సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ లక్ష్యం 139

14 Apr, 2018 22:50 IST|Sakshi
పాండే అభినందిస్తున్న సన్‌రైజర్స్‌ ఆటగాళ్లు

మైమరిపించే ఫీల్డింగ్‌, బౌలింగ్‌తో అదరగొట్టిన ఆరేంజ్‌ ఆర్మీ

క్రిస్‌లిన్‌, దినేశ్‌ కార్తీక్‌, రానా మినహా అంతా సింగిల్‌ డిజిట్‌కే పరిమితం

కోల్‌కతా : సొంతగడ్డపై సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ 139 పరుగుల లక్ష్యాన్ని నిర్ధేశించింది. సన్‌రైజర్స్‌ అద్భుత బౌలింగ్‌కు మైమరిపించే ఫీల్డింగ్‌ తోడవ్వడంతో కోల్‌కతా బ్యాట్స్‌మన్‌ చతికిలపడ్డారు. క్రిస్‌లిన్‌, దినేశ్‌ కార్తీక్‌,రానా తప్ప అంతా సింగిల్‌ డిజిట్‌కే పరిమితమవ్వడంతో కోల్‌కతా స్పల్ప స్కోర్‌కే పరిమితమైంది. ఇక టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతాకు రాబిన్‌ ఊతప్ప (3) వికెట్‌ తీసి భువనేశ్వర్‌ షాకిచ్చాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన నితీష్‌ రాణాతో క్రిస్‌లిన్‌ రెచ్చిపోయాడు. దీంతో 7 ఓవర్లకు కోల్‌కతా 52 పరుగులు చేసింది. ఈ దశలో వర్షం మ్యాచ్‌కు అంతరాయం కలిగించింది.

పాండే ఫీల్డింగ్‌ అదుర్స్‌..
వర్షం తగ్గిన అనంతరం ఎలాంటి ఓవర్లు కుదించకుండా అంపైర్లు మ్యాచ్‌ను కొనసాగించారు. మ్యాచ్‌ పునఃప్రారంభమైన నాలుగు బంతులకే కోల్‌కతా స్టార్‌ బ్యాట్స్‌మన్‌ నితీష్‌ రాణాను పాండే అద్భుత క్యాచ్‌తో పెవిలియన్‌ చేర్చాడు. ఈ మ్యాచ్‌లో అనూహ్యంగా సెకండ్‌ డౌన్‌లో బ్యాటింగ్‌కు దిగిన సునీల్‌ నరైన్‌(9) నిరాశ పరిచాడు. ఆ వెంటనే క్రిస్‌లిన్‌49( 34 బంతులు,7 ఫోర్లు,1 సిక్సు) క్యాచ్‌ ఔటవ్వగా.. ఆండ్రూ రస్సెల్‌ను పాండే మరోమారు మైమరిపించే ఫీల్డింగ్‌తో పెవిలియన్‌కు పంపించాడు.

నిరాశ పరిచిన అండర్‌-19 స్టార్స్‌
ఇక దినేశ్‌ కార్తీక్‌ ఆచితూచి ఆడే ప్రయత్నం చేయగా.. యువ ఆటగాడు అండర్‌-19 సూపర్‌ హీరో శుభ్‌మన్‌ గిల్‌(3) తీవ్రంగా నిరాశపరిచాడు.  చివర్లో దినేశ్‌ కార్తీక్‌ 29(27 బంతుల్లో 2 ఫోర్లు,1 సిక్సు) క్యాచ్‌ ఔట్‌గా వెనుదిరగగా.. చివరి బంతికి మరో అండర్‌-19 ఆటగాడు శివం మావి (7) క్యాచ్‌ ఔటవ్వడంతో కోల్‌కతా నిర్ణీత 20 ఓవర్లకు 8 వికెట్లు కోల్పోయి 138 పరుగులు మాత్రమే చేయగలిగింది. హైదరాబాద్‌ బౌలర్లలో భువనేశ్వర్‌కు మూడు, స్టాన్‌లేక్‌, షకీబ్‌ అల్‌ హసన్‌లకు రెండు, సిద్దార్థ్‌ కౌల్‌కు ఒక వికెట్‌ దక్కింది.

మరిన్ని వార్తలు