా ఉన్న బౌలింగ్‌ బలగం మరింత కట్టుదిట్టం అయితే ప్రత్యర్థిని తక్కువ స్కోరుకే పరిమితం చేసి పైచేయి సాధించవచ్చు. అదే సమయంలో వరుస విజయాలు కోల్‌కతా జట్టులో మంచి ఉత్సాహాన్ని తీసుకొచ్చాయి. అందులోనూ క్వాలిఫయర్‌-2 మ్యాచ్‌ ఆడబోయేది సొంత మైదానంలో కావడంతో కోల్‌కతా చెలరేగే అవకాశం లేకపోలేదు. అటు బ‍్యాటింగ్‌లో, ఇటు బౌలింగ్‌లోనూ సమస్థాయిలో ఉన్న కోల్‌కతా.. సన్‌రైజర్స్‌కు షాకివ్వాలని భావిస్తోంది. ఈ సీజన్‌లో ఇరు జట్ల మధ్య జరిగిన లీగ్‌ మ్యాచ్‌ల్లో చెరొకటి గెలిచాయి. దాంతో క్వాలిఫయర్‌-2లో ఎవరు విజయం సాధించి.. ఆదివారం ఫైనల్లో సీఎస్‌కేతో తలపడతారో చూద్దాం.

మరిన్ని వార్తలు