గంభీర్‌ సేనపై కేకేఆర్‌ భారీ విజయం

16 Apr, 2018 23:24 IST|Sakshi

కోల్‌కతా: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)లో భాగంగా ఇక్కడ ఈడెన్‌ గార్డెన్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ 71 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన కేకేఆర్‌ 201 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. లక్ష్యాన్ని ఛేదించే క‍్రమంలో బరిలోకి దిగిన గంభీర్‌ గ్యాంగ్‌ 14. 2 ఓవర్లలో 129 పరుగులకే చాపచుట్టేసింది. ఢిల్లీ ఆటగాళ్లలో రిషబ్‌ పంత్‌(43;26 బంతుల్లో 7ఫోర్లు, 1 సిక్సర్‌), గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌(47; 22 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లు) మాత్రమే రాణించగా, మిగతా ఆటగాళ్లంతా సింగిల్‌ డిజిట్‌కే పరిమితం కావడంతో ఘోర పరాజయం తప్పలేదు. ఈ సీజన్‌లో పరుగుల పరంగా ఇదే పెద్ద విజయం కావడం విశేషం. కేకేఆర్‌ బౌలర్లలో కుల్దీప్‌ యాదవ్‌, సునీల్‌ నరైన్‌ తలో మూడో వికెట్లు సాధించగా, పీయూష్‌ చావ్లా, రస్సెల్‌, శివం మావి, టామ్‌ కుర్రాన్‌లు తలో వికెట్‌ తీశారు.


అంతకుముందు టాస్‌ ఓడి బ్యాటింగ్‌ చేపట్టిన కేకేఆర్‌ నిర్ణీత ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి 200 పరుగులు చేసింది.  కేకేఆర్‌ ఆటగాళ్లు నితీష్‌ రానా, ఆండ్రీ రస్సెల్‌ మెరుపులు మెరిపించడంతో స్కోరు బోర్డు రెండొందల మార్కును చేరింది. రానా 35 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సర్లతో 59 పరుగులు చేయగా, రస్సెల్‌ 12 బంతుల్లో 6 సిక్సర్లతో 41 పరుగులు సాధించాడు. కేకేఆర్‌ కెప్టెన్‌ దినేశ్‌ కార్తీక్‌(19) ఔటైన తర్వాత వచ్చిన రస్సెల్‌.. నితీష్‌ రానాతో కలిసి కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. వీరిద్దరూ బౌండరీలను దాటించడమే లక్ష్యంగా చెలరేగి ఆడటంతో కేకేఆర్‌ స్కోరు బోర్డు పరుగులు తీసింది. ఈ క్రమంలోనే రానా హాఫ్‌ సెంచరీ నమోదు చేశాడు. అయితే రానా అర్థ శతకం సాధించిన తర్వాత రస్సెల్‌ ఐదో వికెట్‌గా పెవిలియన్‌ చేరాడు. మిగతా కేకేఆర్‌ ఆటగాళ్లలో క్రిస్‌ లిన్‌(31; 29 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్‌), రాబిన్‌ ఉతప్ప(35; 19 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లు) ఫర్వాలేదనిపించారు.

మరిన్ని వార్తలు